మాట కంటే పాటే మేల‌ట‌

అమ్మ క‌బుర్ల క‌న్నా, లాలిపాట‌ల‌నే చిన్నారులు ఎక్కువ‌గా ఎంజాయి చేస్తార‌ని ఒక అధ్య‌య‌నంలో తేలింది. క‌బుర్లు విన్న‌ప్ప‌టికంటే ఏదైనా పాట‌ని విన్న ప‌సిపిల్ల‌లు రెండింత‌లు ఎక్కువ‌గానూ, చాలా త్వ‌ర‌గానూ  ప్ర‌శాంత‌త‌ని పొందిన‌ట్టుగా ఈ అధ్య‌య‌నం చెబుతోంది. సంగీతం, పాటలు విన‌డం ద్వారా పిల్ల‌ల్లో భావోద్వేగాల‌ నియంత్ర‌ణా శ‌క్తి  పెరుగుతుంద‌ని దీని నిర్వాహ‌కులు అంటున్నారు. కెన‌డా వాణిజ్య రాజ‌ధాని మాంట్రియ‌ల్‌లో ఓ బ్రెయిన్ రీసెర్చి సెంట‌ర్ వారు ఈ అధ్య‌య‌నాన్ని నిర్వ‌హించారు.

ఇందుకోసం ఆరు, తొమ్మిది నెల‌ల మ‌ధ్య వ‌య‌సున్న‌30మంది ఆరోగ్య‌వంత‌మైన చిన్నారుల‌ను ఎంపిక చేసుకున్నారు. పిల్ల‌లు కాళ్ల‌ను క‌దిలించ‌డం, త‌ల‌ను ఆడించ‌డం, చేతుల‌తో కొట్ట‌డంతో, పాట‌ల‌ను వింటున్న‌పుడు తాము పొందుతున్న ఆనందాన్ని వ్య‌క్తం చేశార‌ని అధ్య‌య‌న నిర్వాహ‌కుల్లో ఒక‌రైన ప్రొఫెస‌ర్ ఇసాబెల్లే పెర‌జ్ అంటున్నారు. ఒక‌వేళ వారు అలా చేయ‌లేక‌పోతే వారిలో అందుకు త‌గిన శారీర‌క, మాన‌సిక సామ‌ర్ధ్యం లేద‌ని భావించాల‌ని ఆయ‌న చెబుతున్నారు. త‌ల్లి మాట‌లు వినిపించినా, త‌ల తిప్ప‌కుండా  పిల్ల‌లు ఏకాగ్ర‌త‌గా సంగీతంలో లీన‌మవ‌డం ఈ అధ్య‌య‌నంలో గ‌మ‌నించారు.

ఇందులో మ‌రిన్ని అంశాల‌ను ప‌రిశీలించారు. పిల్ల‌ల‌కు తెలియ‌ని ట‌ర్కీ భాష‌కు చెందిన పాట‌ను రికార్డు చేయించి వినిపించారు. పాడే మ‌నిషి క‌నిపించ‌క‌పోయినా కేవ‌లం వింటున్న పాట‌కే పిల్ల‌లు స్పందిస్తార‌నే విష‌యాన్ని ధృవీక‌రించ‌డానికి వారికి కేవ‌లం రికార్డు చేసిన పాట‌ల‌ను వినిపించారు. పాట‌లు వింటున్న‌పుడు పిల్ల‌లు క‌నీసం తొమ్మిది నిముషాల‌పాటు మౌనంగా కామ్‌గా ఉన్న‌ట్టుగా, అదే పిల్ల‌ల‌కు నేరుగా పెద్ద‌వాళ్ల మాట‌ల వినిపించిన‌పుడు నాలుగు నిముషాలు మాత్ర‌మే కామ్‌గా ఉండ‌టం గ‌మ‌నించారు. త‌రువాత చిన్నారుల‌కు వారి మాతృభాష‌లో త‌ల్లులు పాడిన పాట‌ల‌ను వినిపించిన‌పుడు కూడా చ‌క్క‌గా స్పందించ‌డం చూశారు.