టీవీ చూస్తే.. 8 ర‌కాల చావులు

మీ ఇంట్లో టీవీ ఉందా? 3-4 గంట‌లకుపైగా టీవీ చూస్తున్నారా? అయితే, మీ ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉంది. ఒక‌టి కాదు రెండు కాదు..ఏకంగా 8 ర‌కాల ప్రాణాంత‌క వ్యాధులు మీ శ‌రీరంపై దండ‌యాత్ర చేసి మిమ్మ‌ల్ని హ‌త‌మారుస్తాయ‌ని అమెరికా శాస్ర్త‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. టీవీ చూడ‌టం వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల‌పై అమెరికాలోని నేష‌న‌ల్ క్యాన్స‌ర్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిచిగాన్ నిర్వ‌హించిన‌ ప‌రిశోధ‌న‌లో ఈ విష‌యం వెల్ల‌డైంది.  రోజుకు 3-4 గంట‌ల పాటు టీవీ చూసే వారికి డ‌యాబెటిస్‌, గుండె, కాలేయ‌, పార్కిన్‌స‌న్‌, ఇన్‌ఫ్లుయెంజా, న్యుమోనియా, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల ప్ర‌మాదం పొంచి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. పైన పేర్కొన్న వ్యాధుల‌తో మ‌ర‌ణించేవారిలో 15 శాతం మంది రోజుకు 3-4 గంట‌లు టీవీ చూస్తున్న‌ట్లు గుర్తించారు. అదే రోజుకు 7 గంట‌ల‌కు పైగా టీవీ చూసేవారు ఈ వ్యాధుల బారిన‌ప‌డి మ‌ర‌ణించేందుకు 47 శాతం అవ‌కాశ‌ముంద‌ని స్ప‌ష్టం చేశారు. 
బ‌ద్ద‌క‌మే ప్ర‌ధాన కార‌ణం..!
పైన పేర్కొన్న వ్యాధులు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం బ‌ద్ద‌కం, వ్యాయామానికి దూరం కావ‌డ‌మే. నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో వ్యాయామం లేక‌పోవ‌డం ప్ర‌తి మ‌నిషికి ఆరోగ్య స‌మ‌స్య‌లు తెచ్చిపెడుతోంది. వ్యాయామం లోపించిన శ‌రీరంలో వ్యాధి నిరోధ‌క‌త త‌గ్గిపోతుంది. ఫ‌లితంగా డ‌యాబెటిస్‌, గుండె సంబంధిత వ్యాధులు త్వ‌ర‌గా ద‌రిచేరుతున్నాయి. ప్ర‌స్తుతం ఇండిమాలో 6.5 కోట్ల మంది షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు ఉండ‌టం దేశ ఆరోగ్య ప‌రిస్థితిపై ప్రమాద ఘంటిక‌లు మోగిస్తోంది. ప్ర‌పంచంలో షుగ‌ర్ రోగుల సంఖ్య‌లో చైనా ప్ర‌థ‌మ స్థానంలో ఉండ‌గా, ఇండియాది త‌రువాత స్థానం. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే.. త్వ‌ర‌లో భార‌త‌దేశ‌మే మొద‌టి స్థానాన్ని ఆక్ర‌మిస్తుంద‌ని శాస్ర్త‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అందుకే.. గంట‌ల‌కొద్దీ టీవీల‌కు అతుక్కుపోకుండా.. న‌డ‌క‌, వ్యాయామం చేయాల‌ని సూచిస్తున్నారు.