వంగవీటి రంగా హత్యలో చంద్రబాబు హస్తం?

ఏపార్టీలో ఉన్న సంచలనాలకు నిలయంగా ఉండే సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఆదివారం ఆవిష్కరించిన ’60 వసంతాల రాజకీయ ప్రస్థానం’పై రాసిన పుస్తకంలో అనేక సంచలన విషయాలు ప్రస్తావించి మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఈ పుస్తకాన్ని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి ఆవిష్కరించారు. పలు పార్టీల్లో ఉండి అనేక పదవులను అలంకరించి ఎనభయ్యోవ పడిలో ఉన్న ఆయన తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవాలను క్రోడీకరిస్తూ రాసుకున్న పుస్తకం పలు ఆసక్తికర అంశాలను ప్రజల్లోకి తీసుకువచ్చి చర్చకు పెట్టింది.

ఆయన రాసిన ఈ పుస్తకంలో ముఖ్యమంత్రుల నీతి నిజాయితీ గురించి, వారు అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి, సీనియర్‌ నాయకుల వ్యవహారశైలి తదితర పలు విషయాలను ఆయన ర్యాంకులతో విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, కె.జానారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు ఎం.వి. మైసూరారెడ్డి, ఎంపీలు గోకరావు గంగరాజు, తోట నరసింహం, తోట సీతారామలక్ష్మి, ప్రభుత్వ విప్‌ అంగర రామ్మోహన్‌, సీనీ దర్శకుడు కోడి రామకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే, కాపు నాయకుడు వంగవీటి రంగా హత్య వెనుక ఆయన చెప్పిన విషయాలు సంచలనంగా ఉన్నాయి.  

రంగా హత్యపై హరిరామజోగయ్య ఏ రాశారంటే… ”విజయవాడలో మహానాడు విజయవంతంగా ముగిసిన కొద్ది నెలలకే అదే ప్రాంగణంలో కాపు సామాజిక వర్గ నేతలు కాపునాడు నిర్వహించారు. లక్ష మందికి పైగా కాపు కులస్తులు హాజరైన సభలో ఎన్టీఆర్‌ను తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.దీంతో ఎన్టీఆర్ నన్ను పిలిచి మీవాళ్లంతా నన్ను వ్యతిరేకిస్తున్నారు కారణమేమిటని అడిగారు. కాపు కులస్తుడైన విజయవాడ ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌ రంగాకు ప్రభుత్వం భద్రత ఉపసంహరించుకోవడమే కాపుల ఆగ్రహానికి కారణమని చెప్పాను.  రంగాకు భద్రత పునరుద్ధరిస్తే అసంత‌‌ృప్తి తగ్గుతుందని చెప్పాను. అందుకు ఎన్టీఆర్‌ కూడా అంగీకరించారు” అని జోగయ్య నాటి ఘటనను గుర్తు చేశారు. అయితే ఆ మరుసటి రోజు తనకు సారీ చేప్పిన ఎన్టీఆర్ ”మీ సలహా ప్రకారం చేయలేకపోతున్నాను” అని అన్నట్టు జోగయ్య చెప్పారు. రంగా భద్రతపై ఇప్పుడే మార్పులు చేయకుండా యథాతథ స్థితి కొనసాగించడమే మంచిదని చంద్రబాబు తదితరులు సలహా ఇచ్చారని ఎన్టీఆర్ … హరిరామజోగయ్యతో చెప్పారట.

వంగవీటి రంగాను హత్య చేయడానికి అనుమతి ఇవ్వాలని కొందరు అధికారులు, నాయకులు ఆనాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావును కోరారని, కాని ఆయన అందుకు అనుమతించలేదని, ఆ తర్వాత టిడిపిలో కీలకపాత్ర పోషిస్తున్న పర్వతనేని ఉపేంద్ర, చంద్రబాబు నాయుడుల వద్ద గ్రీన్ సిగ్నల్ తీసుకుని రంగాను హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఇందులో నిజానిజాలు తనకు తెలియదని, ఈ విషయం ఆనాటి మాజీ ఎమ్మెల్సీ, ఆ తర్వాత కాలంలో మంత్రి అయిన దండు శివరామరాజు తనకు చెప్పారని పేర్కొన్నారు. రంగా హత్య జరగడానికి వారం రోజుల ముందే ప్రభాకరరాజు అనే వ్యక్తి తనకు చెప్పాడంటూ శివరామరాజు తనతో అన్నప్పుడు తాను సీరియస్‌గా తీసుకోలేదని, కాని వారం రోజుల తర్వాత ఆయన చెప్పినట్లే రంగా హత్య జరిగిందని, నిరాహార దీక్ష చేస్తున్న ఆయనపై దాడి చేసి హత్య చేసిన విషయాన్ని జోగయ్య ప్రస్తావించారు.

చిరంజీవికి సినిమాలు… పవన్‌ రాజకీయాలు బెటర్‌
మెగాస్టార్, ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవిపై కూడా మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య పలు ఆరోపణలు చేశారు. చిరంజీవికి నిబద్దత లేదని, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కు నిబద్దత ఉందని ఆయన అన్నారు. చిరంజీవి సినిమాలలోకి వెళ్లి పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వస్తే బెటర్ అని ఆయన సలహా ఇచ్చారు. తాను చిరంజీవి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నానని, ఒక కాపు ముఖ్యమంత్రి అవుతారన్న బావనతో ప్రజారాజ్యం పార్టీలో చేరానని చెప్పారు. కాని చిరంజీవి పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నారని, పాలకొల్లులో ఓడిపోవడానికి ఆయన స్వయంకృతాపరాదమే కారణమని ఆయన అన్నారు. చిరంజీవి తన జనాకర్షణను ధనార్జనకు వాడుకోవడానికే యత్నించారని జోగయ్య అన్నారు.
నిజాయితీలో ఎన్టీఆర్‌ – సంక్షేమంలో వైఎస్‌ టాప్‌
ఉమ్మడి ఎపిలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వారిలో ఎవరు అత్యంత నిజాయితీపరులు, ఎవరు అతి తక్కువ నిజాయితీ పరులు, అలాగే ఎవరు పాలన సమర్దంగా చేశారు? ఎవరు సంక్షేమం బాగా చేశారు అన్న వాటిని మాజీ మంత్రి హరి రామజోగయ్య తన పుస్తకంలో చర్చించారు. ఆయన వారికి రేటింగ్ కూడా ఇచ్చారు. నిజాయితీలో ఎన్.టి.ఆర్‌కు ఆయన అత్యదికంగా 90 శాతం మార్కులు ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అతి తక్కువ 20 శాతం రేటింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడుకు 70 శాతం, కోట్ల విజయభాస్కరరెడ్డి, వెంగళరావు, రోశయ్య, కాసు బ్రహ్మానందరెడ్డిలకు 60 శాతం చొప్పున రేటింగ్ ఇచ్చారు. కాగా వైఎస్ రాజశేఖరరెడ్డికి సంక్షేమ పధకాల అమలులో 90 శాతం, ఎన్.టి.ఆర్.కు 85 శాతం ఇచ్చారు. పాలన సమర్ధతలో చంద్రబాబుకు 85 శాతం అత్యధిక రేటింగ్ ఇచ్చారు. కాగా వైఎస్ తన హయాంలో సంక్షేమ పధకాలతో ప్రజలను ఆకట్టుకుని, వేల కోట్ల దోపిడీ చేశారని జోగయ్య అబిప్రాయపడ్డారు. జగన్‌ ఒంటెత్తు పోకడలతో తన రాజకీయ మనుగడను పాడు చేసుకుంటున్నారని, ఆయన అహంబావి అని తన పుస్తకంలో పేర్కొన్నారు.