చౌటుప్పల్ లో ఎన్టీఆర్ కు ఏం పని..?

ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమాతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. త్వరలోనే యూనిట్ అంతా ఆఖరి షెడ్యూల్ కోసం స్పెయిన్ కూడా వెళ్లడానికి సిద్ధమౌతోంది. అయితే ఇంతలోనే సడెన్ గా చౌటుప్పల్ లో ప్రత్యక్షం అయ్యాడు ఎన్టీఆర్. హైదరాబాద్ లో ఉండాల్సిన యంగ్ టైగర్.. సిటీ శివార్లకు ఎందుకెళ్లాడని అంతా ఆరాలు తీయడం మొదలుపెట్టాడు. కానీ తన కొత్త సినిమా పనికోసమే తారక్ శివారు ప్రాంతానికి చేరుకున్నాడు.
తూప్రాన్ పేట్ మండలం సుచిర్ ఇండియా వెంచర్ లో ఎన్టీఆర్ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం 150 మంది జూనియర్ ఆర్టిస్టులతో తారక్ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కు సంబంధించిన సాంగ్ సన్నివేశాలతో పాటు.. కొన్ని ఫైట్ సీక్వెన్సులు కూడా ఇక్కడ తెరకెక్కిస్తున్నారు. గతంలో గబ్బర్ సింగ్, రెబల్, ఆగడు లాంటి సినిమాల క్లయిమాక్స్ సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాన్నకు ప్రేమతో సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకే ఈ షెడ్యూల్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి, 20 రోజుల పాటు జరిగే స్పెయిన్ షెడ్యూల్ ను ప్రారంభించాలనుకుంటున్నారు. వచ్చేనెల ఈ సినిమా పాటల్ని గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.