Telugu Global
POLITICAL ROUNDUP

అవార్డులు వెన‌క్కి ఇస్తున్నాం...మేమివ్వం

దేశంలో పెచ్చ‌రిల్లుతున్న మ‌త అస‌హనంపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ఇప్ప‌టికే ప‌లువురు ర‌చ‌యిత‌లు త‌మ అవార్డుల‌ను వెన‌క్కు ఇచ్చారు. ఈ బాట‌లో సినీ క‌ళాకారులు సైతం న‌డుస్తున్నారు. భార‌తీయ చ‌ల‌న‌చిత్ర రంగానికి సంబంధించి వివిధ విభాగాల్లో అవార్డుల‌ను సొంతం చేసుకున్న వారిలో కొంద‌రు త‌మ అవార్డుల‌ను వాప‌స్ చేస్తున్నారు. ఇలా వెన‌క్కు ఇస్తున్న‌వారిలో సీనియ‌ర్ నిర్మాత‌ స‌యీద్ మీర్జా, ర‌చ‌యిత్రి అరుంధ‌తీ రాయ్‌, త‌ప‌న్ బోస్‌, మ‌ధుశ్రీ ద‌త్తా, ప్ర‌దీప్ క్రిష‌న్‌, సినిమాటోగ్ర‌ఫీకి స్పెష‌ల్ జ్యూరీ అవార్డు […]

అవార్డులు వెన‌క్కి ఇస్తున్నాం...మేమివ్వం
X

దేశంలో పెచ్చ‌రిల్లుతున్న మ‌త అస‌హనంపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ఇప్ప‌టికే ప‌లువురు ర‌చ‌యిత‌లు త‌మ అవార్డుల‌ను వెన‌క్కు ఇచ్చారు. ఈ బాట‌లో సినీ క‌ళాకారులు సైతం న‌డుస్తున్నారు. భార‌తీయ చ‌ల‌న‌చిత్ర రంగానికి సంబంధించి వివిధ విభాగాల్లో అవార్డుల‌ను సొంతం చేసుకున్న వారిలో కొంద‌రు త‌మ అవార్డుల‌ను వాప‌స్ చేస్తున్నారు. ఇలా వెన‌క్కు ఇస్తున్న‌వారిలో సీనియ‌ర్ నిర్మాత‌ స‌యీద్ మీర్జా, ర‌చ‌యిత్రి అరుంధ‌తీ రాయ్‌, త‌ప‌న్ బోస్‌, మ‌ధుశ్రీ ద‌త్తా, ప్ర‌దీప్ క్రిష‌న్‌, సినిమాటోగ్ర‌ఫీకి స్పెష‌ల్ జ్యూరీ అవార్డు పొందిన సుధాక‌ర్‌రెడ్డి య‌క్కంటి త‌దిత‌రులు ఉన్నారు.

బుక‌ర్ ప్రైజ్ విజేత అరుంధ‌తీ రాయ్, దేశంలో ఇప్పుడు నెల‌కొని ఉన్న ప‌రిస్థితుల‌కు అస‌హ‌నం అనే చిన్న‌మాట స‌రిపోద‌న్నారు. 1989లో ఇన్ విచ్ అన్నే గివ్స్ ఇట్ దోజ్ వ‌న్స్‌…అనే సినిమాకు ఉత్త‌మ స్ర్కీన్ ప్లే ర‌చ‌యిత‌గా జాతీయ అవార్డుని అందుకున్న ఆమె దాన్ని తిరిగి ఇచ్చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. అయితే ఈ విష‌యంలో బాలివుడ్ రెండుగా చీలిపోయిన‌ట్టుగా క‌న‌బ‌డుతోంది. అవార్డుల‌ను తిరిగి ఇవ్వ‌డాన్ని కొంత‌మంది స‌మ‌ర్ధిస్తుంటే మ‌రికొంద‌రు అది పూర్తిగా అర్థంలేని ప‌ని అని వ్యాఖ్యానిస్తున్నారు.

న‌టి సుప్రియా పాఠ‌క్ దీనిపై ఘాటుగా స్పందించారు. దీనివ‌ల‌న మ‌న‌మేం సాధిస్తున్నాం. చిన్న‌మార్పునైనా తేగ‌లుగుతున్నామా, అవార్డులను వెన‌క్కి ఇవ్వ‌డం ద్వారా ఎవ‌రిపై ఒత్తిడిని తెస్తున్నాం…అని ఆమె ప్ర‌శ్నించారు.

అవార్డుల‌ను వెన‌క్కు తిరిగి ఇచ్చేయ‌డం చాలా సాహ‌సంతో కూడుకున్న చ‌ర్య‌గా అభివ‌ర్ణించిన షారుఖ్ ఖాన్, కానీ ఈ ప‌ద్ధ‌తి స‌రైంది కాద‌న్నారు. ఇంత‌కంటే స్ట్రయిక్‌లు, ప్ర‌జా ఊరేగింపులు స‌రైన‌వ‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు.

మ‌త అస‌హ‌నం అనేది దేశంలో ఎప్పుడూ ఉంద‌ని, దీనిని నిర‌సిస్తూ అవార్డుల‌ను తిరిగి ఇచ్చేస్తే చాల‌ద‌ని అనిల్ క‌పూర్ వ్యాఖ్యానించారు. ఇది స‌రైన చ‌ర్య‌గా త‌న‌కు క‌నిపించ‌డం లేద‌న్నారు.

క‌మ‌ల‌హాస‌న్ దీన్ని వృథా ప్ర‌యాస అన్నారు. ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి మ‌న‌దేశంలో మ‌త అస‌హ‌నం అనేది చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంద‌న్నారు. అవార్డులు వెన‌క్కు ఇస్తున్న వారంతా ఎంతో క‌ళా నైపుణ్యాలున్న‌వార‌ని, త‌మ నిర‌స‌న‌ని తెలిపేందుకు వారు వేరే మార్గాన్ని ఎంచుకుని ఉంటే బాగుండేద‌న్నారు.

బిజెపి ఎంపి హేమ‌మాలిని అవార్డుల‌ను వెన‌క్కు ఇస్తున్న‌వారి నిర‌స‌న‌పై త‌న నిర‌స‌న‌ను తీవ్రంగానే వ్య‌క్తం చేశారు. దీనివెనుక రాజ‌కీయ దురుద్దేశం ఉంద‌న్నారు. జాతీయ అవార్డుని సాధించ‌డం జీవిత‌ల‌క్ష్యంగా భావించేవారున్నార‌ని, అది జాతి త‌మ‌కిచ్చే గౌర‌వంగా భావించాల‌ని కానీ ఇక్క‌డేమో వీరు అలాంటి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన అవార్డుల‌ను వెన‌క్కు ఇచ్చేస్తున్నార‌ని ఆమె విమ‌ర్శించారు. జాతీయ అవార్డుల‌కోసం ఎంతోమంది ప‌డిగాపులు ప‌డుతున్నార‌ని హేమ‌మాలిని వ్యాఖ్యానించారు.

నటుడు రిషీక‌పూర్ త‌న వ‌ద్ద తిరిగి ఇచ్చేయ‌డానికి ఎలాంటి అవార్డు లేద‌న్నారు. మేరా నామ్ జోక‌ర్ సినిమాకు బాల‌న‌టుడిగా తాను పొందిన అవార్డు త‌న‌ది కాద‌ని, రాజ్ క‌పూర్‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అవార్డు వాప‌స్‌ల‌పై మాట్లాడాల్సిందిగా టివి మీడియా త‌న‌ను కోరుతున్న‌ద‌ని, కానీ త‌న‌వ‌ద్ద ఏ అవార్డూ లేన‌పుడు దీనిపై చెప్పాల్పింది ఏమీ లేద‌న్నారు. మేరా నామ్ జోక‌ర్ అవార్డు త‌ప్ప తానెప్పుడూ ప్ర‌భుత్వ అవార్డుల‌ను అందుకోలేద‌న్నారు. త‌న‌వ‌ద్ద తిరిగి ఇచ్చేయ‌డానికి ఏమీ లేద‌ని, అయినా తాను ఈ చ‌ర్య‌ను వ్య‌తిరేకిస్తున్నాన‌ని అన్నారు.

అవార్డుల‌ను వాప‌స్ ఇవ్వ‌డం ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకించ‌డం కాబోద‌ని, అవార్డుక‌మిటీని, దాని స‌భ్యుల‌ను, ఛైర్మ‌న్‌ని, త‌మ‌ సినిమాలు చూసిన ప్రేక్ష‌కుల‌ను అవ‌మానించిన‌ట్టేన‌ని అనుప‌మ్ ఖేర్ అన్నారు.

డ‌ర్జీ పిక్చ‌ర్‌కి జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డుని అందుకున్న విద్యాబాల‌న్ తాను అవార్డుని తిరిగి ఇవ్వ‌లేన‌న్నారు. ఎందుకంటే అది త‌న‌కు ప్ర‌భుత్వం నుండి ద‌క్కింది కాద‌ని భార‌త జాతి త‌న‌కు ఇచ్చిన‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఒక‌సారి అందుకున్న అవార్డుని తిరిగి ఇవ్వ‌డం స‌రికాదని న‌టి రైమాసేన్ అన్నారు.ఇది నా మాట కాదు…అవార్డులు అందుకున్న ఎంతోమంది అభిప్రాయం ఇదేన‌ని ఆమె తెలిపారు.

First Published:  6 Nov 2015 12:18 AM GMT
Next Story