Telugu Global
POLITICAL ROUNDUP

అమ్మో... విజయవాడ మగవాళ్లు

ఆఫీసులో తన కొలీగ్ అయిన అమ్మాయిని తీవ్రంగా వేధించే ఒక యువకుడు ఇంటికి వచ్చి, తన తల్లి చెల్లితో మామూలుగా ఏమాత్రం గిల్టీనెస్ లేకుండా మాట్లాడుతుండవచ్చు. అలాగే ఇంట్లో భార్యని కొట్టి తిట్టి వేధించే భర్త ఆఫీస్‌కి వెళ్లి ఎంతో మంచివాడిగా సాటి మహిళా కొలీగ్స్ చేత నీరాజనాలు అందుకుంటూ ఉండవచ్చు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అసభ్య పదజాలంతో తిట్టడం, కొట్టటం ఇవన్నీ సమాజంలో మంచివాళ్లుగా చలామణి అయ్యే ఉత్తమ పురుషులే చేస్తుంటారు. అందుకే ఈ హింసకు భరతవాక్యం పలకలేకపోతున్నాం. అది మన లైఫ్‌స్టైల్‌లో […]

అమ్మో... విజయవాడ మగవాళ్లు
X

ఆఫీసులో తన కొలీగ్ అయిన అమ్మాయిని తీవ్రంగా వేధించే ఒక యువకుడు ఇంటికి వచ్చి, తన తల్లి చెల్లితో మామూలుగా ఏమాత్రం గిల్టీనెస్ లేకుండా మాట్లాడుతుండవచ్చు. అలాగే ఇంట్లో భార్యని కొట్టి తిట్టి వేధించే భర్త ఆఫీస్‌కి వెళ్లి ఎంతో మంచివాడిగా సాటి మహిళా కొలీగ్స్ చేత నీరాజనాలు అందుకుంటూ ఉండవచ్చు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అసభ్య పదజాలంతో తిట్టడం, కొట్టటం ఇవన్నీ సమాజంలో మంచివాళ్లుగా చలామణి అయ్యే ఉత్తమ పురుషులే చేస్తుంటారు. అందుకే ఈ హింసకు భరతవాక్యం పలకలేకపోతున్నాం. అది మన లైఫ్‌స్టైల్‌లో ఒక భాగం అన్నంత సహజంగా మనతో పాటు ప్రయాణం చేస్తోంది. ఈ విష‌యాల‌న్నీ నిజ‌మేన‌ని నిరూపిస్తూ 25శాతం మంది భారతీయ పురుషులు ఏదోఒక రకంగా ఆడవాళ్లను వేధింపులకు గురిచేసిన, చేస్తున్న‌వారేన‌ని ఒక అధ్యయనం తేల్చి చెప్పింది.

ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చి ఆన్ ఉమెన్, మరో రెండు సంస్థలు కలిసి నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ నిజం తేలింది. ఇందులో పాల్గొన్న‌వారిలో 24.5శాతం మంది జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇలాంటి హింసకి పాల్పడినవారేనని, వీరిలో చాలామంది తమకు సన్నిహితులైన స్త్రీలనే ఇలాంటి వేధింపులకు గురిచేశారని ఈ స్టడీలో వెల్లడైంది. ఢిల్లీ, విజ‌య‌వాడ‌ల‌కు చెందిన 2వేల మందిని ఈ అద్య‌య‌నం కోసం ఎంపిక చేశారు. వీరంతా 18-59 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సువారు. అత్యాచారం, మ్యారిట‌ల్ రేప్‌, గ్యాంగ్‌రేప్‌, ఆల్క‌హాల్ ప్ర‌భావం త‌దిత‌ర అంశాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని వీరిని ప్ర‌శ్నించారు.

అయితే ఈ హింస‌కు కార‌ణ‌మేంట‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఒక ఆస‌క్తిక‌ర‌మైన అంశం వెలుగుచూసింది. మ‌హిళ‌ల‌ను హింసిస్తున్న మ‌గ‌వారిలో చాలామంది చిన్న‌త‌నంలో లైంగిక వేధింపుల‌కు, నిర్ల‌క్ష్యానికి, ప్రేమ‌లేమికి గుర‌యిన‌వారే. వీరే పెద్ద‌యిన త‌రువాత స్త్రీలపై అత్యాచారాల‌కు, హింస‌కు, వేధింపుల‌కు ఎక్కువ‌గా పాల్ప‌డుతున్నారు. ఇక ఆ త‌రువాత కార‌ణంగా ఆల్క‌హాల్ ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మ‌హిళ‌ల‌పై హింస‌కు ప్ర‌ధాన కార‌ణంగా ఆల్క‌హాల్‌ని ప్ర‌స్తావిస్తూ వ‌చ్చాం. అయితే ఈ స్ట‌డీ మ‌రొక ముఖ్య‌మైన కోణాన్ని వెలుగులోకి తెచ్చింది.

మ‌న స‌మాజంలో బాలల‌కు భ‌ద్ర‌త లేద‌నే విష‌యం ఎన్నో సంద‌ర్భాల్లో రుజువ‌వుతూనే ఉంది. ఆ దుష్ప‌రిణామం త‌రువాత కాలంలో సైతం ఇలా ఒక సామాజిక రుగ్మ‌త‌గా బ‌య‌ట‌ప‌డ‌టం విషాద‌మే. లైంగిక హింస‌కు పాల్ప‌డుతున్న మ‌గ‌వారిలో 34శాతం మంది చిన్న‌త‌నంలో అలాంటి హింస‌ని ఎదుర్కొన్నారు. అలాగే స్త్రీలను హింసిస్తున్న 36.8 శాతం మంది తాము చిన్న‌త‌నంలో నిర్ల‌క్ష్యానికి గుర‌యిన‌ట్టుగా తెలిపారు. అధ్య‌య‌నంలో పాల్గొన్న‌వారిలో స‌గం మంది భార్య‌ల‌ను శారీర‌కంగా హింసిస్తున్నామ‌ని, లైంగిక హింస‌కు గురిచేస్తున్నామ‌ని ఒప్పుకున్నారు.

నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందిస్తున్న వివ‌రాల‌ను బ‌ట్టి మ‌నదేశంలో ప్ర‌తిరోజూ 90మంది మ‌హిళ‌లు అత్యాచారానికి గుర‌వుతున్నారు. ఇవి న‌మోదు అవుతున్న‌వి… న‌మోదు కానివి ఇంకెన్ని ఉన్నాయో…

అధ్య‌య‌నం నిర్వ‌హించిన కొన్ని దేశాల్లో, చిలీతో పాటు మ‌న‌దేశంలో అత్యాచార కార‌ణాల్లో ఆల్క‌హాల్ ప్ర‌భావం ముఖ్య‌మైన‌దిగా ఉంది. టిటి రంగ‌నాథ‌న్ క్లినిక‌ల్ రీసెర్చి ఫౌండేష‌న్ నుండి నాలుగు ద‌శాబ్దాలుగా నేరాల‌పై ఆల్క‌హాల్‌, డ్ర‌గ్స్ ప్ర‌భావాలను గురించి ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ శాంతి రంగ‌నాథ‌న్ ఈ విషయాన్ని ప్ర‌స్తావిస్తూ, మ‌త్తు ప‌దార్థాలు స‌హ‌జంగా ఉండే మ‌నిషిత‌త్వాన్ని మొద్దుబారేలా చేస్తాయ‌న్నారు. ఢిల్లీలో నిర్భ‌య ఘ‌ట‌న‌లో నేర‌స్తులంద‌రూ మ‌ద్యం తాగే ఉన్నార‌ని, అలాంటి ప‌రిస్థితుల్లో ఉన్న‌వారిలో ఒక బూట‌క‌పు ధైర్యం ఆవ‌రిస్తుంద‌ని, అందుకే వారు తాము చేస్తున్న నేరం వ‌ల‌న ఎదుర్కొనే ఫ‌లితాల‌ను గురించి ఆలోచించ‌లేర‌ని శాంతి అన్నారు.

ఈ అధ్య‌య‌నంలో మ‌రొక అంశం సైతం వెల్ల‌డైంది. చ‌దువుకున్న‌వారు, మంచి ఉద్యోగంలో ఉన్న‌వారు, పెద్ద‌వ‌య‌సువారు, వివాహితులు ఇలాంటివారంతా అలాంటి నేరాలు చేయ‌ర‌నే భ్ర‌మ‌ని ఇది ప‌టాపంచ‌లు చేసింది. ఎందుకంటే మ‌న‌దేశంలో భ‌ర్త‌లు, తండ్రుల హోదాల్లో ఉన్న‌వారే ఇలాంటి ఘాతుకాల‌కు ఎక్కువ పాల్ప‌డుతున్నారని అధ్య‌య‌న ఫ‌లితాలను బ‌ట్టి తెలుస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కు స్త్రీ పురుష స‌మాన‌త్వం లేక‌పోవ‌డం ఒక్క‌టే స్త్రీల‌పై హింస‌కు కార‌ణంగా మ‌నం భావిస్తూ వ‌చ్చాం. కానీ ఈ అధ్య‌య‌న ఫ‌లితాల‌ను బ‌ట్టి మ‌న‌కు కొన్ని విష‌యాలు స్ప‌ష్ట‌మ‌వుతున్నాయి. పిల్ల‌ల‌కు ఆరోగ్య‌వంత‌మైన బాల్యం ఇవ్వ‌లేక‌పోతే, వారికి సంస్కార‌వంత‌మైన స‌మాజాన్ని అందించ‌లేక‌పోతే ఆ ఫ‌లితం త‌ప్ప‌కుండా స‌మాజం తిరిగి అనుభ‌వించాల్సి ఉంటుంది. చిన్న‌త‌నంలో లైంగిక వేధింపులు, ప్రేమ‌లేమి, నిర్ల‌క్ష్యాల‌కు గుర‌యిన మ‌గ‌పిల్ల‌ల్లో దాని తాలూకూ నీలినీడ‌లు అంత‌రంగంలో ఉంటాయి. ఆ ఒత్తిడిని, ప్ర‌తీకార వాంఛ‌ను వారు పెద్ద‌య్యాక‌ త‌మ‌కంటే బ‌ల‌హీను‌ లైన స్త్రీల‌పై చూపిస్తున్నారు. నేడు మృగాడుగా పిలువ‌బ‌డుతున్న ప్ర‌తి వ్య‌క్తీ నిన్న‌టి అమాయ‌క‌పు బాలుడు, ఏదో ఒక రూపంలో బాధితుడు. అలాగే నేటి అమాయ‌క‌పు మ‌గ‌పిల్ల‌ల‌ను స‌క్ర‌మంగా పెంచ‌లేక‌పోతే వారిలో కొంద‌రు రేపు మృగాళ్లుగా మార‌వ‌చ్చు. అంత‌రంగంలోకి వెళ్లిన‌ది ప్రేమ‌యినా క‌క్ష అయినా, ఏద‌యినా స‌రే బ‌య‌ట‌కు రావాల్సిందే…భూమిలోకి పాతిన విత్త‌నం మొల‌కెత్తిన‌ట్టుగా. ఇదంతా ఒక విష‌వ‌ల‌యం లాంటిది. అందుకే దీనికి ముగింపు క‌నిపించ‌డం లేదు.

మాన‌సిక నిపుణులు ఇస్తున్న స‌మాచారాన్ని బ‌ట్టి చిన్న‌త‌నంలో లైంగిక వేధింపుల‌కు గుర‌యిన మ‌గ‌పిల్ల‌లు పెద్ద‌య్యాక‌…

  • తాను మ‌గ‌వాడిన‌ని నిరూపించుకోవాల‌ని ఆరాట‌ప‌డ‌తారు.
  • శారీర‌కంగా బ‌లంగా త‌యారుకావాల‌ని ఆశిస్తారు. ప్రమాద‌క‌ర‌మైన‌, హింసాత్మ‌క ప్ర‌వృత్తితో తాము బ‌ల‌వంతుల‌మ‌ని నిరూపించుకోవాల‌నుకుంటారు.
  • లైంగిక విశృంఖ‌ల‌త్వం ప్ర‌ద‌ర్శిస్తారు. ఎక్కువ‌మంది మ‌హిళ‌ల‌తో అనుబంధం కావాల‌నుకుంటారు.
  • స్త్రీ పురుష భేదాన్ని గుర్తించ‌డంలో గంద‌ర‌గోళానికి గుర‌వుతుంటారు.
  • తాను ఒక ప‌రిపూర్ణ‌మైన మ‌గ‌వాడిని కాదేమో అనే ఆందోళ‌న‌తో ఉంటారు.
  • త‌మ పురుష‌త్వంపై ఆత్మ‌విశ్వాసంతో ఉండ‌లేరు.
  • ఎవ‌రితోనూ స‌న్నిహితంగా మెల‌గ‌లేరు.
  • త‌న‌కు హోమో సెక్సువ‌ల్‌ లేదా గే ల‌క్ష‌ణాలు వ‌స్తాయేయో అనే భ‌యం ఉంటుంది.
  • లైంగిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లుంటాయి.

-వి. దుర్గాంబ‌

First Published:  31 Oct 2015 8:37 PM GMT
Next Story