యూపీలో 8 మంది మంత్రుల బర్తరఫ్‌

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు కోపం వచ్చింది. తన మంత్రుల తీరుపై అసంతృప్తిని వెళ్ళగక్కేందుకు ఆయనో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రి వర్గంలోని 8 మంది మంత్రులకు అకస్మాత్తుగా ఉద్వాసన పలికారు. వీరిలో ఐదుగురు క్యాబినెట్‌, మరో ముగ్గురు సహాయ మంతుల స్థాయిని అనుభవిస్తున్నారు. మరో 9 మంది మంత్రుల శాఖలను కూడా మార్చారు. తాజా నిర్ణయం ఆ రాష్ట్ర రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అఖిలేష్ యాదవ్ అకస్మాత్తుగా ఇలా బర్తరఫ్‌ నిర్ణయం తీసుకోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. శాసన సభ ఎన్నికలు 2016లో ఉన్న నేపథ్యంలో అఖిలేష్ తీసుకున్న ఈ నిర్ణయం కలకలం రేపుతోంది. యూపీ ప్రభుత్వ పనితీరుపై అఖిలేష్ తండ్రి, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మంత్రులను ఉన్నట్టుండి ఇలా ఒక్కసారిగా తొలగించే విషయం తన తండ్రి ములాయంసింగ్‌ యాదవ్‌కు చెప్పి చేశారా లేక స్వతంత్రంగానే నిర్ణయం తీసుకున్నారా అనే సందేహం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. కేవలం తన తండ్రి అసంతృప్తి వ్యక్తం చేసినంత మాత్రాన అఖిలేష్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉండకపోవచ్చు. అయితే మంత్రులపై అనేకసార్లు సీఎంగా అఖిలేష్‌ యాదవ్‌ కూడా అసంతృప్తి వెళ్ళగక్కారు. కాని ఇలా బర్తరఫ్‌ నిర్ణయం తీసుకుంటారని మంత్రులెవరూ ఊహించలేదు. ఈ పరిణామంతో సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇకనుంచైనా సరైన దారిలో నడుచుకుంటారా లేదో వేచి చూడాల్సిందే.