ఏ నిమిషానికి ఏమి జ‌రుగునో..!

ఏ నిమిషానికి ఏమి జ‌రుగునో..ఎవ‌రూహించెద‌రు? అన్న పాట‌.. రాజ‌కీయ క్రీడ‌లో నిత్యం నిజ‌మ‌వుతూనే ఉంటుంది. నామినేష‌న్ వేసిన ద‌గ్గ‌ర నుంచి ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే దాకా అదృష్టం అభ్య‌ర్థుల‌తో చెడుగుడు ఆడుకుంటుందన్న విష‌యం వ‌రంగ‌ల్ ఉప‌- ఎన్నిక  మ‌రోసారి మ‌న‌క‌ళ్ల ముందు సాక్షాత్క‌రింప‌జేసింది. ఈ ఉప – ఎన్నిక కొంద‌రు ఆశావ‌హులైన‌ అభ్య‌ర్థుల‌ను ఆశ‌ల ప‌ల్ల‌కీ ఎక్కించింది.. కొంద‌రి ఇంటిముందుకు వ‌చ్చి త‌లుపుత‌ట్టింది.. ప‌ల్ల‌కీ ఎక్కిన కొంద‌రు ప్ర‌చారానికి సిద్ధ‌మ‌వుతున్న వేళ త‌ప్పుకోమంటూ మ‌ధ్య‌లోనే దించివేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్య‌ర్థులతో ఈ ఉప‌-ఎన్నిక నాలుగు స్తంభాలాట ఆడుకుంది. తొలుత‌ కాద‌నుకున్న స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ‌నే ఆఖ‌రి నిమిషంలో ఆపార్టీకి దిక్క‌య్యాడు. మ‌నిషి ఏళ్ల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డి సాధించుకున్న పేరు, ధ‌నం ఆఖ‌రి నిమిషంలో పొగొట్టుకుంటాడు. అంటే.. మ‌నిషి సాంతం పొగొట్టుకునేందుకు ప‌ట్టేది ఒక నిమిషం మాత్ర‌మే! అదే ఆఖ‌రి నిమిషం పోటీ చేయ‌మని మ‌రో అభ్య‌ర్థి ఇంటి త‌లుపుత‌ట్టింది.
కొండేటి, అద్దంకిలో ఆశ‌లు రేపింది..!
ఉప‌- ఎన్నిక అభ్య‌ర్థిత్వానికి పార్టీ తెర‌వెనుక భారీగానే క‌స‌ర‌త్తు చేసింది. వ‌రంగ‌ల్ పార్ల‌మెంటు సెగ్మెంట్ ఎస్సీ రిజ‌ర్వుడు. దీంతో ఇక్క‌డ జ‌నాద‌ర‌ణ క‌లిగిన నేత కావాల‌ని పార్టీ తొలుత వివేక్ ని సంప్ర‌దించింది. అయితే, వ‌రంగ‌ల్ పోటీ చేస్తే.. క‌రీంన‌గ‌ర్‌లో త‌న అస్తిత్వానికి ఎక్క‌డ ముప్పు వాటిల్లుతుందోన‌ని వివేక్ భ‌య‌ప‌డ్డాడు. ఎందుకొచ్చిన తంటా అని పోటీచేయ‌న‌ని సున్నితంగా తిర‌స్క‌రించాడు. ఇక త‌రువాత ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన పేరు కేంద్ర మాజీ మంత్రి స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ. ఈయ‌న తెలంగాణ వాది కాడ‌ని, స్థానికేత‌రుడ‌ని మిగిలిన మాజీఎంపీలు అభ్యంతరం చెప్పారు. వారి మాట కాద‌ని స‌ర్వేను పోటీ చేయిస్తే.. స్థానిక నేత‌లు ప‌నిచేయ‌ర‌మోన‌న్న అనుమానం కాంగ్రెస్ అధిష్టానంలో క‌లిగింది. 
దీంతో స‌ర్వేను కాద‌ని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ‌య్య‌కు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చారు. రాజ‌య్య‌ ఇంట్లో కోడ‌లు, ముగ్గురు మ‌న‌వ‌ళ్ల స‌జీవ ద‌హ‌నం ఆయ‌న రాజ‌కీయ అస్తిత్వానికే ముప్పు తెచ్చింది. ఫ‌లితంగా ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకున్నారు. దీంతో పార్టీ మ‌రోసారి స్థానిక అభ్య‌ర్థుల‌పై గురిపెట్టింది. కొండేటి శ్రీ‌ధ‌ర్‌, అద్దంకి ద‌యాక‌ర్‌ల పేర్లు ప‌రిశీలించింది. వీరి విజ‌యావ‌కాశాల‌పై అనుమానంతో తిరిగి స‌ర్వేను ఉన్న‌ప‌లంగా నామినేష‌న్ వేయించింది. నామినేష‌న్‌కు ముందే వ‌రంగ‌ల్ ఉప‌- ఎన్నికలో అనేక నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక ప్ర‌చార ప‌ర్వానికి తెర‌లేస్తే.. ఇంకెన్ని చిత్రాలు చోటు చేసుకుంటాయోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.