బాబ్బాబు కారెక్కొద్దు… వరంగల్‌ హీరో మీరే!

… ఇది తెలంగాణ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వివేక్‌ వద్ద ఆ పార్టీ నేతల తీరు. ఒకసారి టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన వివేక్‌ మళ్ళీ కారెక్కడానికి ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన్ని టీ కాంగ్రెస్‌ నేతలు బతిమలాడుతున్నారు. కాంగ్రెస్‌ను వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరవద్దని… పైగా వరంగల్‌లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేయాలని కోరుతున్నారు. వివేక్‌ను తెలంగాణ కాంగ్రెస్ నేతలతోపాటు ఎఐసిసి పెద్దలు కూడా ఇలా బతిమాలాడుకుంటున్నారట. వరంగల్ సరైన అభ్యర్థి దొరక్కపోవడంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ఎలాగైనా వివేక్‌ను ఒప్పించి వరంగల్ బరిలోకి దించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. టి-పిసిసి నాయకులు ఎవరూ పోటీకి సిద్ధంగా లేరని, ఆర్థికంగా ఎన్నికలు భరించే స్థితిలో లేరని, వివేక్ అయితే ఆర్ధికంగా సమస్య కూడా ఉండదని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవచ్చునని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. వివేక్ ఒప్పుకోని పక్షంలో ఇక తప్పదనుకున్న పరిస్థితుల్లో మాత్రమే రాజయ్యకు సీటు ఇవ్వాలని టీ కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. దిగ్విజయ్ సింగ్ ఇవాళ ఢిల్లీలో వరంగల్ లోక్‌సభ పరిస్థితులు, అభ్యర్థి ఎంపికపై ఎఐసిసి నేతలకు రిపోర్టు ఇవ్వనున్నారు. దిగ్గీ రాజా కూడా వివేక్ వైపే మొగ్గు చూపుతున్నట్లు కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. రాజయ్య పోటీకి సిద్ధంగా ఉన్నా ఆర్థికంగా ఆయన శక్తిమంతుడు కాదని, నిధులు ఇచ్చే స్థితిలో కాంగ్రెస్‌ పార్టీకి లేదని, అందువల్ల వివేకే టీఆర్‌ఎస్‌ ఎవరిని బరిలో పెట్టినా రాజకీయంగా, ఆర్థికంగా ధీటుగా పోటీ ఇవ్వగలడని భావిస్తున్నారు.