చిరంజీవి వ‌ర్రీ అదేనా..?

చిరంజీవి.. ఈ నాలుగు అక్ష‌రాలు తెలుగు సినీచ‌రిత్ర‌లో విప్ల‌వాలు సృష్టించాయి.. ఎంతోమంది న‌ట‌జీవితానికి బీజాక్ష‌రాలు రాశాయి.. తెర‌పై ఆ పేరు చూడ‌గానే.. ప్రేక్ష‌కులు సీట్ల‌లో నుంచి లేచి ఈల‌లు కొట్టి పండ‌గ చేసుకుంటారు.. మెగాస్టార్‌గా ఇటు తెలుగు రాష్ర్టాల్లో, ప్ర‌ముఖ తార‌గా అటు ద‌క్షిణాదిలోనే తిరుగులేని న‌టుడిగా ఆవిర్భ‌వించాడు. త‌మ్ముళ్లు నాగ‌బాబు, క‌ళ్యాణ్ బాబుల తెరంగ్రేట్రానికి బాటలు వేశాడు. బామ్మ‌ర్ది అల్లు అర‌వింద్ స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా, అత‌ని కుమారుడు అల్లు అర్జున్ హీరోగా రాణించ‌డానికి చేయూత అందించాడు. ఇక ఇటీవ‌ల చిరంజీవి మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌, నాగ‌బాబు కుమారుడు వ‌రుణ్‌తేజ్‌లు హీరోలుగా ఇండ‌స్ట్రీలో త‌మకంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌రుచుకున్నారు. వీరంద‌రిలో కామ‌న్ పాయింట్ ఏంటంటే.. చిరంజీవి కుటుంబానికి చెందిన‌ప్ప‌టికీ.. వీరంతా ఎక్క‌డా మెగాస్టార్‌ నీడ ప‌డ‌కుండా సొంత హావ‌భావాలు, ప్ర‌త్యేక‌మైన మేన‌రిజాల‌తో త‌మ‌కంటూ ప్ర‌త్యేక శైలి ఏర్ప‌రుచుకున్నారు. వీరంద‌రి విష‌యంలో సంతృప్తిగానే ఉన్న చిరంజీవి.. వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తమ‌వుతున్న‌ రామ్ చ‌ర‌ణ్ విష‌యంలో మాత్రం వ‌ర్రీ అవుతున్నార‌ని ఫిలింన‌గ‌ర్‌లో ఓ టాక్ వినిపిస్తోంది..! అదేంటి?   రామ్ చ‌ర‌ణ్‌కు ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చిన న‌ష్ట‌మేంట‌ని అనుకుంటున్నారా?
కార‌ణాలు అవే?
రామ్ చ‌ర‌ణ్ తొలిసినిమా చిరుత త‌రువాత వ‌చ్చిన మ‌గ‌ధీర చిత్రాలు స‌క్సెస్ అయినా.. ఆ విజ‌యాలు ద‌ర్శ‌కుల ఖాతాలోకి వెళ్లాయి. ఇక ర‌చ్చ, నాయ‌క్‌ సినిమా మాత్ర‌మే రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో సోలో హిట్లుగా నిలిచాయి. త‌రువాత అమితాబ్ బ‌చ్చ‌న్ జంజీర్ సినిమాను బాలీవుడ్‌లో అదే పేరుతో.. తెలుగులో తుఫాన్ పేరుతో విడుద‌ల చేశారు. రెండు చోట్లా ఘోర‌ప‌రాజ‌యాన్ని మిగిల్చింది. ఇక‌ అప్ప‌టి నుంచి బాలీవుడ్ వైపు క‌న్నెత్తి చూడ‌లేదు రామ్ చ‌ర‌ణ్‌. ఇక త‌రువాత వ‌చ్చిన ఎవ‌డు సినిమా హిట్ట‌యినా అల్లు అర్జున్ పాత్ర‌కు వ‌చ్చినంత క్రేజ్ రామ్‌కు రాలేదు.  ఇక ఇటీవ‌ల వ‌చ్చిన గోవిందుడు అంద‌రివాడేలే!, బ్రూస్‌లీ సినిమాలు డిజాస్ట‌ర్‌లుగా ముద్ర‌వేసుకున్నాయి. బ్రూస్‌లీలో చిరంజీవి ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించిన‌ప్ప‌టికీ.. ఈ సినిమాను అభిమానులే ఆద‌రించలేదు. ఇదే చిరంజీవి బెంగ‌కు కార‌ణ‌మంట‌.  చిరంజీవిలాంటి సినీదిగ్గ‌జాల కుమారుడు అన‌గానే.. కోట్లాది మంది అభిమానుల్లో స‌హ‌జంగానే భారీ అంచ‌నాలు ఉంటాయి. మార్కెట్ కూడా అంతే భారీగా ఉంటుంది. కానీ, కొంత‌కాలంగా రామ్‌చ‌ర‌ణ్ ను వ‌రుస వైఫ‌ల్యాలు వెంటాడుతుండ‌టంతో కుమారుడి కెరీర్‌పై చిరంజీవి ఆందోళ‌న‌గా ఉన్న‌ట్లు ఫిలింన‌గ‌ర్‌లో ఓ టాక్ షికారు చేస్తోంది.
150వ సినిమా అందుకే ప‌క్క‌కు పెట్టారా?
కోట్లాదిమంది చిరంజీవి అభిమానులు ఆయ‌న చేసే 150 సినిమా కోసం ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. రామ్ కెరీర్ గ్రాఫ్ ఒడిదుడుకుల‌తో సాగుతుండ‌టంతో ఆయ‌న త‌న చిత్రాన్ని సైతం ప‌క్క‌కు పెట్టి రామ్ చ‌ర‌ణ్‌కు చ‌క్క‌టి క‌థ కోసం అన్వేష‌ణ సాగిస్తున్నాడ‌ని స‌మాచారం. ఈ విష‌యంలో అన్నయ్య ఆందోళ‌న‌ను గ‌మ‌నించిన ప‌వ‌ర్‌స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా రామ్‌తో ఓ సినిమా చేయాల‌ని ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌ను కోరిన‌ట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ న‌డుస్తోంది. రామ్‌చ‌ర‌ణ్ కు  ఓభారీ హిట్ ఇచ్చేంత‌వ‌ర‌కు చిరంజీవికి సంతృఫ్తి ఉండ‌ద‌ని ఇండ‌స్ట్రీ పెద్ద‌లు, ఆయ‌న అభిమానులు బ‌హింరంగంగానే చ‌ర్చించుకుంటున్నారు. ఇటీవ‌లే త‌మిళంలో హిట్ అయిన త‌ని ఒరువ‌న్ రీమేక్‌లో రామ్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే! ఈ సినిమాపై చిరంజీవి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నాడ‌ట‌. త‌మిళంలో సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో మ‌రింత పెద్ద హిట్ చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడ‌ట చిరంజీవి..!