Telugu Global
Others

గుడివాడ ఎమ్మెల్యే నానిని ఎందుకు అరెస్టు చేశారు?

కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ని అరెస్టు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? నాని అద్దెకు తీసుకొని నిర్వహిస్తోన్న వైసిపి కార్యాలయ భవనాన్ని ఖాళీ చేయకపోవడమే అరెస్టుకు కారణమా? అరెస్టు చేసిన నాని ని మూడు గంటల పాటు ఎక్కడ ఉంచిందీ…ఎక్కడకు తీసుకెళ్లిందీ చెప్పకుండా పోలీసులు ఎందుకు దాచిపెట్టారు? ముందస్తు ఎలాంటి హెచ్చరికలు లేకుండా..ఎస్పీస్థాయి అధికారి వచ్చి…ప్రత్యేక పోలీసు బలగాలతో మోహరించి ఎమ్మెల్యేని ఎందుకు హుటాహుటిన అజ్ఞాతంలోకి తీసుకెళ్లారు? ఇదంతా రాజకీయ […]

గుడివాడ ఎమ్మెల్యే నానిని ఎందుకు అరెస్టు చేశారు?
X

కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ని అరెస్టు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? నాని అద్దెకు తీసుకొని నిర్వహిస్తోన్న వైసిపి కార్యాలయ భవనాన్ని ఖాళీ చేయకపోవడమే అరెస్టుకు కారణమా? అరెస్టు చేసిన నాని ని మూడు గంటల పాటు ఎక్కడ ఉంచిందీ…ఎక్కడకు తీసుకెళ్లిందీ చెప్పకుండా పోలీసులు ఎందుకు దాచిపెట్టారు? ముందస్తు ఎలాంటి హెచ్చరికలు లేకుండా..ఎస్పీస్థాయి అధికారి వచ్చి…ప్రత్యేక పోలీసు బలగాలతో మోహరించి ఎమ్మెల్యేని ఎందుకు హుటాహుటిన అజ్ఞాతంలోకి తీసుకెళ్లారు? ఇదంతా రాజకీయ ఆధిపత్యంకోసం చేసే పోరాటంలో భాగంగానే పేర్కొంటున్నారు. గుడివాడ అంటే కొడాలి నాని..కొడాలి నాని అంటే గుడివాడ అనే విధంగా అక్కడ రాజకీయాలు ఉన్నాయి.ఇదే ఇపుడు నాని అరెస్టుకు ప్రధానకారణం అయింది.

అరెస్టు వెనుక అసలుకారణం ఏమిటి?
ఒకబలమైన సామాజిక వర్గానికి కేంద్రబిందువు గుడివాడ. వ్యాపారంలో గానీ, రాజకీయంలో గానీ,వ్యవహారంలో సైతం అదే సామాజికవర్గం ఆధిపత్యం చెలాయిస్తుంది. అలాంటి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మినహా మిగిలిన ఏ పార్టీ కూడా అక్కడ మనగలిగే పరిస్థితులు ఉండవు. రాజకీయమేకాదు వ్యాపారం చేయాలన్నా..ఇతరత్రా ఎలాంటి అంశాల్లో ముందుకు వెళ్లాలన్నా వేరేసామాజిక వర్గాలకు గుడివాడలో చోటు ఉండదు. కాదు..కూడదు అనిసాహసించి తలపెడితే ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు.అలాంటిచోట తెలుగుదేశాన్ని కాదని వైఎస్‌ఆర్‌సిపిని గెలిపించడం అనేది జీర్ణించుకోలేని విధంగా మారింది.
కొడాలి నాని పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతమైన ఇమేజ్‌తో గెలుపొందుతున్నారు. గతంలో రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. అనుకోని రీతిలో వైఎస్‌ఆర్‌సిపిలోకి మారారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీ చేసిగెలుపొందారు. ఆయన దేశం పార్టీ నుంచి వైసిపి లోకి మారుతున్నపుడు బలమైన సామాజికవర్గ పెద్దలంతా నానితో తీవ్రస్థాయిలోనే మంతనాలు జరిపారు. ”తెలుగుదేశం అంటే మనది..మనమంటేనే తెలుగుదేశం..నందమూరి తారకరామారావు ఈ ప్రాంతం(నిమ్మకూరు) వారు.మన సొంత ఇంటి నుంచి వెళ్లిపోతే ఎలా? పార్టీ మారొద్దు. ” అని నానికి హితబోధ చేశారు. అయినా ఆయన వినలేదు. వైసిపిలోకి వెళ్లారు. అనుకున్నట్లుగానే గెలిచారు.ఊహించని రీతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావు ఓడిపోయారు. దీంతో తెలుగుదేశం-వైసిపి ల మధ్య తీవ్రస్థాయిలోవైరాలు పెరిగాయి. ఆధిపత్యపోరాటాలు ఎంతవరకూ వెళ్లాయంటే నాని మనుషులు,వైసిపి జనాలు ఎవరు కన్పించినా సరే వారిపై కక్షతీర్చుకునే స్థాయికి వెళ్లాయి. గుడివాడ నియోజకవర్గంలో ఉన్న రేషన్‌ డీలర్లు ఎక్కువ మంది గత ఎన్నికల్లో నానికి అనుకూలంగా పనిచేశారని వారిపై కేసులు పెట్టారు. 46 మందిని అరెస్టులు చేయించారు. జైలుకు పంపారు. వారికున్న డీలర్‌షిప్‌లను రద్దు చేయించారు. హైకోర్టు నుంచి వారికి అనుకూలంగా తీర్పు వచ్చినా సరే వాటిిని అమలు చేయించకుండా అడ్డుకుంటున్నారు. అక్కడ నాని మనుషులు ఎవరు, ఎక్కడ ఎలాంటి స్థాయిలో ఉన్నా వారిపై కక్షసాధింపు ధోరణి అవలంభిస్తున్నారు. వైసిపి అన్నా…నాని అన్నా ఇపుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు…ముఖ్యంగా రావి వెంకటేశ్వరరావుకు కంపరంగా ఉంది. నాని మనుషుల వల్లనే తాను ఓడిపోయానని, గెలిచి ఉంటే మంత్రి అయి ఉండేవాడినని ప్రతిక్షణం రావికి గుర్తుకు వస్తోంది.దీంతో గుడివాడ రాజకీయాలు నిత్యం రసవత్తరంగా తయారవుతున్నాయి.
ఇప్పటివరకూ రేషన్‌ డీలర్లు..చిన్న వ్యాపారస్తులపై కక్షతీర్చుకున్న రావి వెంకటేశ్వరరావు ఇపుడు ఏకంగా ఎమ్మెల్యేపైనే గురిపెట్టారు. అదును కోసం ఇన్నాళ్లు ఎదురు చూశారు. అనుకున్నట్లుగానే అద్దెభవనం సాకు దొరికింది. దీన్ని ముఖ్యమంత్రి వరకూ తీసుకెళ్లారు. నాని అడ్డుతొలగితే గుడివాడలో టిడీపీ కి తిరుగు ఉండదని..నాని లేకపోతే వైసిపి కూడాకన్పించదని అధినేతకు చెప్పారు. గుడివాడలో ఉన్న నానిలో వైఎస్‌ జగన్‌ని చంద్రబాబు చూశారు. నానిని అరెస్టు చేస్తూ కూడా జగన్‌ని అరెస్టు చేయించినంత ఆనందపడిపోయారు. ఫలితంగానే భారీ బందోబస్తు మధ్య నానిని అరెస్టు చేశారు.

ఏమిజరగబోతోంది?
గుడివాడ రాాజకీయలు రోజుకోమలుపు తిరగబోతున్నాయి. ఇప్పటి వరకూ టీడీపీ వైసిపిల మధ్య గుట్టుచప్పుడు కాకుండా ఉన్న విభేదాలు ఇపుడు తెరకు ఎక్కాయి. నానీరావిల మధ్యవైరం ముఖాముఖి తలపడేలా మారింది.ఇపుడు యుద్ధం ప్రత్యక్షం అయింది. రాజకీయాల్లో యుద్దాలుఆరంభించడమే కాని ముగించడం ఎవరి చేతుల్లోనూ ఉండదు. అందులోనూ టీడీపీ వైసిపి మధ్య అది అసలు సాధ్యం కాదు.అదీ గుడివాడలో అసలు సాధ్యంకాదు.ఆధిపత్య పోరాటం అనాదిగా సాగుతోంది. ఇపుడు గుడివాడలో ఇరు పార్టీలు కూడా చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నం అయింది. నాని తగ్గే ఘటం కాదు. అలా అని రావి కూడా అధికార పార్టీలో ఉన్నారు.ఎమ్మెల్యే నాని అయినా అధికారం చెలాయించేది మాత్రం రావి వెంకటేశ్వరరావే.ఈపరిస్థితుల్లో గుడివాడ రాజకీయాలు మరింతగా వేడెక్కుతాయి. సవాల్‌కు ప్రతిసవాల్‌ విసురుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో కూడా గుడివాడ నుంచే పోటీ చేస్తానని, గెలుపొందుతానని నాని సవాల్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దమ్ముంటే గుడివాడలో తనపై పోటీచేసి గెలుపొందాలని సవాల్‌ చేశారు. దీనిపై టీడీపీ నాయకులూ స్పందించారు. ఇపుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రా..చంద్రబాబు అవసరం లేదు…తమ దగ్గర పనిచేసే వ్యక్తిని నిలబెట్టి గెలిపిస్తామని రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఇలాంటి సవాళ్లే ఇకముందు ప్రతిరోజూ ఉంటాయి. పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

First Published:  15 Nov 2015 11:41 PM GMT
Next Story