Telugu Global
Others

మండల్-కమండల్ మధ్య వామపక్షాలు మాయం

“ఏవీ తల్లీ! నిరుడు కురిసిన హిమ సమూహములు??” అని శ్రీశ్రీ మరో సమదర్భంలో రాసినా పార్లమెంటరీ రాజకీయాలనే నమ్ముకున్న వామపక్ష పార్టీలకు ఈ గీతం అచ్చుగుద్దినట్టు అన్వయిస్తుంది. ఇటీవలి కాలంలో ప్రతి ఎన్నికలలోనూ వామపక్ష పార్టీల పరిస్థితి నానాటికీ దిగజారడమే. బెంగాల్ లో ప్రభుత్వం చేజారిన తర్వాత కమ్యూనిస్టులు మరీ ఢీలా పడిపోయారు. ఇటీవలి స్థానిక సస్థల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఒక్క కేరళలో మాత్రమే వామపక్షాల ఆశాదీపం జవసత్వాలు పుంజుకుంది. కేరళలో మొత్తం 941 గ్రామపంచాయితీలు ఉంటే వామపక్షాలు 550 కైవసం చేసుకున్నాయి. […]

మండల్-కమండల్ మధ్య వామపక్షాలు మాయం
X

RV Ramarao“ఏవీ తల్లీ! నిరుడు కురిసిన హిమ సమూహములు??” అని శ్రీశ్రీ మరో సమదర్భంలో రాసినా పార్లమెంటరీ రాజకీయాలనే నమ్ముకున్న వామపక్ష పార్టీలకు ఈ గీతం అచ్చుగుద్దినట్టు అన్వయిస్తుంది. ఇటీవలి కాలంలో ప్రతి ఎన్నికలలోనూ వామపక్ష పార్టీల పరిస్థితి నానాటికీ దిగజారడమే. బెంగాల్ లో ప్రభుత్వం చేజారిన తర్వాత కమ్యూనిస్టులు మరీ ఢీలా పడిపోయారు. ఇటీవలి స్థానిక సస్థల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఒక్క కేరళలో మాత్రమే వామపక్షాల ఆశాదీపం జవసత్వాలు పుంజుకుంది. కేరళలో మొత్తం 941 గ్రామపంచాయితీలు ఉంటే వామపక్షాలు 550 కైవసం చేసుకున్నాయి. 152 బ్లాకు పంచాయితీలలో 90 చోట్ల అరుణ పతాకమే రెపరెపలాడింది. 33 ఏళ్లపాటు అధికారంలో కొనసాగిన బెంగాల్ లో వామపక్ష ఫ్రంట్ పునరుజ్జీవన జాడలు కనిపించడం లేదు.

గత బీహార్ శాసన సభలో సీపీఐకి ఒక్క స్థానం ఉండేది. ఈ సారి అదీ లేదు. 2015 ఎన్నికలలో వామపక్ష ఫ్రంట్ విడిగా చాలా స్థానాలకే పోటీ చేసింది కాని ఒక్క సీపీఐ (మార్క్సిస్ట్- లెనినిస్ట్) లిబరేషన్ మాత్రమే మూడు స్థానాలు సంపాదించిది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నీరసించడం ఒక్క బిహార్ కే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా అదే పరిస్థితి. బిహార్ లో సీపీఐ చాలా కాలం గౌరవప్రదమైన వామపక్ష పార్టీగానే ఉండేది. 1951లో ఒక్క స్థానమైనా సంపాదించకపోయినా 1957 నుంచి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది. 1957లో ఏడు స్థానాలు, 1962లో 12 స్థానాలు సంపాదించింది. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిన తర్వాత కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రాతినిధ్యం మరీ దిగదుడుపుగా ఏమీ లేదు. 1967 లో సీపీఐ 24 చోట్ల సీపీఎం 4 చోట్ల నెగ్గాయి.

1969లో సీపీఐ 25 స్థానాలు సంపాదిస్తే సీపీఎం మూడు సీట్లు సంపాదించింది. 1972లో సీపీఐ అత్యధికంగా 35 చోట్ల గెలిచింది. ఆ విడత సీపీఎం కు ఒక్క స్థానమూ దక్క లేదు. 1977లో సీపీఐ 21 స్థానాలు, సీపీఎం 4 సీట్లు సంపాదించాయి. 1980లో సీపీఐకి 23, సీపీఎంకు 6 సీట్లు దక్కాయి. 1985లో సీపీఐ 6 సీట్లు సంపాదించింది. 1995లో సీపీ 26 చోట్ల సీపీఎం 6 చోట్ల గెలిచాయి. 2000 సంవత్సరంలో జరిగిన శాసన సభ ఎన్నికలలో సీపీఐ బలం 5కు తగ్గితే సీపీఎం 2 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2005 ఫిబ్రవరి ఎన్నికలలో సీపీఐ 3 సీట్లు, సీపీఎం ఒక్క సీటు మాత్రమే సంపాదించాయి. శాసన సభ రద్దు కావడంతో 2005 అక్టోబర్ ఎన్నికలలో మళ్లీ ఇవే ఫలితాలు వచ్చాయి.

ఒకప్పుడు బిహార్ లో శాసన సభలోనే కాక బయట కూడా సీపీఐ బలమైన వామపక్ష పార్టీగా ఉండేది. రణ్వీర్ సేన ఆగడాలు జరిగినప్పుడు అధికారికంగానో, అనధికారికంగానో ప్రజల తరఫున తుపాకులు పట్టుకుని పోరాడిన చరిత్ర సీపీఐకి ఉండేది. కాని మండల్-కమండల్ రాజకీయాల ప్రాబల్యం పెరిగిపోయిన తర్వాత వామపక్షాలు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్ప అస్తిత్వం నిలబెట్టుకోలేని పరిస్థితులు వచ్చాయి. కుల సమీకరణలు వామ పక్షాలను బాగా దెబ్బ తీశాయి.

అదీ గాక బిహార్ లో సీపీఐ అగ్ర నాయకులైన ఇంద్రదీప్ సిన్హా, సునిల్ ముఖర్జీ, జగన్నాథ్ సర్కార్ మొదలైన వారందరూ అగ్రకులాలకు చెందిన వారే. మండల్ రాజకీయాల ప్రాబల్యం పెరిగిన తర్వాత వీరి ప్రాభవం తగ్గింది. కుల సమీకరణలు కమ్యూనిస్టులకు అతీతంగా మారిపోయాయి. పార్లమెంటరీ రాజకీయాలు కమ్యూనిస్టులను ప్రజలకు, ప్రజోద్యమాలకు దూరం చేశాయి. ఇలాంటి స్థితిలో ఏదో ఒక రాజకీయ కూటమితో పొత్తు కుదరక పోతే శాసన సభలో ప్రాతినిధ్యం సంపాదించడమే దుర్లభంగా తయారైంది. ఈ సారి అదే జరిగింది.

-ఆర్వీ రామారావ్

First Published:  10 Nov 2015 11:39 PM GMT
Next Story