Telugu Global
Others

హరీష్‌ పట్ల కేసీఆర్ వివక్ష చూపుతున్నారా?

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మధ్య టీఆర్ఎస్‌లో అధిపత్యాన్ని మరోసారి చర్చకు తెచ్చింది. కేసీఆర్ కూడా హరీష్ పట్ల వివక్ష చూపుతున్నారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణులకే కలిగేలా పరిణామాలు తయారయ్యాయి. తాజాగా వరంగల్ లోక్‌సభ ఎన్నికల బాధ్యతను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మంత్రులకు సీఎం కేసీఆర్ అప్పగించారు. ఇక్కడే హరీష్ వర్గానికి అనుమానాలు చెలరేగాయట. సీనియర్ మంత్రులకు నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించినట్టుగానే హరీష్ రావుకు వరంగల్ తూర్పు, కేటీఆర్‌కు వరంగల్ […]

హరీష్‌ పట్ల కేసీఆర్ వివక్ష చూపుతున్నారా?
X

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మధ్య టీఆర్ఎస్‌లో అధిపత్యాన్ని మరోసారి చర్చకు తెచ్చింది. కేసీఆర్ కూడా హరీష్ పట్ల వివక్ష చూపుతున్నారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణులకే కలిగేలా పరిణామాలు తయారయ్యాయి. తాజాగా వరంగల్ లోక్‌సభ ఎన్నికల బాధ్యతను అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మంత్రులకు సీఎం కేసీఆర్ అప్పగించారు. ఇక్కడే హరీష్ వర్గానికి అనుమానాలు చెలరేగాయట.

సీనియర్ మంత్రులకు నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించినట్టుగానే హరీష్ రావుకు వరంగల్ తూర్పు, కేటీఆర్‌కు వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులంతా తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టారు. హరీష్ రావు మాత్రం ప్రచారాన్ని ప్రారంభించలేదు. దీనిపై కారణాలను ఆరా తీయగా హరీష్ రావు అసంతృప్తితో ఉన్నట్టు నేతలకు అర్థమైంది. కారణం ఏమిటంటే…

ఇటీవల ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ప్రకారం వరంగల్ తూర్పులో టీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి వీస్తున్నట్టు తేలిందట. వరంగల్ పశ్చిమనియోజకవర్గ పరిధిలో మాత్రం టీఆర్ఎస్‌దే పైచేయి అని తేలిందని చెబుతున్నారు. ఈ విషయం తెలిసే కుమారుడు కేటీఆర్‌కు సేఫ్‌ సెగ్మెంట్ అయిన వరంగల్ పశ్చిమ బాధ్యతలను కేసీఆర్ అప్పగించి ఉండవచ్చని హరీష్ అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉపఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో హరీష్‌రావుకు తిరుగులేని రికార్డు ఉందని, దాన్ని దెబ్బతీయడానికే వరంగల్ తూర్పును అప్పగించారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పైగా ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహబూబాబాద్ కాల్పుల ఘటన నుంచి హరీష్‌కు, కొండా దంపతులకు మధ్య వైరం నడుస్తూనే ఉంది. తనకు వ్యతిరేకులైన కొండా దంపతులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవర్గం బాధ్యతలు తనకు అప్పగిస్తే పూర్తి స్థాయిలో ఎలా పనిచేయగలం అన్న ఆవేదనను హరీష్ తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారని చెబుతున్నారు . అంతేకాదు వరంగల్ ఎన్నికలకు సంబంధించి తూర్పు నియోజవర్గ కార్యకర్తలతో మంత్రి కేటీఆర్‌ స్వయంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కొండా సురేఖ కూడా హాజరయ్యారు. ఇది కూడా హరీష్‌కు నచ్చలేదంటున్నారు.

వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా కేటీఆర్ అనుచరులు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా హరీష్ రావు బొమ్మ కనిపించడం లేదు. దీని బట్టే హరీష్, కేటీఆర్ మధ్య అధిపత్యపోరు ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు పార్టీ నేతలు. వరంగల్ పశ్చిమలో టీఆర‌్ఎస్‌కు మంచి మెజారిటీ ఖాయమని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాబట్టి కేటీఆర్‌కు మంచి మార్కులు అటోమెటిక్‌గా వస్తాయంటున్నారు. క్లిష్టమైన వరంగల్ తూర్పు నియోజకవర్గ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న హరీష్‌రావుకు మాత్రం ఇదో అగ్ని పరీక్షే అంటున్నారు. ఒక వేళ తూర్పులో మేజారిటీ రాకపోతే హరీష్ పొలిటికల్ కేరీర్‌పై అంతో ఇంతో ప్రభావం చూపడం ఖాయమంటున్నారు.

First Published:  3 Nov 2015 11:25 PM GMT
Next Story