దీపావళికి ఇస్రో జాతికి జీశాట్-15 కానుక

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) దీపావళి పర్వదినాన మరో ఘన విజయం నమోదు చేసింది. కమ్యూనికేషన్, నావిగేషన్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన జీశాట్-15 ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి నేటి ఉదయం జరిగిన ఈ ప్రయోగం దిగ్విజయంగా ముగిసింది. జీశాట్-15తోపాటు అరబ్ శాట్-6లను ఉపగ్రహ వాహక నౌక విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాదాపు 3,164 కిలోల భారీ బరువున్న జీశాట్-15 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోలో సందడి వాతావరణం నెలకొంది. సరిగ్గా దీపావళి పర్వదినాన జరిగిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.