ముంబై పోలీసుల్లో దావూద్ అనుచరులు

ఇండోనేషియాలోని బాలి పోలీసుల అదుపులో ఉన్న అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబై పోలీసుల్లో దావూద్ ఇబ్రహీం అనుచరులు ఉన్నారని బాంబు పేల్చాడు. దావూద్ ఇబ్రహీంతో ముంబై పోలీసులు కుమ్మక్కై తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చోటారాజన్ ఆరోపించాడు. ఇండియాకు వచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే ముంబైకి కాకుండా తనను ఢిల్లీకి తీసుకెళ్లాలని చోటా రాజన్ కోరాడు.
ముంబై పోలీసులు ఇప్పటికే తనకు అన్యాయం చేశారన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని రాజన్ ఆరోపించాడు. అదే సమయంలో తనకు దావూద్ ఇబ్రహీం అంటే భయంలేదని ప్రకటించాడు. 22ఏళ్లుగా దావూద్ తో పోరాడుతున్నానని.. ఇప్పుడు కూడా దావూద్ కు, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడతానన్నాడు. భారత ప్రభుత్వం తనను ఏ జైలుకు పంపినా వెళ్తానని ముంబైకి మాత్రం వద్దని విజ్ఞప్తి చేశాడు. బాలి నుంచి ఇవాళ చోటా రాజన్ ను ఇండియాకు తీసుకువచ్చేందుకు సీబీఐ అధికారులు, ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ కాని, రేపు కానీ చోటా రాజన్ ఇండియా చేరుకునే అవకాశం ఉంది.