Telugu Global
Others

ఒకే బిడ్డ నిబంధనకు చైనా మంగళం

ప్రపంచ జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనా ‘ఒక జంటకు ఒకే బిడ్డ’ నియమాన్ని ఎత్తివేసింది. దీంతో ఇపుడు ఇద్దరు పిల్లల్ని కనడానికి వెసులుబాటు కలిగింది. 36 సంవత్సరాల క్రితం పెట్టిన ఈ ‘సింగిల్‌ చైల్డ్‌’ విధానం అమలులో కనబరచిన అమానుషత్వం కారణంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశంలో వృద్ధుల సంఖ్య అమితంగా పెరిగిపోవడమూ, యువకుల సంఖ్య తగ్గిపోయి శ్రామికశక్తి లేక పోవడం ఈ విధానంలో మార్పుకు కారణమని చెబుతున్నారు. ఒక్క బిడ్డ నిబంధన కారణంగా చైనాలో కూడా […]

ఒకే బిడ్డ నిబంధనకు చైనా మంగళం
X
ప్రపంచ జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనా ‘ఒక జంటకు ఒకే బిడ్డ’ నియమాన్ని ఎత్తివేసింది. దీంతో ఇపుడు ఇద్దరు పిల్లల్ని కనడానికి వెసులుబాటు కలిగింది. 36 సంవత్సరాల క్రితం పెట్టిన ఈ ‘సింగిల్‌ చైల్డ్‌’ విధానం అమలులో కనబరచిన అమానుషత్వం కారణంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. దేశంలో వృద్ధుల సంఖ్య అమితంగా పెరిగిపోవడమూ, యువకుల సంఖ్య తగ్గిపోయి శ్రామికశక్తి లేక పోవడం ఈ విధానంలో మార్పుకు కారణమని చెబుతున్నారు. ఒక్క బిడ్డ నిబంధన కారణంగా చైనాలో కూడా మగపిల్లల పట్ల మక్కువ పెరిగిపోవడంతో లింగ నిర్ధారణ పరీక్షలతో ఆడపిల్లలను హత్య చేయడం మొదలైంది. ఆడపిల్లల నిష్పత్తి తగ్గిన ఫలితం ఇప్పుడు చైనా పలు ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలైంది. ఆడ మగ నిష్పత్తిలో 17 శాతం వ్యత్సాసం కనిపించడం… ఒక యువతి ఇద్దరు వ్యక్తులకు పెళ్ళి చేసుకోవచ్చన్న ప్రతిపాదన వెలుగులోకి రావడంతో చైనా ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. మరో ఐదేళ్ళలో రెండున్నర కోట్ల మంది యువకులు పెళ్ళి చేసుకోవడానికి భాగస్వాములు దొరకరని అంచనా. ఒకే బిడ్డ నియమం కారణంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఒక్కరిపైనే అన్నింటికీ ఆధారపడవలసి రావడం తీవ్ర సమస్యలను సృష్టిస్తున్నది. ఇప్పుడు చైనా జనాభాలో మూడోవంతు మంది యాభై యేళ్ళకు పైబడి ఉండడంతో సమాజంలో అనేక రుగ్మతలకు మూలమవుతోంది. ఒకే బిడ్డ నిబంధన అమల్లోకి వచ్చిన ఈ 36 యేళ్ళలో చైనా దాదాపు 4 కోట్ల మంది సంతానాన్ని కోల్పోయినట్టు అంచనా వేస్తున్నారు. దీని ఫలితమే దేశానికి యువ శ్రామికశక్తి లేకుండా పోయింది. రానున్న ప్రమాదాన్ని గుర్తించిన చైనా ఇపుడు ఒకే బిడ్డ నిబంధనను తొలగించాలని నిర్ణయించింది.
First Published:  29 Oct 2015 11:03 PM GMT
Next Story