Telugu Global
NEWS

అన్న క్యాంటీన్‌లకు మోక్షం ఎప్పుడు?

ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూనే వృధా ఖర్చులు ఎన్నో చేస్తోంది ఏపీ ప్రభుత్వం. గోదావరి పుష్కరాల నుంచి రాజధాని నిర్మాణం వరకు హంగు ఆర్భాటాలతో వందల కోట్లు ఖర్చు చేసింది. కానీ పేదవారికి మూడు పూటలా అన్నం పెట్టాలన్న సంకల్పం మాత్రం ప్రభుత్వంలో కనిపించడం లేదు. స్వయంగా చంద్రబాబు హామీ ఇచ్చిన అన్న క్యాంటీన్ పథకం ఏడాదిన్నర దాటినా అమలుకు నోచుకోవడం లేదు. ఈ పథకం అమలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనూ చర్చనీయాంశం అయింది. తమిళనాడులో సీఎం జయలలిత […]

అన్న క్యాంటీన్‌లకు మోక్షం ఎప్పుడు?
X

ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూనే వృధా ఖర్చులు ఎన్నో చేస్తోంది ఏపీ ప్రభుత్వం. గోదావరి పుష్కరాల నుంచి రాజధాని నిర్మాణం వరకు హంగు ఆర్భాటాలతో వందల కోట్లు ఖర్చు చేసింది. కానీ పేదవారికి మూడు పూటలా అన్నం పెట్టాలన్న సంకల్పం మాత్రం ప్రభుత్వంలో కనిపించడం లేదు. స్వయంగా చంద్రబాబు హామీ ఇచ్చిన అన్న క్యాంటీన్ పథకం ఏడాదిన్నర దాటినా అమలుకు నోచుకోవడం లేదు. ఈ పథకం అమలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనూ చర్చనీయాంశం అయింది.

తమిళనాడులో సీఎం జయలలిత అమలు చేస్తున్న ‘అమ్మ క్యాంటీన్’ తరహాలోనే ఏపీలోనూ ఎన్టీఆర్ పేరుతో ‘అన్న క్యాంటీన్లు’ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కేవలం రూ. 5 కే పేదలకు కడుపునిండా భోజనం పెట్టాలన్నదే ఈ పథకం ఉద్దేశ్యం. తమిళనాడులో ఇప్పటికే ఇది చాలా విజయవంతంగా నడుస్తోంది. పథకం అమలుకు అవసరమైన విధివిధానాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ సబ్ కమిటీ తమిళనాడు వెళ్లి అధ్యయనం చేసి వచ్చింది. విశాఖలో 15, గుంటూరులో 10, తిరుపతిలో 5, అనంతపురంలో మరో 5 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ఆస్పత్రులు, బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఒక మనిషికి 3 పూటలా ఆహారం అందించేందుకు రూ.40 సబ్సిడీని భరించాల్సి ఉందని అంచనా వేసింది ప్రభుత్వం. దీంతో ఏటా ప్రభుత్వంపై 200 కోట్లు భారం పడుతుందని అంచనా. అయితే ఇప్పటి వరకు ఈ మంచి పథకం మాత్రం అమలు కావడం లేదు. చంద్రబాబు ఇచ్చిన హామీల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నా.. అన్న ఎన్టీఆర్ పేరుతో అమలు చేయబోతున్న అన్న క్యాంటీన్ పథకం ఖర్చు ఏటా 200కోట్లకు మించి కాదు. మరి ఎందుకు ప్రభుత్వం దీన్ని అమలు చేయడం లేదు అని పార్టీలోని కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హరేకృష్ణ మూవ్ మెంట్ సహకారంతో 5 రూపాయలకే భోజనం పథకం అమలు చేస్తోంది. ఇదే తరహాలో ఏపీలో కూడా ఇస్కాన్, హరే రామ, అక్షయపాత్ర లాంటి ధార్మిక సంస్థలకు అప్పజెప్పాలన్న ప్రతిపాదనను కొందరు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగానే దీని అమలు ఆలస్యమవుతోందని చెబుతోంది.

First Published:  16 Nov 2015 12:08 AM GMT
Next Story