టీ-ఆర్టీసీకి కొత్తగా 500 బస్సులు: రవాణా మంత్రి

తెలంగాణకు కొత్తగా 500 బస్సులు రానున్నాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేంద్రర్‌రెడ్డి తెలిపారు. ఇందులో 400 బస్సులు పల్లెవెలుగు కింద గ్రామాలకు కేటాయించామని, మరో 100 బస్సులు ఏసీతో జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నడపనున్నామని ఆయన తెలిపారు. భక్తులను దృష్టిలో పెట్టుకుని షిర్డి, తిరుపతి వంటి పుణ్య క్షేత్రాలకు కూడా కొన్ని బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం వచ్చే డిసెంబర్‌, జనవరిలో ప్రత్యేకంగా 200 బస్సులు కేరళకు నడపనున్నట్టు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీని లాభాల బాటలో పెట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని, బస్సుల కేటాయింపులో జిల్లాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికగా ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.