లంక భూముల్లో  రాజకీయ రాబందులు

రాజధాని చెంతనే కృష్ణానదిలో ఉన్న లంక దిబ్బలలో రాజకీయ రాబందులు వాలిపోతున్నాయి. లంక భూములు కొన్నవారిని ఊచలు లెక్కించేలా చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు కఠినంగా హెచ్చరించినా.. ఆయన వర్గానికి చెందిన కొందరు పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా బినామీ పేర్లతో భూములు రాయించుకుంటున్నారు. అక్రమంగా, అన్యాయంగా భూములు కొనుగోలు చేస్తూ రిజిస్ట్రేషన్లు సైతం చేయిస్తున్నారంటే వీరి ఘనకార్యాలు ఎలా కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

లంక దిబ్బలలో ఉన్న జరీబు భూములకు రాజధాని ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం, లంకలను పర్యాటక ధామాలుగా తీర్చిదిద్దటానికి జరుగుతున్న ప్రయత్నాలతో ఈ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. లంక భూములంటేనే కన్నెత్తి చూడని వారు.. ఇపుడు ఆ భూముల్లో లంగరు పాతారు. సీడ్ కేపిటల్ కు కూతవేటు దూరంలో ఉన్న ఈ నదీ ద్వీపాలను ప్రభుత్వం టూరిస్టు కేంద్రాలుగా తీర్చిదిద్దాలనుకుంటోంది. లంకలలో ఉన్న భూములలో ఎక్కువ భాగం అసైన్డ్ కాగా, కొంతమేరకు జరీబు భూములు. ప్రభుత్వం ఈ భూములను కూడా భూ సమీకరణలో తీసుకుని రాజధాని భూముల ప్రకారం స్థలాలు ఇస్తామని మూడు నెలల క్రితం ప్రకటించింది. అప్పటి నుంచి లంక భూములపై కన్నేసిన రాజకీయ పెద్దలు మూడో కంటికి తెలియకుండా చాలా భూములను కొనుగోలు చేశారు. కొన్నిటికే రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. అసైన్డ్ భూములను బినామీ పేరుతో పెండింగ్ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్టు సమాచారం.

తుళ్లూరు మండల పరిధిలోని నదీతీర గ్రామాల పరిధిలో 13 లంకలున్నాయి. ఇవన్నీ కృష్ణానదిలో ఉన్నాయి. రాజధానికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం గ్రామ పరిధిలో ఒకటి, లింగాయపాలెం పరిధిలో ఒకటి, ఉండవల్లి పరిధిలో ఒకటి, మందడం పరిధిలో రెండు, వెంకటపాలెం గ్రామ పరిధిలో రెండు, రాయపూడి పరిధిలో ఆరు లంక గ్రామాలున్నాయి. కొన్ని ఈ లంకలలో 250 వరకు కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. ఈ లంకటన్నిటిలో కలిపి రైతులకు చెందిన పట్టా భూములు 200 ఎకరాలు పైగా ఉంటే అసైన్డ్, మిగులు భూములు 900 ఎకరాల వరకు ఉంటాయి. ఇవికాక ప్రభుత్వ భూములు మరో వెయ్యి ఎకరాలున్నాయి.

ప్రభుత్వం కృష్ణానదిలో సింగపూర్ సెంతోషా తరహాలో వీటిని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. భవానీ ద్వీపం అభివృద్ధికైతే ఏకంగా అంతర్జాతీయ కన్సల్ టెంట్ నే నియమించి అభివృద్ధిపై డీపీఆర్ తయారు చేస్తున్నారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం మిగిలిన ద్వీపాల్లో కూడా అంతేస్థాయిలో అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారు. ఈ దిశగా ఇప్పటికే అనేక టూరిజం ప్రాజెక్ట్ లను ఏర్పాటు చేసుకోవటానికి సంబంధించి పలు సంస్థలతో ఎంఓయూలు కూడా జరిగాయ. సర్క్యూట్ హోటళ్ళు, ఫ్లోటెల్స్, సీ ప్లేన్ ప్రాజెక్ట్, బుద్ధిజం పార్క్ లు, రిసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్ వంటివి నెలకొల్పే యోచనలో ఉంది.

ఈ భూములన్నిటినీ తన ఆధీనంలోకి తీసుకోవటానికి త్వరలో భూ సమీకరణ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది తెలియగానే ఎకరం రూ.5 లక్షలు పలకని భూములను రూ.25 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. పట్టా భూములైతే ఎకరానికి రూ.45-50 లక్షల వరకు పెట్టారు. డాక్యుమెంట్స్ తేడా ఉంటే నాలుగవ వంతు ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకుంటున్నారు. అమ్మినవారు ఎదురు తిరగకుండా వీడియో కూడా తీయిస్తున్నట్టు సమాచారం. కొనుగోలు చేసినవారిలో ఒకరిద్దరు మంత్రుల అనుచరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రాయలసీమకు చెందిన ఒక మంత్రి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

లంకదిబ్బల భూములు కొనుగోలు చేసిన వారందరూ బయటనుంచి వచ్చిన వారేనని రైతులు చెబుతున్నారు. ఇక్కడ పసుపు, కూరగాయలు వంటి మూడు పంటలు పడుతాయి. అరటి కూడా సాగుచేస్తారు. పట్టా భూములలో బోర్లు ఉన్నాయి. రాజధాని రాకముందు పట్టా భూమి ఎకరా రూ.10 లక్షలు ఉండేది. మిగిలిన భూములు అసలు కొనుగోళ్ళు జరిగేవి కావు. అలాంటిది ఈ భూములు ఇప్పుడు ఎకరా రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు ఉన్నాయంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. లంక దిబ్బల భూములనే కాకుండా మరికొందరు పెద్దలు నదీ ప్రాంతానికి అంటే నదీ కోతకు గురై కనిపించకుండా ఉన్న భూములను కూడా అంతో ఇంతో ఇచ్చి రాయించుకుంటున్నారు. లంక దిబ్బల భూముల వ్యవహారాలను ఇటీవల తుళ్లూరు రైతులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళడంతో చంద్రబాబు అలాంటి వారిపై కేసులు బనాయించి కటకటాలవెనుకకు నెడతామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆయన హెచ్చరికను ఆయన వర్గీయులే పట్టించుకున్నట్లు లేదు. అందుకే ఈ వ్యవహారాలన్ని గుట్టుచప్పుడు కాకుండా యథేచ్ఛగా జరిగిపోతున్నాయి.