రాజ‌న్ ని చంపి తీరుతాం: ష‌కీల్ ప్ర‌తిజ్ఞ‌

మాఫియాడాన్ చోటా రాజ‌న్ ని చంపి తీరుతామ‌ని దావూద్ ఇబ్ర‌హీం ప్ర‌ధాన అనుచ‌రుడు చోటా ష‌కీల్ మ‌రోసారి ప్ర‌తిన బూనాడు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని చంపినందుకు డీ కంపెనీ అత‌నికి ఏనాడో ఉరిశిక్ష వేసింద‌ని, త్వ‌ర‌లోనే దాన్ని అమ‌లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశాడు. రెండు ద‌శాబ్దాలుగా దావూద్ ఇబ్ర‌హీం- చోటా రాజ‌న్ గ్యాంగుల మ‌ధ్య కొన‌సాగుతున్న పోరుకు రాజ‌న్‌ని అంతం చేసి ముగింపు ప‌లుకుతామ‌న్నాడు. చోటా రాజ‌న్ అరెస్టు, ఢిల్లీలో సీబీఐ విచార‌ణ నేప‌థ్యంలో చోటా ష‌కీల్ ఓ భార‌తీయ  వార్తా సంస్థ‌తో ఫోన్‌లో మాట్లాడాడు. త‌మ అనుచ‌రులను రాజ‌న్ ఎప్పుడు? ఎలా? ఏ తేదీన చంపాడో అన్ని వివ‌రాల‌ను చెప్ప‌డాన్ని బ‌ట్టి చూస్తే.. రెండు ద‌శాబ్దాలు దాటినా రాజ‌న్‌పై డీ-గ్యాంగ్ ప‌గ‌లో ఎలాంటి మార్పు లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.
ష‌కీల్ ఏమ‌న్నాడు?
1. 1993 ముంబై వ‌రుస‌ పేలుళ్ల అనంత‌రం 1998-2001 మ‌ధ్య‌కాలంలో దావూద్ అనుచ‌రులుగా పేరొందిన ఆరుగురు వ్య‌క్తుల‌ను రాజ‌న్ త‌న మ‌నుషుల‌తో కాల్చి చంపించాడు. వీరంతా పేలుళ్ల కేసులో నిందితులు, బెయిల్‌పై బ‌య‌ట ఉన్నారు.
2. మా మ‌నుషుల‌ను చంపింనందుకు మేం త‌ప్ప‌కుండా ప్ర‌తీకారం తీర్చుకుంటాం. 
3. ముంబైలోని డోంగ్రీ త‌దిత‌ర ప్రాంతాల‌పై ప‌ట్టు సాధించేందుకు మా గ్యాంగుకు చెందిన ఒక్కొక్క‌రిని రాజ‌న్ మ‌నుషులు మ‌ట్టుబెట్టారు. అందుకు అత‌నికి భార‌త్‌లోని కొన్ని చ‌ట్ట‌ప‌ర‌మైన శాఖ‌లు స‌హ‌క‌రించాయి. 
4. రాజ‌న్‌ మా విష‌యంలో పాల్ప‌డిన నేరాల‌కు డీ కంపెనీ కోర్టు ఏనాడో అత‌నికి మ‌ర‌ణ‌శిక్ష విధించింది. అది త్వ‌ర‌లోనే అమ‌లవుతుంది.
5. రాజ‌న్‌ని హిందుస్తాన్ తీసుకువ‌చ్చాక‌.. ముంబైకి ఎందుకు తీసుకురాలేదు? అత‌డు చేసిన ఈ ప‌లు నేరాల‌తోపాటు ఆరుగురు డీ-గ్యాంగ్ మ‌నుషుల‌ను చంపిన కేసులు సైతం మ‌హారాష్ట్ర ప‌రిధిలో ఉన్నాయి. అలాంట‌పుడు ఢిల్లీలో విచార‌ణ ఎందుకు?
6. ద‌ర్యాప్తు సంస్థ‌లు రాజ‌న్‌ని చుట్టంలా చూస్తున్నాయి. ఇలాంటి చ‌ర్య‌ల ద్వారా దేశ‌భ‌క్తికి నిర్వ‌చ‌నం చెబుతున్నారా?
రాజ‌న్ చంపించింది వీరినే!
1. 1998, ఏప్రిల్ 21 తేదీన‌ స‌లీం కుర్లా హ‌త‌మ‌య్యాడు. ఇత‌న్ని అంధేరీలో రాజ‌న్ మ‌నుషులు చంపారు. 1993 పేలుళ్ల‌లో పాల్గొన్న యువ‌కుల‌కు పాకిస్తాన్ పంపి శిక్ష‌ణ ఇప్పించాడ‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు.
2. 1998, జూన్ 29న‌ జింద్రాన్‌. ఇత‌ను బిల్డ‌ర్‌.
3. 1999, మార్చి 1 న మాజిద్ ఖాన్‌, ఇత‌డూ బిల్డ‌రే.  పేలుళ్లకు వాడిన ఆర్డీఎక్స్‌ను ఇత‌ను త‌న ఫ్యాక్టరీలో దాచాడ‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు.
4. 2015, ఆగ‌స్టులో మాజిద్ ఖాన్ సోద‌రుడు యాకుబ్ యెడా గుండెపోటుతో క‌రాచీలో మ‌ర‌ణించాడు.
5. హ‌నీఫ్ క‌డ్వాలా అనే సినీ నిర్మాత‌ను రాజ‌న్ మ‌నుషులు చంపారు. త‌రువాత కొంత‌కాలానికే.. అక్బ‌ర్  స‌మాఖాన్ ని  సైతం హ‌త్య చేశారు. యాకుబ్ మెమెన్ గ్యారేజీలో స‌మాఖాన్ ఆర్డీఎక్స్‌ దాచాడని, ఈ పేలుడు ప‌దార్థాల‌నే కార్లు, స్కూట‌ర్ల‌లో పెట్టి పేల్చార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.