హైదరాబాద్‌ పోలీసుల అదుపులో సన?

కాంగ్రెస్ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు మనువల అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడటం లేదు. వీరి మృతిపై పలు అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే అనిల్ రెండో భార్య సన ఈ కేసులో కీలక నిందితురాలు అని తెలుస్తుంది. సనాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. సనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం సనాను హైదరాబాద్‌కు అనిల్ మకాం మార్పించాడని, ఇటీవల సనా కుటుంబంలో చోటుచేసుకున్న కొన్ని వ్యవహారాల నేపథ్యంలో అనిల్ చాకచక్యంగా వ్యవహరిస్తూ వస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వరంగల్‌ నుంచి సనను హైదరాబాద్‌ మార్చింది కూడా అనిలేనని అంటున్నారు. సారిక, పిల్లల మరణాల వెనుక సన వత్తిడి ఉందని భావిస్తున్నారు.
నాలుగో నిందితురాలిగా సనా
సంచలనం సృష్టిస్తున్న సారిక ఆమె ముగ్గురు పిల్లల హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య, కుమారుడు అనిల్ పోలీసు రిమాండ్ లో ఉన్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. వైద్యులు ఏం నివేదిక ఇచ్చారన్నది హాట్ టాపిక్ అవుతోంది. ఈ సమయంలో నాలుగో నిందితురాలిగా సనా పేరును పోలీసులు చేర్చారు. అనిల్ కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని సారిక ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అయినా సారిక మరణం తర్వాతే సనా అంశం చర్చనీయాంశమైంది. సనాతో అనిల్‌కు వున్న వివాహేతర సంబంధమే సారిక చావుకు కారణమన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. 
2008లో పరిచయం
2008లో సనాకు అనిల్‌తో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోకపోయినా సహజీవనం చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. తనతో పాటు ఖాజీపేట, హన్మకొండలో ఆమెను ఉంచేవాడు. హైదరాబాద్, వైజాగ్ ఇలా తాను ఎక్కడకు వెళితే అక్కడ ఆమె ఉండాల్సిందే. సనాతో పరిచయం తర్వాత సారిక- అనిల్‌ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎప్పుడూ ఆమె దగ్గరే ఉంటూ తనను నిర్లక్ష్యం చేసేవాడని సారిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.  
ఖాజీపేటలో నివాసం:
వరంగల్ జిల్లా ఖాజీపేటలోని బాపూజీ నగర్‌లో సనా కుటుంబం నివాసం ఉండేది. ఆర్థికంగా బాగా వెనక బడిన కుటుంబం. తండ్రి లేకపోవడంతో ఎవరూ పెద్దగా చదువుకోలేదు. ఇద్దరు సోదరిలకు పెళ్లిళ్లు అయిపోయాయి. ఇక ఇద్దరు సోదరులు ఖాళీగా తిరుగుతూ ఉంటారు. వివాహేతర సంబంధం గొడవలో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై నరికిచంపి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈ హత్య తర్వాత సనా బాపూజీనగర్‌ నుంచి వెళ్లిపోయింది. అనిల్‌తో ఉంటోందని తెలిసినా ఎక్కడ ఉంటోంది అన్నది మాత్రం ఎవరికీ తెలియదు.