ఆటో జానీ సెకండాఫ్ ప‌నిలో పూరీ

చిరంజీవి 150 సినిమాపై మ‌ళ్లీ గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ చెప్పిన‌ ఆటోజానీ సినిమాను దాదాపు ఓకే చేసిన చిరంజీవి త‌రువాత సెకండాఫ్ న‌చ్చ‌లేద‌ని ప‌క్క‌న బెట్టిన సంగ‌తి తెలిసిందే! త‌రువాత‌ క‌త్తి రీమేక్ కోసం ప్లాన్ చేసిన చిరంజీవి దానికి ద‌ర్శ‌కుడిగా తొలుత మురుగ‌దాస్‌ను త‌రువాత వినాయ‌క్‌ను అనుకున్నారు. మురుగ‌దాస్ బిజీ కావ‌డంతో వినాయ‌క్‌నే ఫైన‌ల్ అనుకున్నారు. రీమేక్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డం, అఖిల్ సినిమా ఫ‌లితం నెగిటివ్‌గా రావ‌డంతో వినాయ‌క్‌ను, క‌త్తి ప్రాజెక్టును రెంటినీ కాద‌న్నాడు మెగాస్టార్‌. దీంతో ఈ ప్రాజెక్టు తిరిగి పూరిజ‌గ‌న్నాథ్ వ‌ద్ద‌కే వెళ్లింద‌నే వార్త‌ తాజాగా ఫిలింన‌గర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 
ఎగిరి గంతేసిన పూరీ!
స్వ‌త‌హాగా మెగాస్టార్‌ అభిమాని అయిన పూరీ జ‌గ‌న్నాథ్ చిరంజీవి కోసం ఎంతో ఇష్టంగా ఆటోజానీ క‌థ‌ను రాసుకున్నాడు. చిరంజీవి మేన‌రిజం, బాడీ లాంగ్వేజ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్‌,  ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ప‌క్కా మాస్ క‌థ‌ను రూపొందించాడు. 150వ సినిమాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న చిరంజీవికి త‌న సినిమాను ఎవ‌రితో చేయాలో అర్థం కావ‌డం లేదన్న‌ది అభిమానులంద‌రికీ అర్థ‌మైంది. ఎందుకంటే.. బంతి తిరిగి పూరీ జ‌గన్నాథ్ కోర్టుకే వెళ్లిన‌ట్లు స‌మాచారం. అదేనండీ ఈసారి సెకండాఫ్ లో మార్పులు చేసుకుని తీసుకురావాల‌ని పూరీకి పిలుపువ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఈ పిలుపుతో పూరీ ఎగిరి గంతేశాడంట‌. ప్ర‌స్తుతం లోఫ‌ర్ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో పూరీ బిజీగా ఉన్నాడు. ఈ ప‌ని పూర్తి కాగానే ఆటోజానీకి రెండు లేదా మూడు సెకండాఫ్‌లు సిద్ధం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. పైగా అన్న‌య్య‌ నుంచి పిలుపురావ‌డం ఇది రెండోసారి. ఈసారి ఎలాగైనా క‌థ ఒప్పించాకే వెనుతిరిగాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నాడ‌ట పూరీ!