అద్దె గర్బం భారతీయులకు మాత్రమే!

సరోగసికి భారతదేశం ఒక కేంద్రంగా మారడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కేవలం భారతీయులకు మాత్రమే అద్దె గర్భం అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసింది. విదేశీయులకు దేశంలో సరోగసికి అనుమతివ్వబోమని చెప్పింది. విదేశీయులు భారత మహిళలను అద్దె గర్భం కోసం వాడుకోవడాన్ని నిషేధిస్తామని అపిడవిట్‌లో తెలిపింది. అద్దెగర్భం ద్వారా జన్మించిన వికలాంగ శిశువులను తీసుకునేందుకు నిరాకరించే దంపతులకు జరిమానా విధించాలని భావిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కమర్షియల్ సరోగసి నియంత్రించేందుకు కొత్త చట్టం తయారు చేస్తామని చెప్పింది. దీనిపై తదుపరి విచారణను సుప్రీం నవంబర్ 24కు వాయిదా వేసింది.

సరోగసి అంటే ?

వృత్తి రిత్యా కానీ. అనారోగ్య సమస్యల వల్ల గానీ, సొంతంగా పిల్లలను కనలేని ధనిక మహిళలు ఎక్కువగా సరోగసిని ఆశ్రయిస్తున్నారు. పిల్లల కావాలనుకునే విదేశీయులకు ఇదో సులువైన మార్గంగా తయారైంది. సరోగసి ప్రక్రియ విధానంలో భార్యభర్తల నుంచి అండం, వీర్యం సేకరించి ల్యాబ్‌లో ఫలదీకరింపజేసి అద్దె తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారు. ఒకవేళ తల్లిదండ్రుల నుంచి అండం లేదా వీర్యం లభించకపోతే దాతల నుంచి సేకరిస్తారు. ప్రపంచంలోని చాలా దేశాల వారు పిల్లలను సరోగసి ద్వారా కనాలనుకుంటే తొలుత భారత్‌ వైపే వస్తున్నారు.

యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, అర్జెంటినా, బ్రెజిల్, ఐర్లాండ్, మంగోలియా, ఇజ్రాయిల్ ఇలా పలుదేశాల వారు మన దేశానికి వస్తున్నారు. అన్ని దేశాలను వదలేసి మన దేశానికే రావడానికి కారణం ఇక్కడి సామాజిక ఆర్థిక పరిస్థితులే. తక్కువ ధరకే సరోగసి తల్లులు మన దేశంలో దొరుకుతున్నారు. పేద మహిళలకు సొమ్ము ఆశచూపి సరోగసి ద్వారా పిల్లలను తీసుకెళ్తున్నారు. అభివృద్ధిలో నెంబర్ వన్ అని చెప్పుకునే గుజరాత్‌ ఈ విషయంలోనూ మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్‌లోనూ ఇటీవల ఈ తంతు ఎక్కువైంది. 2012 అధ్యయనం ప్రకారమే దేశంలో ఏటా 3వేల మంది సరోగసి ద్వారా పిల్లలను కనిపెడుతున్నారు. ఇప్పుడది మరింత పెరిగింది.