పద్మభూషణ్‌ నాకొద్దు: శాస్త్రవేత్త భార్గవ

ప్రఖ్యాత శాస్త్రవేత్త పి.ఎం. భార్గవ తనకు లభించిన పద్మభూషణ్‌ అవార్డును తిరిగి కేంద్రానికి ఇచ్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలి సరిగా లేదని, మత సహనం పాటించక పోవడం, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి నిరసనగా తాను పద్మభూషణ్‌ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నానని భార్గవ ప్రకటించారు. ప్రజలకు ఏం తినాలో, ఏం చేయాలో ప్రభుత్వమే చెబితే ఇక ప్రజాస్వామ్యానికి అర్ధమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు రాజ్యాంగం అనేక రకాలుగా స్వేచ్ఛ ఇచ్చిందని, దాన్ని హరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంగాని, ఆర్‌ఎస్‌ఎస్‌గాని, భారతీయ జనతాపార్టీగాని ప్రజా విధానాల పట్ల వ్యవహరిస్తున్న తీరు తనకు నచ్చడం లేదని, ఇందుకు నిరసనగానే తాను పద్మభూషణ్‌ అవార్డును వెనక్కి ఇచ్చేయాలనుకుంటున్నానని భార్గవ ప్రకటించారు. ఇప్పటికే సుమారు వంద మంది రచయితలు సాహిత్య అకాడమీ అవార్డులు వెనక్కి ఇచ్చేసిన నేపథ్యంలో ఇపుడు శాస్త్రవేత్త భార్గవ తీసుకున్న నిర్ణయం మళ్ళీ చర్చనీయాంశమవుతుంది. భావ ప్రకటన స్వేచ్ఛకు సాహిత్య అకాడమీ కట్టుబడి ఉందని, రచయితలపై, మేధావులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని అకాడమీ ప్రకటించిన తరువాతకూడా దాడులు ఆగకపోవడంతో అనేకమంది రచయితలు, కళాకారులు, సినీప్రముఖులు తమ అవార్డులను వాపస్‌ చేసి కేంద్రప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇప్పుడు భార్గవలాంటి గొప్ప వ్యక్తి ఈ నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేదే.