కెన‌డాలో హిందూ స్మ‌శాన వాటిక‌లు…సాధ్యం చేసిన తెలుగు వ‌నిత‌

కెన‌డాలోని మిస్సిస్సాగా ప్రాంతంలో ఇక‌పై హిందూ ధ‌ర్మం ప్రకారం అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించుకునేందుకు వీలుగా ప్ర‌త్యేక స్మ‌శాన‌వాటిక‌లను ఏర్పాటు చేయ‌నున్నారు. సికింద‌రాబాద్‌ నుండి కెన‌డా వెళ్లి అక్క‌డి ఒంటారియో రాష్ట్రంలో మంత్రిప‌ద‌విని చేప‌ట్టిన తెలుగువ‌నిత‌ దీపికా దామెర్ల వ‌ల‌న ఇది కార్య‌రూపం దాల్చ‌నున్న‌ది. అంత్య‌క్రియ‌ల‌కే కాక‌, చితాభ‌స్మం క‌లిపేందుకు సైతం త‌గిన వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చ‌నున్నారు. కెన‌డాలో ఇండో కెన‌డియ‌న్లు పెరుగుతున్న నేప‌థ్యంలో తాను ఇందుకోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టుగా దీపిక దామెర్ల తెలిపారు. ఆమె ఒంటారియోలో స‌హాయ మంత్రిగా ఉన్నారు. 4 బిలియ‌న్ల‌ (4వందల కోట్లు) డాల‌ర్ల నిధులు ఆమె మంత్రివ‌ర్గం ఆధీనంలో ఉంటాయి.

సికింద‌రాబాద్‌లో పుట్టి పెరిగిన దీపికా దామెర్ల ఉత్త‌ర అమెరికా దేశాల్లో మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన మొట్ట‌మొద‌టి తెలుగుమ‌హిళ కావ‌డం విశేషం. గ‌త ఏడాది ఆమె ప‌నిచేస్తున్న లిబ‌ర‌ల్ పార్టీ తిరిగి అధికారంలోకి రావ‌డంతో దీపిక‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది.

దీపిక తండ్రి ఆర్మీ అధికారి. త‌న గ్రాడ్యుయేష‌న్ అనంత‌రం ఆమె 1991లో కెన‌డా వెళ్లారు. టొరొంటో యూనివ‌ర్శిటీకి చెందిన కాలేజిలో ఎమ్‌బిఎ పూర్తి చేశారు. త‌రువాత కెన‌డాలోని అత్యున్న‌త స్థాయి బ్యాంకులు రెండింటిలో కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ హోదాలో ప‌నిచేశారు. ఆపై త‌న కుమార్తె పెంప‌కం కోసం ఆమె త‌న కెరీర్‌లో విరామం తీసుకున్నారు. త‌రువాత టొరొంటో లోని ఓమ్నీ టివి ఛాన‌ల్‌లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశారు. ఆ స‌మయంలోనే దీపిక‌కు రాజ‌కీయాల‌తో ప‌రిచయం ఏర్పడింది. అలా 2007లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. 2011లో ఎన్నిక‌ల్లో పోటీచేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కెన‌డాకి వ‌లస వ‌చ్చిన మొద‌టిత‌రం వ్య‌క్తిగా, అందునా ఒక మ‌హిళ‌గా రాజ‌కీయా‌ల్లో రాణించ‌డం అంత సులువుకాద‌ని, కానీ త‌న‌లోని స్థిర సంక‌ల్పం, ఆత్మవిశ్వాసం త‌న క‌ల‌ని సాకారం చేశాయ‌ని దీపిక చెబుతున్నారు. ఒంటారియో ప్రొవిన్షియ‌ల్ పార్ల‌మెంటు (మ‌న‌దేశంలో రాష్ట్ర అసెంబ్లీతో స‌మానం)కి ఆమె రెండుసార్లు ఎన్నిక కావ‌డం విశేషం. వ‌చ్చే సంవ‌త్సరం ఫిబ్ర‌వ‌రిలో, ఒంటారియో ప్రీమియ‌ర్… కాథ‌లీన్ విన్నేతో క‌లిసి దీపిక ఇండియా రానున్నారు. భార‌త్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు విష‌యంలో త‌మ రాష్ట్రం ఒంటారియో, కెన‌డా తోడ్పాడు అందిస్తున్న‌ట్టుగా చెబుతూ,  భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ టొరంటో వ‌చ్చిన‌పుడు భార‌త్ ఎప్పుడు వ‌స్తున్నార‌ని త‌మ‌ని అడిగార‌ని దీపిక అన్నారు. మొత్తానికి మ‌న తెలుగు మ‌హిళ కెన‌డాలో విజ‌య‌కేత‌నం ఎగుర‌వేయ‌డం ఎంతో స్ఫూర్తి దాయ‌కం.