స్మగ్లర్‌ గంగిరెడ్డి అరెస్ట్‌ … 22 పోలీసు కేసులు: డీజీపీ

ఎర్ర చందనం స్మగ్లర్‌ గంగిరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ పాస్‌పోర్టుతో ఇండియా నుంచి పారిపోయిన గంగిరెడ్డిని ఇంటర్‌పోల్‌ సహాయంతో మలేషియా ప్రభుత్వం అరెస్ట్‌ చేసినట్టు డీజీపీ రాముడు తెలిపారు. మొరాకో నుంచి మలేషియా వెళుతుండగా విషయం తెలిసిన తాము ఇంటర్‌పోల్‌ను అలర్ట్‌ చేశామని, వారు మలేషియాలో అరెస్ట్‌ చేశారని ఆయన చెప్పారు. నిజానికి ఆరు నెలలలోపే గంగిరెడ్డిని ఇక్కడకు తీసుకురావాలనుకున్నామని, కాని న్యాయపరమైన చిక్కులు సృష్టించి అనేకసార్లు తప్పించుకున్నాడని ఆయన తెలిపారు. ఆయన ఇక్కడ నుంచి తప్పించుకున్న తర్వాత సింగపూర్‌, దుబాయ్‌లో చాలాకాలం ఉన్నాడని, ఆ తర్వాత మొరాకో నుంచి మలేషియా వెళుతుండగా దొరికాడని చెప్పారు. ఆయనపై పోలీసు కేసులే 28 ఉన్నాయని, ఇవికాక అటవీశాఖ కూడా అతనిపై కేసులు నమోదు చేసిందని… వీటి గురించి మొత్తం వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. ఆయనను మొదట ప్రొద్దుటూరు కోర్టులో హాజరుపరచాల్సి ఉందని, అక్కడి నుంచి ఆయన తప్పించుకున్నాడని, నిజానికి ఆయనకు ఓ కేసులో 18 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉండగా తప్పించుకున్నాడని, అతనిపై కన్వెక్షన్‌ వారెంట్‌ ఉన్న దృష్ట్యా ముందుగా ప్రొద్దుటూరు కోర్టులో హాజరుపరచాల్సి ఉందని తెలిపారు. రాయలసీమ జిల్లాలకు చెందిన రాజకీయ, అధికారుల అండదండలున్నాయా అన్న ప్రశ్నకు ఇపుడే దీనిపై ఏమీ చెప్పలేమని అన్నారు. చిన్నచిన్న నేరాలు చేసే స్థాయి నుంచి అంతర్జాతీయ స్మగ్లర్‌గా ఎదిగి కోట్ల రూపాయలను ఆర్జించాడని డీజీపీ రాముడు తెలిపారు.

కడప జిల్లా పుల్లంపేట మండలం మల్లేవారిపల్లికి చెందిన గంగిరెడ్డిపై ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు సంబంధించి అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పాస్‌పోర్టులో తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యవహారంలోను, ఓ హత్య కేసులోను ఆయనపై కేసులు నమోదై ఉన్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు సంబంధించి ఆయనపై ఒక్క కడప జిల్లాలోనే 22 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో ముఠాలను ఏర్పాటు చేసుకుని ఆయన ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. ఎర్ర చందనాన్ని దేశ సరిహద్దులు దాటించడంలో ఆయన సిద్ధహస్తుడు. పోలీసు, అటవీశాఖ అధికారులను లోబరుచుకుని ఆయన స్మగ్లింగ్‌ కార్యకలాపాలను నిర్వహించినట్టు ఆయనపై ఆరోపణలున్నాయి. అలాగే రాజకీయ నాయకులతో కూడా ఆయనకు సంబంధాలు ఉండడమే కాకుండా వారిని కూడా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఇరికించినట్టు చెబుతున్నారు. విదేశాలకు భారీగా ఎర్ర చందనం తరలించిన కేసుల్లోను, పలువురు అంతర్జాతీయ స్మగ్లర్లతోను సంబంధాలున్న కేసుల్లోను కూడా గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. అలిపిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హత్య కేసులో కూడా గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు. ఆయనకు బెంగుళూరు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 200 కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు తెలుస్తోంది. ఇంటర్‌పోల్‌ సాయంతో పట్టుబడిన గంగిరెడ్డి గత ఎనిమిది నెలలుగా మారిషస్‌ జైలులోనే గడిపారు.
కాగా స్మ‌గ్ల‌ర్ గంగిరెడ్డిని మారిషస్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసిన కొన్ని రోజులకే అతన్ని త‌మ‌కు అప్ప‌గించాల‌ని కోరుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన సీఐడీ అధికారులు ఆ దేశ ప్ర‌తినిధుల‌ను గతంలో చెన్నైలో క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. గంగిరెడ్డిపై న‌మోదైన కేసుల తీవ్ర‌త‌ను వారికి వివ‌రించి ఈ కేసుల‌కు సంబంధించిన ప‌త్రాల‌ను కూడా వారికి అంద‌జేశారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్‌లో గంగిరెడ్డి పాత్ర‌, ఇత‌నితో మిగిలిన స్మ‌గ్ల‌ర్ల‌కున్న సంబంధాల‌ను, నాటి ముఖ్యమంత్రి హత్య కేసులో గంగిరెడ్డి పాత్రను సీఐడీ అధికారులు వారికి వివ‌రించారు. ఈ విష‌యాల‌న్నీ విన్న మారిష‌స్ అధికారులు సాధ్యమైనంత త్వరగా గంగిరెడ్డిని అప్ప‌గించ‌డానికి ప్ర‌య‌త్నిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ హామీలో భాగంగా గంగిరెడ్డిని ఏపీ సీఐడీ పోలీసులకు అప్పగించగా వారు ఇపుడు హైదరాబాద్‌ తీసుకువచ్చారు.