Telugu Global
Others

దశా దిశా లేని జగన్....

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు పదేపదే పబ్లిక్ మీటింగ్స్ లో ఒక సామెత చెప్పేవారు” అమ్మకు అన్నం పెట్టలేని వాడు… పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడ‌ట” అని . ఇప్పుడు ఈ సామెతకు జగన్‌ తీరు కూడా దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. కొద్ది రోజులుగా ఏపీలో రైతుల నుంచి ప్రభుత్వం భూములు లాక్కుంటున్న విషయంలో జగన్ పోరాటం స్టైల్ ”అమ్మ- పిన్ని” సామెతలాగే ఉంది. ప్రభుత్వం భూములు లాగేసుకోకుండా ప్రతిపక్షంగా తాము ఎలా అడ్డుకుంటామో చెప్పకుండా… భూములు […]

దశా దిశా లేని జగన్....
X

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు పదేపదే పబ్లిక్ మీటింగ్స్ లో ఒక సామెత చెప్పేవారు” అమ్మకు అన్నం పెట్టలేని వాడు… పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడ‌ట” అని . ఇప్పుడు ఈ సామెతకు జగన్‌ తీరు కూడా దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. కొద్ది రోజులుగా ఏపీలో రైతుల నుంచి ప్రభుత్వం భూములు లాక్కుంటున్న విషయంలో జగన్ పోరాటం స్టైల్ ”అమ్మ- పిన్ని” సామెతలాగే ఉంది.

ప్రభుత్వం భూములు లాగేసుకోకుండా ప్రతిపక్షంగా తాము ఎలా అడ్డుకుంటామో చెప్పకుండా… భూములు తీసుకుంటే తాము అధికారంలోకి వచ్చాక తిరిగిచ్చేస్తామని జగన్ చెబుతున్నారు. ఇదేనా ప్రతిపక్షం బాధితులకు ఇవ్వాల్సిన భరోసా?. భూములు పోయి రోడ్డున పడుతున్నామని రైతులు ఆక్రోశిస్తుంటే… అధికారంలోకి వచ్చాక తిరిగిచ్చేస్తామంటే అంతవరకు వాళ్లు రోడ్లమీద పల్లిలు అమ్ముకుంటూ బతకాలా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఈ హామీ ఇవ్వాడానికేనా 60 మందికి పైగా ఎమ్మెల్యేలను ప్రతిపక్షం తరపున ప్రజలు గెలిపించింది?. ఈ హామీని కాంగ్రెస్ వాళ్లు కూడా ఇస్తారు. వారికి వైసీపీకి తేడా ఏముంది?. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని నమ్మకం ఏమన్నా ఉందా..

జగన్ నిజంగా రైతుల పక్షాన పోరాటం చేయాలకుంటే నందిగ్రామ్ లో మమతా బెనర్జీ చేసిన పోరాటాన్ని సాగించాలి. అక్కడి రైతుల కోసం ఆమె నెలలు తరబడి ఆ ప్రాంతాన్ని స్తంభింపచేశారు. అందుకే కమ్యూనిస్టుల కంచుకోటలు బద్ధలు కొట్టి అధికారంలోకి రాగలిగారు. చిత్తశుద్ది అంటే అలా ఉండాలి. రాజధాని ప్రాంత రైతులు భూసేకరణ నుంచి తమ భూములు కాపాడమంటూ ప్రతిపక్ష నేత అయిన జగన్ దగ్గరకు వెళ్లకుండా… పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్తున్నారంటే అది ముమ్మాటికి వైసీపీ వైఫల్యమే. ప్రభుత్వం, పవన్ కలిసి నాటకాలాడుతుండవచ్చు. కానీ ఆ అవకాశం ఇచ్చింది కూడా జగనే.

ఇప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని మరీ ఎక్కువగా ఇబ్బందిపెడితే భవిష్యత్తులో తాను అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ కూడా ఇబ్బంది పెడుతుంది కదాని జగన్ అనుకుని ఉండవచ్చు. కానీ అదే నిజమైతే అదోరకమైన ఊహాజనిత స్థితే. రాజధాని నిర్మాణం తప్పనిసరి కాబట్టి ఆ భూముల విషయంలో కాస్త చూసిచూడనట్టుగా వెళ్లారని అనుకోవచ్చు. మరి మచిలీపట్నం పోర్టు భూములు, భోగాపురం ఎయిర్‌పోర్టు భూముల విషయంలోనూ భవిష్యత్తు వాగ్దానంతో సరిపెడితే ఎలా?.

ప్రస్తుతం జగన్ వస్తున్నారంటే భూనిర్వాసిత రైతులు పెద్దగా అంచనాలు పెట్టుకోవడం లేదు. ఎందుకంటే జగన్ ఏం చెబుతారో వారికి ముందే అర్దమైపోతోంది. తాను అధికారంలోకి వచ్చే వరకు ఎదురుచూడండి అని చెప్పడం తప్ప జగన్ ఏమీ చేయరన్న భావన వారిలో వచ్చేసింది. త్వరలో విశాఖ బాక్సైట్ ప్రాంతంలోనూ పర్యటిస్తారు కదా… బహుశ‌ అక్కడ కూడా ”నేను వస్తా అప్పుడు ఆపేస్తా” అని హామీనే ఇస్తారేమో?!.

First Published:  12 Nov 2015 12:11 AM GMT
Next Story