‘అసహనం’పై మోదీని హెచ్చరించిన మూడీస్‌

భారతీయ జనతాపార్టీ సభ్యుల ‘అసహన’ వైఖరిని అదుపులో పెట్టకపోతే అది దేశీయంగాను, విదేశాల్లోను కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను మంట గలుపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మూడీస్‌ సంస్థ హెచ్చరించింది. బీజేపీ సభ్యులు, ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు వ్యక్తం చేస్తున్న ‘అసహనం’ అంతర్జాతీయంగా మోదీ విశ్వసనీయతను దెబ్బ తీస్తుందని మూడీస్‌ పేర్కొంది. ఎన్నికల వాగ్దానాల అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఈ సంస్థ ఎత్తి చూసింది. ఎగువసభలో అసలే బలం లేని బీజేపీ ప్రభుత్వానికి ఇలాంటి వ్యవహారాల కారణంగా మరిన్ని సమస్యలు రావడం ఖాయమని, సభ్యుల వివాదాస్పద వ్యాఖ్యల వల్ల చట్ట సభలో చర్చలు పక్కదారి పడతాయని, దేశంలో హింసాకాండ పెచ్చరిల్లితే కీలకమైన బిల్లులు ఆమోదం పొందడం కూడా సాధ్యపడదని హెచ్చరించింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వానికి ఎగువసభలో మెజారిటీ లేదు. ఇదే సమయంలో ఇపుడు బీహార్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి అధికారం దక్కించుకోవడం చాలా అవసరం. ఇది సాధ్యమయితేనే ఎగువసభలో త్వరలో కొంత మెజారిటీ దక్కించుకోవడానికి వీలవుతుంది. ఇది లబిస్తే కొన్ని కీలక బిల్లుల ఆమోదం సాధ్యమవుతుంది. దేశంలో అత్యంత పెద్దది, పేదది అయిన బీహార్‌ ఎన్నికల ఫలితాలు మోది పాలనకు గీటురాయిగా భావించడం ఖాయం. ఈ ఆర్ధిక సంవత్సరం అంతానికి 7.6 శాతం జీడీపీ గ్రోత్‌ సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధించాలంటే ముందు ప్రతిపక్షాలను ప్రసన్నం చేసుకోవాలి. దీంతోపాటు బీహార్‌ ఎన్నికల్లో గెలవాలి. ఎందుకంటే వీటి ఫలితాలు ఎగువసభలో బీజేపీకి బలాన్నిస్తాయి. పైగా కీలకమైన భూ సంస్కరణల బిల్లు, కార్మిక చట్టాల సవరణ బిల్లు, జీఎస్‌టి బిల్లుల ఆమోదానికి ఉపకరిస్తుంది. ఈ మూడు బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందితేనే బీజేపీ ప్రభుత్వం ఆశించిన జీడీపీ గ్రోత్‌ రేటు సాధ్యమవుతుందని మూడీస్‌ నివేదిక చెబుతోంది.
2015లో ఈ బిల్లుల ఆమోదం సాధ్యం కాకపోవచ్చని, కనీసం వచ్చే సంవత్సరమయినా ఇవి ఆమోదం పొందాలంటే బీజేపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంతోపాటు కొత్త సమస్యలు సృష్టించుకోకుండా ఉండాల్సిన అవసరం ఉందని మూడీస్‌ పేర్కొంది. బీజేపీ శ్రేణులు నోరు జారకుండా చూసుకోవడం… దేశ ప్రజలకు… ముఖ్యంగా మేధావుల్లో అసహనం కలగకుండా చూసుకోవడం కూడా ముఖ్యమైన అంశాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోది ఈ విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మూడీస్‌ నివేదిక స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా భారత్‌ పట్ల, ముఖ్యంగా మోదీ పట్ల ప్రస్తుతమున్న దృక్పథం మారకుండా చూసుకోవడం అవసరమని, దీనివల్ల ఎగుమతులు పెరిగి ఆర్దికవృద్ధి సాధ్యమవుతుందని మూడీస్‌ పేర్కొంది.