అమరావతి నిర్మాణ గడువు పెంచిన చంద్రబాబు

అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఈ ఏడాదిన్నరలో ఆ సమయం తగ్గాల్సిందిపోయి విచిత్రంగా పెరిగింది. ఇప్పుడు ఐదేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ తరహాలోనే రాజధాని అమరావతిపైనా చంద్రబాబు గొంతు సవరించుకున్నారు.

మొన్నటి వరకు 2018 నాటికి రాజధాని తొలిదశ పూర్తి చేసి చూపిస్తామంటూ సవాల్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు గడువు పెంచుకుంది. రాజధాని తొలిదశ నిర్మాణం 2019 మార్చికి పూర్తి చేస్తామని విజయవాడలో జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. అది కూడా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు లాంటి భవనాలు పూర్తి చేస్తామని చెప్పారు. దీంతో అమరావతిపైనా పోలవరం తరహాలో గడువు పెంపు మంత్రాన్ని చంద్రబాబు పఠిస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది.

కొన్ని వారాల క్రితం కూడా 2018నాటికి తొలి దశ పూర్తి చేస్తామని చంద్రబాబు, మంత్రులు చెప్పారు. ఇప్పుడు మాత్రం గడవు ఏడాది పెంచేశారు. అయితే 2019 మార్చి నాటికి అసెంబ్లీ, సచివాలయం పూర్తి చేస్తామంటున్నారంటే.. ప్రస్తుత టర్మ్‌లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏపీలో శాశ్వత భవనంలో జరగవన్న మాట!.