అలా మాట్లాడొద్దు పవన్.. బాధేస్తుంది!

మొన్నటి ఎన్నికల సమయంలో జనసేన పార్టీని స్థాపించిన పవన్.. నేటి రాజకీయాలపై విరుచుకుపడ్డారు. మార్పు రావాల్సిన అవసరం చాలా ఉందన్నారు. అయితే ఓట్లు చీలకూడదన్న ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగితే మాత్రం వారి తరపున ఇకపై జనసేనానిగా తాను ప్రశ్నిస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు పవన్ తీరు చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉంది. నవశకాన్ని నిర్మిస్తారనుకున్న పవన్ కల్యాణ్ కూడా డబ్బు రాజకీయాల వైపే  నిలబడడం దిగ్బ్రాంతి కలిగించే అంశం.

జనసేన పార్టీని ఎప్పటి నుంచిపూర్తి స్థాయిలో విస్తరిస్తారని విజయవాడలో మీడియా ప్రతినిధులు అడగ్గా… పవన్ ఏ మాత్రం తడబాటు లేకుండా తన దగ్గర అంత డబ్బు లేదన్నారు. పార్టీని విస్తరించాలంటే ప్రజాభిమానం ఒక్కటే సరిపోదని ఆర్థిక వనరులు కూడా ఉండాలని సెలవిచ్చారు. పవన్ నోట ఈ మాటను టీవీ ద్వారా చూసిన జనం ఆశ్చర్యపోయారు. డబ్బు లేకుంటే రాజకీయాలు చేయలేమని పవన్ నేరుగా చెప్పడం అంటే అంతకన్నా దారుణమైన అంశం మరొకటి ఉండదు. పవన్ కూడా డబ్బుతోనే పార్టీని విస్తరించి… ఆ డబ్బుతోనే రాజకీయాలు చేస్తానంటే ఇక కొత్తదనం ఏముంది?. ఆ పనేదో ఇప్పుడున్న పార్టీలు చేయలేవా?

రాజకీయాల్లో సంచలనాలు సృ‌ష్టించిన వారెవరూ డబ్బు లేదంటూ ఆగిపోలేదన్న విషయం పవన్‌కు తెలియదా?. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఢిల్లీ పీఠాన్ని కేజ్రీవాల్ అధిరోహించలేదా?. రాజకీయాల్లో నవశకాన్ని నిర్మించేవారికి, పోరాడేతత్వం ఉన్నవారికి డబ్బు లోటు ఎప్పుడూ వెనక్కు లాగలేదు. డబ్బు లేదు కాబట్టి పార్టీని విస్తరించడం లేదని చెప్పడం ద్వారా… నేటి యువతకు పవన్ ఏం మేసేజ్ ఇచ్చినట్టు?. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే డబ్బు తప్పనిసరి అనేగా?. కనీసం  ఇలాంటి డబ్బుల విషయాన్ని మనసులోనే దాచుకోండి. బయటకు తెచ్చి రాజకీయాలపై మరింత అసహ్యం కలిగేలా చేయకండి డియర్ లీడర్స్.