జోగయ్య అసలు టార్గెట్ పవనేనా?

సీనియర్ రాజకీయ వేత్త హరిరామజోగయ్య పుస్తకం రాష్ట్రంలో సంచలనం స‌ృష్టించింది. వంగవీటి రంగా హత్యపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే ఈ అంశంతో పాటు ప్రస్తుత రాజకీయాలపైనా జోగయ్య తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. వాటిని గమనిస్తే పవన్‌ను రాజకీయంగా పైకి లేపే ప్రయత్నం జోగయ్య చేసినట్టుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మిగిలిన నేతలందరినీ ఏదో విధంగా విమర్శించిన జోగయ్య పవన్‌ను మాత్రం పొడిగేశారు.

జోగయ్య చేసిన కొన్ని వ్యాఖ్యలను గమనిస్తే … చిరుకు రాజకీయాల్లో నిబద్ధత లేదు… పవన్‌లో మాత్రం రాజకీయాల పట్ల నిబద్ధత ఉందన్నారు. చిరు సినిమాల్లోకి వెళ్లి పవన్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అంటే చిరు ఎలాగో రాజకీయాల్లో విఫలమయ్యారు కాబట్టి ఆయనకు బదులు పవన్‌ను తీసుకోవడం బెటర్ అన్న సలహాను ఆయన ఇచ్చినట్టైంది. అంతే కాదు రంగా హత్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ చంద్రబాబును జోగయ్య ఇరికించేశారు. నిజాయితీలో వైఎస్‌కు తక్కువ మార్కులు వేసి పరోక్షంగా జగన్‌ను కూడా డీగ్రేడ్ చేయడానికి ప్రయత్నించారు. జగన్‌ది ఒంటెద్దు పోకడ అంటూ విమర్శించారు.

ఇలా చిరు, చంద్రబాబు, జగన్‌లను నెగిటివ్‌గా చూపించిన జోగయ్య ఒక్క పవన్‌ను మాత్రం కీర్తించారు. ఇలా చేయడం ద్వారా పరోక్షంగా పవనే తమ లీడర్ అన్న భావనను కాపు సామాజికవర్గంలో కలిగించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. పవన్‌ను రాజకీయంగా బలపరిచేందుకు జోగయ్య ప్రయత్నించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.