Telugu Global
Others

బీహార్‌లో బీజేపీకి దిమ్మ తిరిగే జవాబు

బీహార్‌ ప్రజలు ముచ్చటగా మూడోసారి నితీష్‌కుమార్‌కు పట్టం గట్టారు. ప్రపంచానికే మహానాయకుడిగా పరిచయమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ పార్టీని నిస్సంకోశంగా తిరస్కరించారు. మహా కూటమిలో భాగస్వాములైన జనతాదళ్‌-యు, రాష్ట్రీయ జనతాదళ్‌, కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమికి అద్భుతమైన మెజారిటీతో పట్టం కట్టారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు బీజేపీ కూటమి ఓటమికి కూడా ఒకటారెండా ఎన్నో కారణాలు వెనుక ఉండి ఆ పార్టీని ఓడించాయి. ప్రధానంగా రిజర్వేషన్ల అంశం, పరమత ‘అసహనం’, ధరలు… ఇలా అనేక […]

బీహార్‌లో బీజేపీకి దిమ్మ తిరిగే జవాబు
X
cpvvsబీహార్‌ ప్రజలు ముచ్చటగా మూడోసారి నితీష్‌కుమార్‌కు పట్టం గట్టారు. ప్రపంచానికే మహానాయకుడిగా పరిచయమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ పార్టీని నిస్సంకోశంగా తిరస్కరించారు. మహా కూటమిలో భాగస్వాములైన జనతాదళ్‌-యు, రాష్ట్రీయ జనతాదళ్‌, కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమికి అద్భుతమైన మెజారిటీతో పట్టం కట్టారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు బీజేపీ కూటమి ఓటమికి కూడా ఒకటారెండా ఎన్నో కారణాలు వెనుక ఉండి ఆ పార్టీని ఓడించాయి. ప్రధానంగా రిజర్వేషన్ల అంశం, పరమత ‘అసహనం’, ధరలు… ఇలా అనేక అంశాలు బీజేపీ కూటమి ఓటమికి, మహాకూటమి గెలుపుకు కారణాలుగా మిగిలాయి. మొత్తం 243 స్థానాల్లో 178 సీట్లలో గెలుపొంది తిరుగులేని ఆధిక్యత సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసినవి 122 సీట్లే అయినా మరో 56 సీట్లు అదనంగా సాధించింది.
సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించడానికి ప్రధాన కారణమని చెప్పుకున్న బీజేపీకి మోదీ హవా ఇక్కడ పని చేయలేదు. ఆ పార్టీ రథ సారధిగా ఉన్న అమిత్‌ షా వ్యూహాలు ఫలించలేదు. డబ్బులు కుమ్మరించి బీహార్‌ను స్వర్గ తుల్యంగా చేస్తామని మోదీ నమ్మబలికినా జనం పట్టించుకోలేదు. కేంద్రంలో అధికారంలో ఉండి… పార్లమెంటులో ప్రకటన చేసిన ప్రత్యేక హోదా ఇవ్వడానికే మీనమేషాలు లెక్కేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు బీహార్‌లో కూడా నీటిమూటలుగానే ఉంటాయని ఆ రాష్ట్ర ప్రజలు భావించారు కాబట్టే భారతీయ జనతాపార్టీ కూటమికి దిమ్మ తిరిగే జవాబిచ్చారు. కేవలం ఎన్డీయే కూటమికి దక్కిన సీట్లు కేవలం 59. ఈ సంఖ్యతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.
మహా కూటమి విజయాన్ని ప్రజా విజయంగా నితీష్‌, లాలూ, సోనియా రాహుల్‌ అభివర్ణించగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారికి శుభాకాంక్షలు తెలపడం తప్ప అంతకుమించి వ్యాఖ్యానించలేకపోయారు. బీహార్‌ అభివృద్ధికి సహకరిస్తామని మొక్కుబడి ప్రకటన చేసి సరిపెట్టుకున్నారు. అయితే బీజేపీకి చిరకాల మిత్రపక్షంగా ఉండి ఈ మధ్య అవకాశాన్ని బట్టి విమర్శలకు దిగుతున్న శివసేన మాత్రం ఘాటుగానే స్పందించింది. రాజకీయ హీరోగా నితీష్ ఆవిర్భవించారని ప్రశంసిస్తూనే కాంగ్రెస్ ఓడినప్పుడు సోనియా బాధ్యత తీసుకున్నారు. బీహార్ ఎన్నికల్లో ఓటమికి ప్రధాని మోడీ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేసింది.
బీజేపీ ఓటమికి కళ్ళముందే కారణాలు…
లాలూ ప్రసాద్‌, నితీష్‌ కుమార్‌, సోనియాగాంధీల మహాకూటమి దెబ్బకు బీజేపీ నేతలకు ఊహించని దెబ్బ తగిలింది. తమ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని భావించిన వారికి ఆశాభంగమైంది. అసలు బీజేపీ ఓటమికి కారణాలేమిటో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. ఓటమికి కారణాలేమిటో తెలుసుకోవాలన్న తపన ఉన్నట్టయితే జవాబులు దొరకడం కష్టమైన పనేమీ కాదు. బీహార్‌లో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎంతోకాలంగా అనుభవిస్తున్న రిజర్వేషన్లను ఎత్తి వేస్తుందన్న ప్రచారం బాగా జరిగింది. అసలు ఇలాంటి అభిప్రాయం కలిగించింది ఆ పార్టీకి సన్నిహితంగా మెలుగుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలే. దేశంలో ఉన్న రిజర్వేషన్ల వ్యవస్థను పునః సమీక్షించాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారిలో వేడి పుట్టించాయి. దీనికితోడు విపక్షాలు దీన్ని ప్రచారాంశంగా చేసుకుని హైలెట్‌ చేయడంతో బీజేపీకి దెబ్బ తగలడానికి కారణమైంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారసభలో దీనికి వివరణ ఇచ్చి రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో ఎత్తివేయబోమని ప్రకటించినప్పటికీ జనం నమ్మలేదు. ఎందుకంటే ఆర్ఎస్‌ఎస్‌ బీజేపీకి ఎంత బలమైన నేస్తమో జనానికి ఎవరూ చెప్పక్కర్లేదు. ఇక మరో అంశం… దాద్రీ సంఘటన. ఆవు మాంసం తిన్నాడన్న ఆరోపణతో కొంతమంది ఓ వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపేసినా ప్రధానమంత్రి స్థానంలో ఉన్న నరేంద్రమోదీ తక్షణం నోరు మెదపకుండా మౌనంగా ఉండడం కూడా ఆ పార్టీకి చేటు చేసింది. తర్వాత ఎప్పుడో తీరిగ్గా వివరణ ఇచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఆవు మాంసంపై దేశ వ్యాప్తంగా జరిగిన రచ్చ… నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడం, ఉల్లిపాయలు, పప్పుల ధరలు చుక్కల పక్కన ఉండడం కూడా బీజేపీ ఓటమికి కారణంగా చెప్పవచ్చు. బీహార్‌కు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ, మత రాజకీయాలు, అసహనం వంటి అంశాలు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీపై తీవ్ర ప్రభావం చూపాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
– పీఆర్‌ చెన్ను
First Published:  8 Nov 2015 11:43 AM GMT
Next Story