Telugu Global
POLITICAL ROUNDUP

నోరులేని పిల్లల కోసం… కాస్త బుర్రపెట్టి ఆలోచిద్దాం..మనసుపెట్టి పనిచేద్దాం

మనం సముచిత జాగ్రత్తలు తీసుకుంటే, అన్ని వ్యవస్థలు ఎలాంటి లొసుగులూ లేకుండా నడిస్తే, నివారించగల ప్రమాదాలు, ఆపాయాలు కళ్లముందు జరుగుతుంటే చాలా బాధనిపిస్తుంది. అంతకంటే ఎక్కువగా ఆవేశమొస్తుంది. ఎవరిని ప్రశ్నించాలో తెలియని స్థితిలోకి వెళ్లిపోతాం. ఒకవేళ గళమెత్తి ప్రశ్నించినా ప్రజాగళం పీలగానూ, ప్రభుత్వ అండ ఉన్న అక్రమార్కుల గొంతు ఆంబోతు రంకెగానూ వినబడుతుంది. మరోసారి శ్రీచైతన్య విద్యాసంస్థ నిర్లక్ష్యానికి ముక్కుపచ్చలారని ఓ చిన్నారి బలైపోయింది. విని జీర్ణం చేసుకునేందుకు కూడా సాధ్యం కానంత ఘోరమది. హైదరాబాద్‌లోని శ్రీచైతన్య […]

నోరులేని పిల్లల కోసం… కాస్త బుర్రపెట్టి ఆలోచిద్దాం..మనసుపెట్టి పనిచేద్దాం
X

మనం సముచిత జాగ్రత్తలు తీసుకుంటే, అన్ని వ్యవస్థలు ఎలాంటి లొసుగులూ లేకుండా నడిస్తే, నివారించగల ప్రమాదాలు, ఆపాయాలు కళ్లముందు జరుగుతుంటే చాలా బాధనిపిస్తుంది. అంతకంటే ఎక్కువగా ఆవేశమొస్తుంది. ఎవరిని ప్రశ్నించాలో తెలియని స్థితిలోకి వెళ్లిపోతాం. ఒకవేళ గళమెత్తి ప్రశ్నించినా ప్రజాగళం పీలగానూ, ప్రభుత్వ అండ ఉన్న అక్రమార్కుల గొంతు ఆంబోతు రంకెగానూ వినబడుతుంది.
మరోసారి శ్రీచైతన్య విద్యాసంస్థ నిర్లక్ష్యానికి ముక్కుపచ్చలారని ఓ చిన్నారి బలైపోయింది. విని జీర్ణం చేసుకునేందుకు కూడా సాధ్యం కానంత ఘోరమది. హైదరాబాద్‌లోని శ్రీచైతన్య స్టార్కిడ్స్ స్కూల్లో లిఫ్ట్లో తల ఇరుక్కుని అయిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఎంతోమంది నిర్లక్ష్యానికి ఓ పసిపాప తన ప్రాణాన్ని మూల్యంగా చెల్లించింది.
అజ్ఞానం కంటే, మూర్ఖత్వం కంటే నిర్లక్ష్యం ప్రమాదకరమైనదనేది ఒక నానుడి. అది నూటికి నూరుశాతం నిజమని నిరూపించిన ఘటన ఇది. అయిదేళ్ల చిన్నారి ప్రతిరోజూ తాను సొంతంగా లిఫ్ట్ని ఎక్కి క్లాసులోకి వెళ్లటం…అనేది జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. అసలు పసిపిల్లలు అంతస్తులు ఎక్కి రావాల్సిన పరిస్థితులు ఉన్నపుడు వారు ఎలా పైకి వస్తున్నారు…అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…అనే విషయంలో ఎలాంటి పద్ధతులు కానీ, విధానాలు కానీ ఏమీ లేవు. చిన్నారులకు సహాయకులుకానీ, లిఫ్ట్ ఆపరేటర్‌గానీ ఉండి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. ఉపయోగించడం తప్ప ప్రమాదాన్ని ఊహించే శక్తి చిన్నారులకు ఉండదనే కనీస జ్ఞానం లేని స్కూలు యాజమాన్యాలు, టీచర్లు పిల్లలకు జ్ఞానాన్ని అందించే హోదాలో ఉండటం మరింత దురదృష్టకరం.
మనుషులంతా మంచితనంగా ఉండరు కాబట్టే వ్యవస్థలు…వాటికి కొన్ని విధానాలు ఉన్నాయి. మనుషులంతా మనసుపెట్టి పనిచేయరు కాబట్టే పాటించాల్సిన నిబంధనలు, పరిమితులు, అనుమతులు, లైసెన్సులు, తనిఖీలు, నిఘాలు ఇవన్నీ ఉన్నాయి. వాటి పరిధిలో పనిచేసేవాళ్లు ఎలాంటి వారైనా, ఆయా విధానాలకు తప్పనిసరిగా లోబడి పనిచేయాలి. అప్పుడే ప్రజాజీవితం సురక్షితంగా ఉంటుంది. కానీ మనకు బలమైన వ్యవస్థలు ఉన్నా, అవి వ్యక్తుల బలహీనతలకు లోబడే నడుస్తున్నాయి. అందుకే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.
ఇలాంటి స్కూళ్లకు ప్రభుత్వాలనుండి అనుమతులు నిరాటంకంగా లభిస్తూనే ఉన్నాయి. ఇరుకుగదులు, అయిదారు అంతస్తులకు ఒకటిరెండు వాష్రూములు, ఆటస్థలాలే లేకపోవడం, గాలి వెలుతుర్ల లోపం… ఇవన్నీ ఘనమైన కార్పొరేట్ స్కూల్సుగా చెప్పుకుంటున్నవాటిలో సర్వసాధరణ విషయాలుగా మనం ఆమోదించేస్తున్నాం.
కార్పొరేట్ కాలేజీలు తప్ప పిల్లలకు విద్యాపరంగా మరొక ఆప్షన్ లేకుండా చేస్తున్న ప్రభుత్వాలు సైతం ఇలాంటి ప్రమాదాలకు బాధ్యత వహించాల్సిందే. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు లేవని, బాత్రూముల లేవని, ఆడపిల్లలు మంచినీళ్లు తాగకుండా స్కూళ్లకు వస్తున్నారని…పదేపదే రాసే, చూపించే మీడియా సైతం ప్రయివేటు పాఠశాలల జోలికి వెళ్లడం లేదు. కార్పొరేట్ స్కూళ్లలో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని కానీ, ఆయా స్కూళ్లలో ఉన్న సౌకర్యాల కొరతని కానీ బట్టబయలు చేయదు. ఇక్కడ మీడియాసైతం తన స్వప్రయోజనాలను చూసుకుంటోంది.
ఇప్పుడు ప్రమాదం జరిగిన చైతన్య విద్యాసంస్థలనే తీసుకుంటే సుమారు 600 నుంచి 1000 మంది ఇంటర్‌మీడియట్‌ విద్యార్ధులు చదువుకునే కాలేజీ అనబడే అపార్టుమెంట్‌లో అందరు విద్యార్ధులకు కలిపి 7,8 టాయ్‌లెట్స్‌ ఉంటాయి. వాళ్లకు ఇచ్చే ఇంటర్‌వెల్‌టైమ్‌ అరగంట. ఆ కొద్దిసమయంలో భోజనం చెయ్యాలి, అందరూ వాష్‌రూమ్‌కు వెళ్ళాలి. ఇది సాధ్యమా? సాధ్యంకాదనే చాలామంది అమ్మాయిలు వాష్‌రూమ్‌కు వెళ్ళాల్సిన అవసరం రాకుండా పగలంతా మంచినీళ్లు తాగకుండా జాగ్రత్తపడతారు. వాళ్ల మెడిసిన్‌ సీట్‌ ఏమో కానీ కిడ్నీ వ్యాధులు రావడం ఖాయం. స్వచ్ఛ్‌భారత్‌ చేపట్టాల్సింది వీధుల్లోకాదు మొదట కార్పోరేట్‌ కాలేజీల్లో. ఈ కాలేజీల్లో అనుకోని అగ్నిప్రమాదాలు జరిగితే విద్యార్ధులు బయటపడేందుకు రెండోమార్గం లేదు. వ్యాపారసంస్థలమీద, సినిమాహాళ్ల మీద జాగ్రత్తలు తీసుకునే అధికారులు కార్పోరేట్‌ కాలేజీలకు ఇంత నిస్సిగ్గుగా అమ్ముడుపోవాలా?
దాదాపు విద్యార్ధుల చేతులు, కాళ్లు, నోరు కట్టేసింత పనిచేసి, అంతగా ఆంక్షలు విధించి, చదివించడమే తమ ఏకైక ధర్మంగా భావిస్తున్నాయి కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు. ఇంత ఫ్రస్ట్రేషన్తో తప్ప చదువులు చెప్పలేని, చదవలేని పరిస్థితి ఎందుకు దాపురించింది… అనే విషయాన్ని ఇప్పటికీ ఎవరూ సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. ఏ పనైనా హింసాత్మకంగానే చేయాల్సి వస్తే తక్షణం మరోమార్గం కోసం వెతుక్కోవడం మనిషి పని. అది అందరికీ, అన్ని పనులకూ వర్తిస్తుంది. ఒక్క చదువు విషయంలోనే దీన్ని ఎవరూ ప్రశ్నించడం లేదు.
సౌకర్యాలపరంగా, బోధనపరంగానూ ఎలా చూసినా నేటి పిల్లలు ఎంతో ఒత్తిడికి గురవుతూ చదువుతున్నారు. ఈ చదువులు ఎప్పుడు అయిపోతాయిరా బాబూ…అనే విసుగు, నిస్సహాయత పిల్లల్లో ఉంటోంది. అందమైన బాల్యాన్ని ఆస్వాదించే స్థితి వారికసలు లేనే లేదు….ఇప్పడయితే బాల్యం సంగతి సరే…ప్రాణాలకే ముప్పువచ్చేంత స్థితికి మన విద్యావిధానం దిగజారిపోయింది.
ప్రభుత్వాన్నయినా, వ్యవస్థనయినా నడిపేది వ్యక్తులే…మనుషులే…పాలకులు, ప్రభుత్వ అధికారులు, తల్లిదండ్రులు, స్కూళ్ల యజమానులు, ఉపాధ్యాయులు, సిబ్బంది…అంచెలంచెలుగా ఈ పాపాన్ని అంతా మోస్తున్నారు. వీరంతా కనీసస్పృహతో, కనీస బాధ్యతతో వ్యవహరిస్తే…ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చు. లేకపోతే మనకంటే పిల్లలను పొట్టకు అదుముకుని, రెక్కల్లో దాచుకుని పెంచుకునే జంతువులు, పక్షులు ఎన్నో రెట్లు గొప్పవని ఒప్పుకుని తీరాలి.

First Published:  18 Nov 2015 4:49 AM GMT
Next Story