Telugu Global
Others

చుక్కలనంటుతున్న నిత్యావసరాలు

మొన్న ఉల్లిపాయలు… నిన్న పప్పులు… ఇపుడు టమాటా… ఇలా ఒకదాని తర్వాత ఒకటి పేద జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ప్రజల బాధలు పట్టని పాలకులు మాత్రం తమ పరిపాలన సజావుగా సాగిపోతున్నట్టు ఫోజులు పెడుతూ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. రెండు నెలలుగా వంద రూపాయలకు ఎగిసిన ఉల్లిపాయల ధర ఇపుడిపుడే దిగి వస్తోంది. నిజానికి ఇంకా ఉల్లిపాయల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి రాలేదు. ఇప్పటికి కూడా కిలో 30 రూపాయలు అమ్ముతున్నారు. నాసిరకం ఉల్లిపాయలు మాత్రం 15 నుంచి […]

చుక్కలనంటుతున్న నిత్యావసరాలు
X

మొన్న ఉల్లిపాయలు… నిన్న పప్పులు… ఇపుడు టమాటా… ఇలా ఒకదాని తర్వాత ఒకటి పేద జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ప్రజల బాధలు పట్టని పాలకులు మాత్రం తమ పరిపాలన సజావుగా సాగిపోతున్నట్టు ఫోజులు పెడుతూ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. రెండు నెలలుగా వంద రూపాయలకు ఎగిసిన ఉల్లిపాయల ధర ఇపుడిపుడే దిగి వస్తోంది. నిజానికి ఇంకా ఉల్లిపాయల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి రాలేదు. ఇప్పటికి కూడా కిలో 30 రూపాయలు అమ్ముతున్నారు. నాసిరకం ఉల్లిపాయలు మాత్రం 15 నుంచి 20 రూపాయలకు విక్రయిస్తున్నారు. మొక్కుబడిగా అక్కడక్కడ షాపులు పెట్టి కిలో 20 రూపాయలకు ప్రభుత్వం విక్రయిస్తున్నా అవి కూడా సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్నాయి. పైగా ఇవి రెండు కిలోలకు మించి ఇవ్వక పోవడం… కొనుక్కునే వాళ్ళకు ఆధార్‌ కార్డు చూపించాలని, ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలని… ఇలా సవాలక్ష ఆంక్షలు పెట్టినందువల్ల ఈ అవుట్‌లెట్స్‌ కూడా పెద్ద ఉపయోగపడలేదు. పరిస్థితి ఇలా ఉండి… ఉల్లి ధర ఇంకా ఆకాశానుంచి దిగి రాక ముందు చుక్కలనంటాయి పప్పుల ధరలు.
కందిపప్పు కిలో 200 రూపాయలు దాటి అసలు ఆ వైపు వెళ్ళాలంటేనే పేదలు భయపడి పోయేట్టు పరిస్థితి తయారైంది. రోజూ పప్పు లేకపోతే ముద్ద దిగిని వారు సైతం కళ్ళప్పగించి చూడడం తప్పితే చేయగలిగింది ఏమీ లేదని మిన్నకుండిపోయారు. ఉల్లిపాయలు మాదిరిగానే కందిపప్పు విక్రయానికి కూడా ప్రభుత్వం అవుట్‌లెట్స్‌ పెట్టి కిలో 140 రూపాయలకు అమ్మించే ఏర్పాటు చేసింది. ఇక్కడ కూడా నిబంధనలు షరా మామూలే. పాలన, ప్రాజెక్టులు, పథకాలు వంటి కాసులు కురిపించే వాటిపై ఉన్న థ్యాస ప్రభుత్వానికి సామాన్యుల నిత్యావసరాల మీద పెద్దగా ఆసక్తి లేకపోవడంతో పేదల జీవన పరిస్థితి ధైన్యంగా తయారైంది.
ఇపుడు మళ్ళీ టామాటా ధరలు చుక్కలనంటాయి. మొన్నటి వరకు కిలో 20 రూపాయలున్న టమాటా ధర ఇపుడు రూ. 60కి ఎగబాకింది. ఒక్కసారిగా అమాంతంగా పెరిగిన టమోటా ధరలను చూసి సామాన్యులు హడలిపోతున్నారు. జిల్లాలో రైతుల వర్షాధార పంటగా టమోటాను అధికంగా సాగు చేస్తారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ధరలకు రెక్కలొచ్చాయి. రైతులకు ఫలితం దక్కుతుందో లేదోగాని వ్యాపారులు, దళారులు మాత్రం మార్కెట్లలో అడ్డంగా దండుకుంటున్నారు. అసలు ఈ పరిస్థితికి ఎవరిని అడగాలో తెలియని పేదవాళ్ళు నోరు కట్టేసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నోరు మూసుకుని ఉంటున్నారు. కూరగాయల మార్కెట్‌కు వెళ్ళాలంటేనే సామాన్యులు భయపడిపోతున్నారు. మార్కెట్లో ఏదీ కిలో 40 రూపాయలకు తక్కువగా ఉండడం లేదు. కిలో కొనుక్కునే వారు అరకిలోతోనో, పావు కిలోతోను సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. రెక్కాడితేగాని డొక్కాడని దీనుల పరిస్థితి మరీ దయనీయంగా తయారవుతోంది.
నిత్యావసరాలైన బియ్యం దగ్గర నుంచి కూరగాయలు, వప్పుదినుసులు, నూనెలు… ఇలా ఒకటేమిటి తెలుగువారి భోజనానికి కావలసిన పదార్ధాల ధరలన్నీ చుక్కల్ని చూపిస్తున్నాయి. ఎవరిని అడగాలో తెలియక… ఎం తినాలో అర్ధం కాక సామాన్యుడు నలిగిపోతున్నాడు. ఈ పరిస్థితి మార్చడానికి ప్రభుత్వాలుగాని, పాలకులుగాని ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

First Published:  9 Nov 2015 3:57 AM GMT
Next Story