డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళను ప్రదానం చేసిన కేసీఆర్‌

పేద ప్రజలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌లు ఇవ్వడమనేది దేశంలోనే ప్రప్రథమమని, ఇది కొత్త అధ్యాయానికి నాంది పలకడమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. 580 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇళ్ళను 396 మంది లబ్దిదారులకు అందజేశారు. సికింద్రాబాద్‌లోని ఐడీహెచ్‌ కాలనీలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళను పేదలకు ప్రదానం చేస్తూ ఆయన మాట్లాడారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందుకే వాళ్ళకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళను నిర్మించి ఇస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. నియోజకవర్గానికి 400 చొప్పున డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళను కట్టిస్తామని ఆయన చెప్పారు. అర్హులకు ఇళ్ళ పట్టాలను అందజేశారు. ఇప్పటి వరకు 396 మంది లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అందించామన్నారు. వీటిలో 276 మంది షెడ్యూలు కులాల లబ్దిదారులకు, 31 ఇళ్ళను ఎస్టీలకు, 79 ఇళ్ళను బలహీనవర్గాలకు కేటాయించారు. మిగిలిన ఇళ్ళను మైనారిటీలకు కేటాయించారు. రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్లను నిర్మిస్తామని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కేసీఆర్ అన్నారు. 2014 అక్టోబర్‌లో ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంబించి 13 నెలల్లో పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నాయిని నర్సింహరెడ్డి, మహేందర్‌రెడ్డి, పద్మారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.