క‌ట్ చేసిన యాపిల్… రంగు మార‌కుండా ఉండాలంటే

యాపిల్‌ని క‌ట్‌చేసి పిల్ల‌ల‌కు స్నాక్స్‌గా ఇవ్వాల‌నుకునే త‌ల్లుల‌కు ఒక స‌మ‌స్య ఎదుర‌వుతుంది. పిల్ల‌లు స్కూల్లో వాటిని తినే లోపు అవి రంగు మారిపోయి చిరాకు క‌లిగించేలా త‌యార‌వుతాయి. దాంతో వారు తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. యాపిల్‌లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. ముక్క‌లు కోసిన వెంట‌నే అందులోని క‌ణాలు పాడ‌వుతాయి. దాంతో గాల్లోని ఆక్సిజ‌న్‌, యాపి ల్లో ఉన్న‌ ఐర‌న్‌తోనూ, పాలిఫెనాల్ అనే ఎంజైమ్‌తోనూ చ‌ర్య జ‌రిపి ఐర‌న్ ఆక్సైడ్ త‌యార‌వుతుంది. అందుకే యాపిల్ ముక్క‌లు బ్రౌన్ రంగులోకి మార‌తాయి. అయితే ఇలా రంగుమారిన‌  యాపిల్ ముక్క‌ల‌ను తిన‌డం వ‌ల‌న ఎలాంటి హానీ జ‌ర‌గ‌దు కానీ చూసేందుకు మాత్రం కంటికి ఇంపుగా ఉండ‌వు. మ‌రి కోసిన‌ యాపిల్ రంగుమార‌కుండా తాజాగానే ఉండాలంటే ఏంచేయాలి-

  • యాపిల్‌ని క‌ట్‌చేసే చాకు ఎంత ప‌దునుగా ఉంటే రంగు మార‌టం అంత త‌క్కువ‌గా జ‌రుగుతుంది.
  • యాపిల్‌ని నీటిలోనే ఉంచి ముక్క‌లుగా కోసి త‌రువాత వాటిని ప్యాక్‌ చేయాలి.
  • నిమ్మ‌, ఆరంజ్ లేదా యాపిల్ జ్యూస‌యినా, సిట్రిక్ యాసిడ్ ఉన్న ప‌ళ్ల ర‌సం దేన్న‌యినా కోసిన యాపిల్ ముక్క‌ల‌కు రెండువైపులా పూయాలి లేదా ఆయా ప‌ళ్ల ర‌సాల్లో ముంచాలి. సిట్రిక్ యాసిడ్ ఉన్న సోడాలు, డ్రింక్‌లు కూడా ఇలా ప‌నిచేస్తాయి. స్ప్రైట్‌ని వాడ‌వ‌చ్చు.
  • కొంచెం నీళ్ల‌లో ఒక అర‌టీ స్పూను ఉప్పుని వేసి అందులో మూడునుండి అయిదు నిముషాల‌పాటు యాపిల్ ముక్క‌ల‌ను నాన‌నిస్తే రంగుమార‌కుండా ఉంటాయి.
  • వీట‌న్నింటికంటే తేలికైన ఉపాయం యాపిల్‌ని ముక్క‌లు చేసి తిరిగి అలాగే పండులా అమ‌ర్చి ర‌బ్బ‌ర్ బ్యాండుని వేయ‌డం, పూర్తి పండుని స్నాక్‌గా ఇవ్వ‌ద‌ల‌చుకున్నా, పండుని అలాగే ఉంచేందుకు బాక్సు వీలుగా ఉన్నా ఈ ప‌ద్ధ‌తిని పాటించ‌వ‌చ్చు.
  • రంగుమారినా తిన‌డం వ‌ల‌న ఎలాంటి హానీ క‌ల‌గ‌దు కాబట్టి పిల్ల‌లు వాటిని అలాగే తినేస్తుంటే ఏ పాద్ధ‌తీ పాటించ‌కుండా వ‌దిలేయ‌వ‌చ్చు. ఇలాంట‌పుడు యాపిల్‌ని ముక్కలుగా చేస్తున్న చాకు ప‌దునుగా ఉండేలా చూసుకోండి చాలు.