Telugu Global
Others

డీఎస్ .. అమరావతి అలక పానుపు

రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డీ. శ్రీనివాస్ కాంగ్రెస్‌లో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదంటూ ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అయితే ఇప్పుడాయన పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందని సన్నిహితులు చెబుతున్నారు. గౌరవంగా చూసుకుంటామని కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి టీఆర్ఎస్ చేరితే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని డీఎస్ సన్నిహితులు వాపోతున్నారు. కాంగ్రెస్‌లో కనీసం తమ నేతకు స్థానబలమైనా ఉండేదని … టీఆర్‌ఎస్ మాత్రం పక్కింటోడి పరిస్థితిలా ఉందని […]

డీఎస్ .. అమరావతి అలక పానుపు
X

రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డీ. శ్రీనివాస్ కాంగ్రెస్‌లో తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదంటూ ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అయితే ఇప్పుడాయన పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందని సన్నిహితులు చెబుతున్నారు. గౌరవంగా చూసుకుంటామని కేసీఆర్ చెప్పిన మాటలు నమ్మి టీఆర్ఎస్ చేరితే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని డీఎస్ సన్నిహితులు వాపోతున్నారు. కాంగ్రెస్‌లో కనీసం తమ నేతకు స్థానబలమైనా ఉండేదని … టీఆర్‌ఎస్ మాత్రం పక్కింటోడి పరిస్థితిలా ఉందని రుసరుసలాడుతున్నారు. ఇటీవల కేసీఆర్ తనను ట్రీట్ చేసిన విధానం చూసి డీఎస్ అప్పుడే అలకపాన్పు కూడా ఎక్కేశారట. డీఎస్ అలకకు మూలం ఏపీ రాజధాని అమరావతి దగ్గర ఉందని చెబుతున్నారు.

పార్టీలో చేరిన తర్వాత డీఎస్‌ను కేబినెట్‌ హోదాలో అంతర్‌రాష్ట్ర సంబంధాల సలహాదారుగా కేసీఆర్ నియమించారు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే వరకట్నం అన్నట్టుగా డీఎస్ కూడా ఆ పదవిని ఆనందంగా స్వీకరించారు. కానీ పోస్టు అయితే ఉందని గానీ దాని వల్ల డీఎస్‌కు ఎలాంటి పనిలేదట. అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించేందుకు చంద్రబాబు వస్తున్న సమయంలో అంతర్‌రాష్ట్ర సంబంధాల ప్రతినిధిగా తనను కూడా కేసీఆర్ వెంటబెట్టుకుంటారని డీఎస్ భావించారట. కానీ అది జరగలేదు. తన ఇంటికి వస్తున్న చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు గాను జగదీష్ రెడ్డి, మహమూద్ అలీలను మాత్రమే కేసీఆర్ పిలిపించుకున్నారు. దీంతో డీఎస్ అక్కడ కాస్త నొచ్చుకున్నారు.

సరే శంకుస్థాపనకైనా అంతర్రాష్ట సంబంధాల ప్రతినిధిగా తనను వెంటబెట్టుకుని వెళ్తారని డీఎస్ అనుకున్నారు. అది కూడా జరగలేదు. దీంతో డీఎస్‌కు తత్వం బోధపడిందని నేతలు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌లో తనకు సరైన గౌరవం దక్కడం లేదని సన్నిహితుల దగ్గర డీఎస్ వాపోయారట. అమరావతికి తీసుకెళ్లకపోవడాన్ని అవమానంగా భావించే ఈ మధ్య డీఎస్ పెద్దగా బయట కనిపించడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్‌లో పదవులు దక్కకపోయినా తన మాటకు కనీసం విలువైనా ఉండేదని… అవసరమైతే పోట్లాడే హక్కు అక్కడ ఉండేదని డీఎస్ అభిప్రాయపడుతున్నారు. కానీ టీఆర్ఎస్‌లో పరాయివాళ్లలాగే బతకాల్సి వస్తోందని డీఎస్ తన సన్నిహితుల దగ్గర వాపోయారు. పదవి కన్నా స్థాన బలం మిన్న అంటే ఇదే కాబోలు.

First Published:  28 Oct 2015 7:22 AM GMT
Next Story