Telugu Global
Others

మళ్లీ రామ మందిరంపై దృష్టి

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రస్తుతం తమకు ప్రధానమైన అంశాలలో లేదని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వంలో ఉన్న నాయకులెవరూ ఈ ఏడాదిన్నర కాలంలో ఆ అంశాన్ని ప్రస్తావించనే లేదు. కాని రామ మందిర నిర్మాణ ఆవశ్యకతను ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ స్పష్టంగానే చెప్తున్నారు. విశ్వహిందూ పరిషత్ అగ్రనాయకుడు అశోక్ సింఘాల్ మరణం తర్వాత ఆయనకు రెండు లక్ష్యాలు ప్రధానంగా ఉండేవని అందులో మొదటిది రామ మందిర నిర్మాణం […]

మళ్లీ రామ మందిరంపై దృష్టి
X

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రస్తుతం తమకు ప్రధానమైన అంశాలలో లేదని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వంలో ఉన్న నాయకులెవరూ ఈ ఏడాదిన్నర కాలంలో ఆ అంశాన్ని ప్రస్తావించనే లేదు. కాని రామ మందిర నిర్మాణ ఆవశ్యకతను ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ స్పష్టంగానే చెప్తున్నారు.

విశ్వహిందూ పరిషత్ అగ్రనాయకుడు అశోక్ సింఘాల్ మరణం తర్వాత ఆయనకు రెండు లక్ష్యాలు ప్రధానంగా ఉండేవని అందులో మొదటిది రామ మందిర నిర్మాణం అయితే రెండవది వేదాలను ప్రచారం చేయడం అని మోహన్ భగవత్ అన్నారు. విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ ఎస్ ఎస్ మందిర నిర్మాణ అంశాన్ని పదే పదే లేవనెత్తుతున్నాయి. బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత మోహన్ భగవత్ ఈ విషయం ప్రస్తావించడానికి ప్రాముఖ్యత ఉంది. బిహార్ లో ఘోర పరాజయం ఎదురైన తర్వాత బీజేపీ దారి మారాలన్న ఆలోచన సంఘ్ పరివార్ వర్గాలకు ఉన్నట్టుంది. అదే నిజమైతే అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు మందిర నిర్మాణ అంశాన్ని ఎక్కువ కాలం పట్టించుకోకుండా ఉండే అవకాశం ఉండకపోవచ్చు.

అశోక్ సింఘాల్ ఆకాంక్ష నెరవేర్చాలంటే మనమంతా చిత్త శుద్ధితో దీనికోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి అని భగవత్ చెప్పడంలో ఆంతర్యం సులభంగానే అర్థం అవుతోంది. రామ మందిరం నిర్మించడం అశోక్ సింఘాల్ కు నివాళి అర్పించడమేనని కూడా మోహన్ భగవత్ నొక్కి చెప్పారు.

“రామ మందిర నిర్మాణం, ఉమ్మడి వివాహ చట్టం రెండూ బీజేపీ దృష్టిలో ప్రధానమైన అంశాలే. ఈ రెండూ బీజేపీ ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చారు. కాని పార్లమెంటు ఉభయ సభల్లోనూ బీజేపీ సంపూర్ణమైన మెజారిటీ సాధించేదాకా ఈ రెండు లక్ష్యాలు సాధించలేమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు” అని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. అభివృద్ధిని కాదని బీజేపీ ఏ పనీ చేయదని కూడా ఆయన అన్నారు. విచిత్రమేమిటంటే కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా “రామ మందిర నిర్మాణాన్ని చేపట్టకుండా బీజేపీ ప్రజలను, శ్రీ రాముడిని కూడా మోసగిస్తోంది” అని చెప్పారు.

రామ మందిర నిర్మాణాన్ని సంఘ్ పరివార్ ప్రస్తావించడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. 2017లో ఉత్తర ప్రదేశ్ శాసన సభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 1989లో అడ్వాణీ రథ యాత్ర వల్లే బీజేపీ బలం గణనీయంగా పెరుగుతూ వచ్చింది కనక ఈ అంశాన్ని దీర్ఘ కాలం ఉపేక్షించడం కుదరదన్న అభిప్రాయం బీజేపీ నాయకుల్లో కూడా ఉంది.

రామ మందిర నిర్మాణం గురించి నొక్కి చెప్పడం బీజేపీ అనుసరించే మార్గంలో మార్పులు తేవడం ఆర్ ఎస్ ఎస్ సంకల్పం అయి ఉండొచ్చు.

-అనన్య

Click to Read: Rajamouli beats Salman Khan

First Published:  24 Nov 2015 1:56 AM GMT
Next Story