Telugu Global
NEWS

ఏపీలో వర్ష బీభత్సం

ఆంధ్రప్రదేశ్ లో అల్పపీడన ప్రభావంతో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురిసిన వానలు నెల్లూరు జిల్లాతోపాటు చిత్తూరు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జనజీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. వర్షం నీటితో వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. అటు ప్రకాశం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో కూడా వర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. నెల్లూరు జిల్లాలో: నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక […]

ఏపీలో వర్ష బీభత్సం
X

ఆంధ్రప్రదేశ్ లో అల్పపీడన ప్రభావంతో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురిసిన వానలు నెల్లూరు జిల్లాతోపాటు చిత్తూరు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జనజీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. వర్షం నీటితో వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. అటు ప్రకాశం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో కూడా వర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది.

నెల్లూరు జిల్లాలో:
నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 500 చెరువులకు గండ్లు పడ్డాయి. 10వేల ఎకరాల్లోని చేపల, రొయ్యల చెరువులకు నష్టం వాటిల్లింది. జాతీయ రహదారులు వర్షం ధాటికి దెబ్బతిన్నాయి. ముంగమూరు, ఏనుగులబావి, పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయి. వంతెనలు కూలిపోయాయి. నెల్లూరు-చెన్నై హైవే కూడా దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికీ జిల్లాలోని 46 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భారీ వర్షాలకు జిల్లాలో 25 మంది చనిపోయారు.

చిత్తూరు జిల్లాలో:
భారీ వర్షాలు చిత్తూరు జిల్లాను కూడా వణికించాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం భారీగా పంట నష్టం జరిగింది. వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. వర్ష బీభత్సానికి జిల్లాలో 11 మంది చనిపోయారు. వేరుశెనగ, టమోటా, కంది, వరి, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో వరదబాధితుల కోసం 35 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

కడపజిల్లాలో:
ఇటు కడప జిల్లాలో కూడా భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నారు. చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని పాపాఘ్ని నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రాయచోటి నియోజకవర్గ పరిధిలోని అబ్బవరం సమీపంలో కంచాలమ్మచెరువుకు గండి పడింది. కడప జిల్లాలో వరద పరిస్థితిపై ఇంచార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులతో సమీక్షించారు. వరద బాధితులకు వసతి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో:
AP-rains-dead-d25419కుండపోత వర్షాలకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా అపార పంట నష్టం జరిగింది. కోనసీమ ప్రాంతంలో లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఈదురు గాలులకు వరిచేలు నేలవాలాయి. అయినవిల్లి మండలం మాగాం దగ్గర నీట మునిగిన వరిచేలను కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఐదు రోజులుగా జిల్లాల్లో కురిసిన వర్షం, పంట నష్టాలను అంచనా వేసే పనిలో మంత్రులు, కలెక్టర్లు నిమగ్నమయ్యారు. ఇప్పటికే సహాయక చర్యల కోసం రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. అంటువ్యాధులు ప్రబల కుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉండడంతో అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ జిల్లాల్లోని అనేక గ్రామాల్లో విద్యుత్‌సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని గ్రామల్లో మూడురోజులనుంచి కరెంట్‌లేదు.

First Published:  19 Nov 2015 12:02 AM GMT
Next Story