బాబు- కమల్ కలయిక కారణాలు మూడు

కొత్త రాజధాని నిర్మించుకుంటున్న రాష్ట్రం. అసలే భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకే ఏపీలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పలువురు పోటీ పడుతున్నారు. తాజాగా సినీ నటుడు కమల్‌హాసన్… ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. తన ”చీకటి రాజ్యం” సినిమా ప్రీమియర్ షో చూడాల్సిందిగా సీఎంను కోరేందుకు వచ్చానని కమల్ చెబుతున్నా దానితో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

ఏపీలో సినీపరిశ్రమ అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించాలని కమల్ ఉత్సాహంగా ఉన్నారట. దానిపైనే చంద్రబాబుతో చర్చించారని విశ్వసనీయ సమాచారం. దానితో పాటు నూతన రాజధాని అమరావతిలో కమల్ సొంతంగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీని కోసం అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై సీఎంతో చర్చించినట్టు తెలుస్తోంది. రాజధాని బ్రహ్మాండంగా నిర్మితమయ్యేందుకు తన వంతు పాత్ర పోషించాలని కమల్ హాసన్ అనుకుంటున్నారు. ”చీకటి రాజ్యం” సినిమా ప్రీమియర్ షోను విజయవాడతో పాటు హైదరాబాద్‌లోనూ ప్రదర్శిస్తామని కమల్ చెప్పారు. సినిమా చూసేందుకు చంద్రబాబు కూడా అంగీకరించారన్నారు.