అమరావతిలో ‘కుల పంచాయతీ’

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుల వర్గీకరణలు తీవ్రంగా మారుతున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసే హంగామా ఒక కులం వారికిమాత్రమే మేలు చేసేలా ఉందని భావిస్తున్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే అన్ని అంశాలు అనుకూలంగా మారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కున్న టీడీపీ ప్రభుత్వం.. కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన గ్రామాలను, భూములున్న రైతులను వదిలేయటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీనిపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేయటం, భూములివ్వమని నిరసన తెలిపిన బడుగు, బలహీన వర్గాల రైతులు, రైతు కూలీలను బలవంతంగా ఒప్పించి, భూముల్ని లాక్కున్న ఘనత తెలుగుదేశం పార్టీ అధినేతకే చెల్లుబాటు అయింది.
అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక సామాజిక వర్గమే ఆధిపత్యం సాధించే పరిస్థితులు నెలకొన్నాయి. నయానా, భయానో అధికారాన్ని అడ్డుపెట్టుకొని, కులపరమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో నానా హంగామా చేస్తున్నారు. ఆ ప్రాంతాలలో ఉన్న బడుగు, బలహీన వర్గాలే కాకుండా ఇతరులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. లంక భూముల్ని స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం ఒకవైపు పేర్కొంటుంటే, మరోవైపు తెలుగుదేశం దత్త పుత్రులు, ఒక సామాజిక వర్గానికి చెందిన అధినేతలు మాత్రం యథేచ్ఛగా లంక భూముల్ని వందలాది ఎకరాలు ఆక్రమిస్తున్నారు.
మరోవైపు పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అనాధి కాలంగా సాగుచేసుకుంటున్న అసైన్డ్ భూములను కూడా ప్రభుత్వం వదిలేలా లేదు. వారంరోజులులోగా ఆ భూముల్ని ప్రభుత్వానికి అప్పగిస్తేసరి, లేకపోతే భూ సేకరణ ద్వారా తీసుకుంటామని హెచ్చరించటం రాజధాని ప్రాంతంలో బడుగుల బ్రతుకులపై వేటు వేయటంగానే భావిస్తున్నారు. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక సామాజిక వర్గానికి తప్ప, వేరెవరికీ స్వేచ్ఛ స్వతంత్రాలు లేకుండానే జీవించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

అమరావతి ప్రాంతం తాడికొండ నియోజకవర్గంలోకి వస్తుంది. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందిన శ్రావణకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాస్థాయి అధికారిగా పనిచేసి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. మొదటిసారి పోటీచేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 2014 ఎన్నికల్లో గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం, అమరావతి రాజధాని ప్రాంత ఏర్పాటు అంశాలు తెరమీదుకొచ్చాయి. తాడికొండ నియోజకవర్గంలో ఉన్న అమరావతి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేకి సాధారణంగా అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, శ్రావణకుమార్ ఎస్సీ కావటంతో ఆయనకు ఏ విధమైన ప్రాధాన్యం లేకుండానే అమరావతిలో అన్ని కార్యక్రమాలు సాగిపోయాయి. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేశారు. ఏ కమిటీలోనూ స్థానిక శాసన సభ్యుడు శ్రావణకుమార్ కు చోటే లేదు. ఇదే కాకుండా అమరావతి నగర శంకుస్థాపన మహోత్సవానికి దేశ, విదేశీ ప్రముఖులను సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం.. స్థానిక శాసన సభ్యుడ్ని మాత్రం దరిదాపుల్లోకి రానివ్వలేదు. దీనికి కులపరమైన పంచాయతీనే ప్రధానమైన ఆటంకంగా చెబుతున్నారు. శ్రావణకుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కావటం బృహత్తరమైన అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి బ్రహ్మ ముహూర్తం సమయంలో పంచములు హాజరు కాకూడదనే కారణంతో శ్రావణకుమార్ ను ఆహ్వానించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా ఇదే విధమైన అణచివేతకు, వివక్షతకు గురవుతున్నారు. ప్రశ్నించేవారుకాని, న్యాయాన్ని ఆశించేవారు కాని లేకుండానే అధినేత చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. ఈ విధానం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టాన్నే కలుగజేస్తుంది.