మార్కెట్‌లోకి మళ్ళీ మ్యాగీ

పిల్లల ఆరోగ్యానికి హానికరమని, మ్యాగీలో ఆరోగ్యానికి హానికరమైన పదార్ధాలు ఉన్నాయని ల్యాబోరేటరీలు నిర్ధారించాక అనేక రాష్ట్రాలు మ్యాగీని నిషేధించాయి. కొన్ని సంవత్సరాలపాటు ఆరోగ్యానికి ప్రమాదకరమైన అలాంటి మ్యాగీ న్యూడుల్స్‌ని తయారుచేసిన నెస్‌లే కంపెనీ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదు కానీ నిషేధంవల్ల నెస్‌లే కంపెనీకి నష్టాలొస్తునందుకు కొంతమంది బాధపడ్డట్టు ఉన్నారు. పర్యవసానంగా మళ్ళీ మ్యాగీ న్యూడుల్స్‌ మీ వంటింట్లోకి రానున్నాయి. మీ పిల్లల ఆహారంలో భాగం కానున్నాయి.
మ్యాగీకి భారతదేశంలో ఐదు తయారీ కేంద్రాలున్నాయి. అందులో కర్ణాటక, పంజాబ్‌, గోవాలలో ఉన్న ఫ్యాక్టరీలలో నిన్నటి నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో వున్న మరో రెండు కేంద్రాల్లో త్వరలో ఉత్పత్తి ప్రారంభమౌతుంది. ఈ ఉత్పత్తులను మళ్ళీ ఇప్పుడు ల్యాబోరేటరీలకు పంపించి, పరీక్షించి ఆ ఉత్పత్తులను మార్కెట్‌లోకి పంపవచ్చని బాంబే హైకోర్టు తీర్పుఇచ్చింది.
పరీక్షకుపంపే న్యూడుల్స్‌లో ఎలాగూ హానికర పదార్ధాలు ఉండవు, ప్రభుత్వం ఓకే అంటుంది. ప్రజలదగ్గరకు అవి చేరుతాయి. మళ్ళీ నెస్‌లే కంపెనీ లాభాల్లోపడుతుంది. పిల్లలు న్యూడుల్స్‌మీద పడతారు. కథ సుఖాంతమౌతుంది.
మనందరికి అంతుపట్టని విషయం ఒక్కటే… ఇన్నేళ్ళపాటు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసిన వారిమీద తీసుకున్న చర్యలేమిటి? భారత్‌లాంటి దేశాల్లో అడగకూడని ప్రశ్న ఇదొక్కటే..!