రాజయ్య ఇంటిలో ఘోరం, కోడలు, ముగ్గురు పిల్లలు సజీవ దహనం

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంటిలో ఘోరం జరిగింది. రాజయ్య కోడలు, ముగ్గురు మనవళ్లు   సజీవదహనం అయ్యారు. రాజయ్య ఇంటిలోనే ఈ ఘటన జరిగింది. మృతులు సారిక,అభినవ్, అయోన్, శ్రీయోస్‌. గ్యాస్ లీక్‌ అవడం వల్లే మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్‌ టీం సాయంతో ఘటన జరిగిన ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటన గురించి తెలుసుకున్న రాజయ్య తన ఇంటి వద్ద నేలపైనే కూర్చుని బోరునవిలపించారు.

ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కోడలు సారిక ఆత్మహత్య చేసుకున్నారా లేక మరేదైనా కారణం ఉందా అన్న దానిపై విచారిస్తున్నారు. . కోడలు సారికతో రాజయ్య కుటుంబసభ్యులకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తనను వేధిస్తున్నారంటూ రాజయ్య కుటుంబసభ్యులపై కొద్దిరోజుల క్రితం ఆమె 498A కింద పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. న్యాయం కావాలంటూ రాజయ్య ఇంటి ముందు సారిక ధర్నా చేసిన ఉదంతం కూడా ఉంది. 

రాజయ్య కుటుంబసభ్యులకు, కోడలు సారికకు నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవని స్థానికులు చెబుతున్నారు. సారిక చాలా ధైర్యవంతురాలని ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంటున్నారు. దీని వెనుక కుట్ర దాగి ఉందని స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు.