కాపుల్ని చావుదెబ్బ కొట్టిన బాబు

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోన్న సమయంలో కాపుల్ని దెబ్బతీయడానికి గతంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించి విజయం సాధించింది. ప్రఖ్యాత నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించడం దేశ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం. ప్రజారాజ్యం పార్టీకి లభించే ఆదరణ చూసి జాతీయ పార్టీ అయిన కాగ్రెస్‌తో సహా దాదాపుఅన్ని పార్టీలూ కలవరపాటుకు గురయ్యాయి. ఎన్నికల్లో ప్రజారాజ్యం విజయం సాధించడం ఖాయం అని,చిరంజీవి ముఖ్యమంత్రి అవడాన్ని ఎవరూ ఆపలేరనే అభిప్రాయానికి వచ్చారు. దీన్ని అడుగడుగునా పరిశీలిస్తోన్న కాంగ్రెస్‌ పార్టీ చిరంజీవిని తనదారిలోకి తెచ్చుకోవడానికి వ్యూహం రూపొందించింది. అనుక్షణం చిరంజీవిని,ఆయన అనుచరుల్ని అనుసరించింది. చిరంజీవి వేసే ప్రతిఅడుగునూ విఫలం అయ్యేలా చేసింది. ఎట్టకేలకు తన దారిలోకి తెచ్చుకుంది.

ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో రాష్ట్రంలో కాపులు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగారనే భావన వచ్చింది. కాపుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. కాపులతో పాటు అత్యధికంగా ఉన్న బిసిలుసైతం కొంత ధైర్యంగా ముందుకు వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కాపుల్లో మాత్రం ఎంతో ధీమా,ధైర్యం వచ్చింది. వంగవీటి మోహన్‌రంగా సమయంలో కాపుల్లో ఉన్న ఆత్మవిశ్వాసం మళ్లీ కోస్తా ఆంధ్రాలోనే కాకుండా మొత్తం కాపుల్లో కన్పించింది. బలమైన మూడోసామాజిక వర్గం,అధికారానికి అతిచేరువలో ఉన్నదనే నిర్ణయానికి అందరూ వచ్చేశారు. ఈసమయంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజారాజ్యాన్ని తనలో విలీనం చేసుకోవడంతో కాపుల సామ్రాజ్యం కుప్పకూలింది. కాపులు అబాసుపాలయ్యారు.నమ్మి వంచనకు గురయ్యారు. ప్రజారాజ్యం వస్తుంది…రాజ్యాధికారం చేపట్టబోతున్నాం…అని ప్రకటించుకున్న కాపులు,వారిని అనుసరించే బీసీలు అందరి ముందూ తలవంచుకునేలా చేసిన ఘనత చిరంజీవిదే. ఈవిషయంలో పాచిక వేసి,విజయం సాధించిన ఘనత మాత్రం కాంగ్రెస్‌ది. కాపులకు రాజ్యాధికారం ఇప్పట్లో సాధ్యం కాదు అనుకునే పరిస్థితులు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడ్డాయి.

పవన్‌తో చిగురించిన ఆశలు
ఇలాంటి సమయంలో కాపులకు సరైన నాయకుడు లభించలేదు. బిసి ఉద్యమాలు బలహీనంగానే ఉన్నాయి. వంగవీటి మోహన్‌రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఎమ్మెల్యే అయినా,నిలకడ లేకపోవడం,రోజుకోపార్టీ మారడంతో కాపులకు భరోసా ఇవ్వలేకపోయారు. కాపుల్లో ఆస్థాయిలో నాయకత్వాన్ని చేపట్టి,నడిపించే వారు లేకపోయారు. ఇలాంటి సమయంలో గడచిన ఎన్నికల్లో (2014) అనుకోని రీతిలో చిరంజీవి సోదరుడు,సినీ దిగ్గజం వపన్‌కళ్యాణ్‌ తెరమీదకు వచ్చారు. బిజెపి తరపున ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపడ్డారు. పార్టీలు అయితే కలవరపడ్డాయి. ఈనేపథ్యంలో బిజెపి తరపున ప్రచారం చేయడం,తెలుగుదేశం,బిజెపిలు మిత్రపక్షంగా వ్యవహరించడంతో గడచిన ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ వల్ల బాగానే ఓట్లు లాభించాయి. తప్పని పరిస్థితుల్లో కాపులు పవన్‌ని అనుసరించారు. అప్పటికే రాష్ట్ర విభజన చేసిన అపకీర్తిని కాంగ్రెస్‌ మూటగట్టుకొని ఉండటం,అదే పార్టీలో చిరంజీవి కొనసాగడంతో ఆంధ్రాప్రజలు కాంగ్రెస్‌ను మట్టిగరిపించారు. చిరంజీవిపైన అభిమానం ఉన్నా…తమ నేత అని కాపులు సైతం ప్రకటించుకున్నా..ఓట్లు మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి వేయలేదు. దీంతో కాపు ఓట్లు వపన్‌ ప్రభావంతో అటు బిజెపి,ఇటు టీడీపీకి పడ్డాయి.

జనసేన పేరుతో పవన్‌ రాజకీయ అవతారం ఎత్తడం కాపుల్లో మళ్లీ ఆశలు చిగురించారు.ప్రజారాజ్యం సమయంలో ఉన్నంత భరోసా లేకపోయినా పవన్‌ కళ్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్‌ చూసి, అంతకు మించిన కాపు నేత లేకపోవడం వల్ల పవన్‌పై ఆశలు పెంచుకున్నారు. ఎన్నికల సమయంలో ఓట్లు కురిపించిన పవన్‌పై అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి గానీ, ఇటు రాష్ట్రంలో టీడీపీ గానీ గౌరవ,మర్యాదలతోనే వ్యవహరిస్తోంది. ఉభయపార్టీలకూ పవన్‌ అంటేభయం ఉందన్న భావన ఏర్పడింది.దీన్ని దెబ్బతీయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయిన మరుసటిరోజునుంచే వ్యూహం రూపొందించారు. చివరకు విజయం సాధించారు. కాపుల్ని తనదారిలోకి తెచ్చుకోవడం, పవన్‌ని దెబ్బతీయడం ఎత్తుగడగా చంద్రబాబు రచించిన పథకం ఎట్టకేలకు విజయవంతం అయింది. కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు, కాపుల్ని బిసిల్లో చేర్చడం వంటి వాటిని తెరమీదకు తెచ్చి పవన్‌ కళ్యాణ్‌ను చావుదెబ్బతీసినట్లయింది. రాష్ట్రంలో కాపుల్ని మరో వందేళ్ల వరకూ ఎదగకుండా చేసే పథకం హిట్టయింది.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు, ఎస్సీల్లో రాజుకుంటోన్న విభేదాలకు చంద్రబాబే కారణం. రాజకీయం కోసం, అధికారం అనుభవించడం కోసం ఆయన వేసిన రెండు పాచికలూ బెడిసి కొట్టాయి. చంద్రశేఖర్‌రావును పక్కన బెట్టడం వల్లనే మరుగున పడిన తెలంగాణా ఉద్యమం రాజుకొంది. ఎట్టకేలకు ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడింది. ఎస్సీల్లో మాల,మాదిగల విభజనకు శ్రీకారంచుట్టి అన్నదమ్ముల మధ్య అగాధం సృష్టించారు. బిసిల విషయంలో ఆయనకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. వారు జీవితంలో కలవరు. తనకు పోటీగా రారు అని. దళిత ఉద్యమాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ పేరుతో విభజించారు. ఇప్పట్లో వారూ అధికారం కోసం దగ్గరకు కూడా రాలేరు. మిగిలిన బలమైన శక్తి కాపులు. వారిని కూడా చావుదెబ్బతీయాలంటే వారికి తాయిలాలు వేయాలి. అవే కాపు కార్పొరేషన్‌,కాపుల్ని బిసీల్లో కలపడం లాంటివి. నిజానికి కాపులను బిసీలలో కలపరు. కలపతాము అంటారు. కలపకుండా బిసీలతో ఉద్యమాలు చేయిస్తారు. కాపులను బిసీలలో కాలపతాననడం వల్ల బిసీలు ఎదురుతిరుగుతారు. కాపులతో వైరం పెంచుకుంటారు. చంద్రబాబు చలువవల్ల మాలా, మాదిగ విడిపోయినట్లే బిసీలు, కాపులు విడిపోతారు. దీంతో కాపుల ఉద్యమం నీరుగారినట్లే. రాజకీయ ప్రత్యామ్నాయ శక్తి నీరసించినట్లే. పవన్‌కళ్యాణ్‌ ఓడిపోయినట్లే. ఇపుడు రాజకీయ ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. కాపులు మరోసారి మోసపోయారు.

– సిద్దార్థరాయ్‌