Telugu Global
Others

అమరావతిలో భూగర్భ జలాలన్నీ కలుషితం

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా రూపొందుతున్న అమరావతి నగరం మంచినీటికి కటకటలాడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవిత్ర కృష్ణమ్మకు కుడివైపునున్న అమరావతి భూగర్భ జలాలన్నీ అత్యంత కలుషితమయి ఉన్నాయని తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల నుంచి ఈ 30 వేల ఎకరాల్లో వ్యవసాయం, పండ్ల తోటల పెంపకం కారణంగా రైతులు విచ్చలవిడిగా ఎరువులు, క్రిమి సంహారక మందులు ఉపయోగించారని, ఫలితంగా ఈ భూముల్లో క్షారాలు పేరుకుపోయాయని తెలుస్తోంది. నిజానికి వ్యవసాయ భూములకు నిలయమైన అమరావతిని హరిత నగరంగా చేయాలనుకుంటున్నారు. కాని పైకి […]

అమరావతిలో భూగర్భ జలాలన్నీ కలుషితం
X

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా రూపొందుతున్న అమరావతి నగరం మంచినీటికి కటకటలాడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవిత్ర కృష్ణమ్మకు కుడివైపునున్న అమరావతి భూగర్భ జలాలన్నీ అత్యంత కలుషితమయి ఉన్నాయని తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల నుంచి ఈ 30 వేల ఎకరాల్లో వ్యవసాయం, పండ్ల తోటల పెంపకం కారణంగా రైతులు విచ్చలవిడిగా ఎరువులు, క్రిమి సంహారక మందులు ఉపయోగించారని, ఫలితంగా ఈ భూముల్లో క్షారాలు పేరుకుపోయాయని తెలుస్తోంది. నిజానికి వ్యవసాయ భూములకు నిలయమైన అమరావతిని హరిత నగరంగా చేయాలనుకుంటున్నారు. కాని పైకి కనిపించే పచ్చదనం మంచినీరును మాయం చేస్తుందన్న విషయం ఇపుడు బయట పడింది.
నిర్దేశిత రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో భూగర్భం కలుషిత జలాలతో నిండి ఉన్నదని, ఈ భూగర్భ ప్రాంతమంతా లవణాలు, క్షారాలతో నిండిపోయిందని ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌, కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో బయటపడింది. ఈ భూముల్లో నైట్రేట్స్‌, ఫ్లోరైడ్స్‌ తదితర అవాంఛనీయ లవణాలన్నీ నిర్దేశిత ప్రమాణాల కన్నా ఎక్కువగా ఉన్నాయని, ఇక్కడ జలాలు తాగడానికి ఏ మాత్రం పనికి రావని తేలింది. ఈ ప్రాంతంలోని నీటిని పరిశీలించినప్పుడు ఒక్క లీటరులో 200 నుంచి 400 మిల్లీగ్రాముల క్షారాలున్నట్టు వెల్లడైంది.
రాజధాని ప్రాంతంలోని తాడేపల్లి మండల గ్రామాల్లో క్లోరైడ్‌ మూలకం లీటరుకు 250 మిల్లీ గ్రాములుందని, ఇది బిఐఎస్‌ నిర్దేశిత ప్రమాణాలకన్నా చాలా ఎక్కువని ఎంజే రత్నకాంత్‌ బాబు, ఐసీ దాస్‌, జి. జయశంకర్‌ తదితర సభ్యులతో కూడిన పరిశోధక బృందం సభ్యులు తెలిపారు. ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో అయితే క్షారాలు, లవణాలు లీటరు నీటిలో 2000 మిల్లీగ్రాములున్నట్లు తేలింది. భూగర్భ జలాలలను వ్యవసాయ, పారిశ్రామిక, గృహ వ్యర్థాలన్నీ నాశనం చేశాయని ఈ బృందం తెలిపింది. ప్రతిపాదిత రాజధాని నగరం అమరావతి జనాభాకు ఇక్కడ మంచినీరు ఏ మాత్రం యోగ్యం కాదని, కృష్ణా నది పక్కనే ఉంది కాబట్టి భూగర్భ జలాలపై మంచినీటికి ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉందని, కానీ ఇక్కడున్న పరిస్థితిని చూస్తే తాగునీటికి ఈ జలాలు ఏ మాత్రం యోగ్యంగా లేవని చెప్పక తప్పదని వీరు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నివాసముంటున్న తాడేపల్లి మండలంలో కూడా మంచీనీటి నాణ్యత చాలా తక్కువగా ఉందని, ఇవి గృహావసరాలకు ఏ మాత్రం యోగ్యం కావని ఈ అధ్యయనం వెల్లడించింది. అలాగే తుళ్ళూరు, మంగళగిరి మండలాల్లోని చాలా గ్రామాల్లో కూడా భూగర్భ జలాలు తాగడానికి ఏ మాత్రం అనుకూలంగా లేవని వీరు స్పష్టం చేశారు.

First Published:  2 Nov 2015 5:15 AM GMT
Next Story