Telugu Global
Others

విద్వేషం వెనక అపార చాతుర్యం

నిజం చెప్పడానికి ధైర్యం కావాలి. అబద్ధమాడడానికి చాతుర్యం చాలు. దేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే పనిలో నిమగ్నమైన వారు అబద్ధలాడడానికి అపారమైన చాతుర్యం ప్రదర్శిస్తున్నారు. హేతువాది నరేంద్ర ధబోల్కర్, హేతువాది, సీపీఐ నాయకుడు గోవింద్ పన్సారే, రచయిత కల్బుర్గీ హత్యలకు పాల్పడిన వారికి మధ్య ఎలాంటి సంబంధమూ లేదని సాక్షాత్తు ప్రభుత్వమే పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఒక లిఖిత ప్రశ్నకు సమాధానమిస్తూ మంగళవారం ఈ విషయం రాజ్య సభలో చెప్పారు. ఆయన […]

విద్వేషం వెనక అపార చాతుర్యం
X

RV Ramaraoనిజం చెప్పడానికి ధైర్యం కావాలి. అబద్ధమాడడానికి చాతుర్యం చాలు. దేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే పనిలో నిమగ్నమైన వారు అబద్ధలాడడానికి అపారమైన చాతుర్యం ప్రదర్శిస్తున్నారు. హేతువాది నరేంద్ర ధబోల్కర్, హేతువాది, సీపీఐ నాయకుడు గోవింద్ పన్సారే, రచయిత కల్బుర్గీ హత్యలకు పాల్పడిన వారికి మధ్య ఎలాంటి సంబంధమూ లేదని సాక్షాత్తు ప్రభుత్వమే పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఒక లిఖిత ప్రశ్నకు సమాధానమిస్తూ మంగళవారం ఈ విషయం రాజ్య సభలో చెప్పారు. ఆయన సమాధానం ప్రభుత్వ అభిప్రాయం కుందే పరిగణించవలసి ఉంటుంది.

గోవింద్ పన్సారే హత్యకు సనాతన సంస్థ అన్న మతత్వ సంస్థకు సంబంధం ఉందన్న ఆరోపణలున్నాయి. ఆ సంస్థ సభ్యుడిని ఒకరిని ఇటీవల అరెస్టు చేశారు. ఆయన తనకు పన్సారే హత్యతో ఏ సంబంధమూ లేదని చెప్పారట. ఆ సంస్థను నిషేధించాలన్న వాదనలు అంతకంతకూ బలం పుంజుకుంటున్నాయి. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని రిజుజు తేల్చి చెప్పారు. శాంతికి, మత సామరస్యానికి భంగం కలిగించే సకల సంస్థలపై గట్టి నిఘా వేసి ఉంచామని కూడా సదరు మంత్రి తెలియజేశారు.

దేశంలో అసహనం పెరిగిపోతున్న వాస్తవాన్ని అంగీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే అసహనాన్ని ప్రేరేపిస్తూ విద్వేషాన్ని రెచ్చగొట్టే వారందరూ సంఘ్ పరివార్ కుదురులోని వారే. వారి మీద చర్య తీసుకునే సాహసానికి ఒడి గడితే ప్రభుత్వానికే ముప్పు వస్తుంది. అందువల్ల అడ్డ దారుల్లో దొడ్డి దారుల్లో ఈ సంఘటనల మధ్య అంతస్సంబంధం ఏదీ లేదనీ, విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం ఏమీ జరగడం లేదని ప్రభుత్వం నమ్మ బలుకుతోంది.

ఈ ఘటనలన్నింటినీ కేవలం శాంతి భద్రతలకు పరిమితమైన అంశాలుగా, శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశాలని వాదిస్తోంది. ఆ మాట నిజమే. కాని విద్వేషాన్ని రెచ్చగొట్టే వారు, ఆ మాటకొస్తే సంఘ్ పరివార్ సిద్ధాంతాన్ని అంగీకరించని వారిని అంతమొందించడానికి సాహసించే వారు అనువైన చోట గురి చూసి దాడి చేస్తారు తప్ప ఆ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారో లెక్కగట్టి హత్యలకు పాల్పడరు. ఆ ప్రభుత్వాలను అపఖ్యాతి పాలు చేసే అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. పన్సారే, ధబోల్కర్ హత్యలు జరిగినప్పుడు అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కనక, కల్బుర్గీ హత్య కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో జరిగింది కనక ఆ విషయం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన విషయమన్నది కేంద్ర ప్రభుత్వ పెద్దల ఉరఫ్ సంఘ్ పరివార్ నాయకుల వాదన.

ఇదే సూత్రాన్ని దేశంలో జరుగుతున్న తీవ్ర వాదుల దాడులకు వర్తింప చేస్తే ఏమవుతుంది? మన దేశంలో జరిగిన తీవ్రవాద దాడులకు మాకేం సంబంధం లేదని పాకిస్తాన్ వాదిస్తే ఆమోదించి ఊరుకోవాల్సిందేనా. సరిహద్దు ఆవలి నుంచి పాకిస్తాన్ తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని మనం ఇల్లెక్కి గావు కేకలు పెడితే పాక్సిస్తాన్ దిగి వస్తుందా!

అసహనాన్ని రెచ్చగొట్టే యోగీ ఆదిత్యనాథ్, సాద్వి ప్రాచీ, సాక్షి మహరాజ్ వంటి వారు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు గనకే వారి మీద చర్య తీసుకోవడం లేదని భావించాలా? పోనీ ఈ వాదనను తర్కం కోసం అంగీకరిద్దాం.

కాని బిహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తూర్పు చంపారన్ జిల్లాలో మాట్లాడుతూ ఆ ప్రాంతం తీవ్రవాదానికి కేంద్ర బిందువు అని బాహాటంగా, నిరాధారంగా ఆరోపించారు. ఆయన దుష్ప్రచారానికి కారణం ఆ ప్రాంతంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉండడమే. వాస్తవం ఏమిటంటే ఆ ప్రాంతంలో ఒక్క తీవ్రవాద కేసైనా నమోదు కాలేదు. ఈ బూటకపు ఆరోపణ వెనక ముస్లింల పని పట్టండి అన్న సూచన ఉందనుకోవాలి.

విద్వేషం రెచ్చగొట్టే వారు అక్కడితో ఆగలేదు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగానే సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహాదళితులకు, దళితులకు, గిరిజనులకు, వెనుకబడిన తరగతుల వారికి, ఓబీసీలకు కేటాయించిన రిజర్వేషన్లను లాలూ, నితీశ్ కాజేసి “మరో వర్గానికి” కట్టబెడతారు అని అన్నారు. ఆ మరో వర్గం ముస్లింలనే కదా!. అలా ఒక వర్గానికి కేటాయించిన రిజర్వేషన్లను ముస్లింలకు మాత్రమే కట్టబెట్టడానికి లేశ మాత్ర అవకాశం కూడా లేదని గ్రహించలేని వ్యక్తి ప్రధానిగా అధికారం చెలాయిస్తున్నారని గానీ, అమాయకంగా మాట్లాడుతున్నారని నమ్మే అమాయకులు ఎవరూ లేరు.

విద్వేషాన్ని రెచ్చగొడుతున్న వారు ఎవరో ప్రత్యేకంగా ఎవరికీ విడమర్చి చెప్పాల్సిన పని లేదు. విద్వేష ప్రచారం అంతా ముస్లింలకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన ఆయుధమే. అధికారంలో ఉన్న వారే విద్వేషం రెచ్చగొట్టడానికి సంకల్పిస్తే ఇలాంటి సంఘటనలను ప్రభుత్వం ఖండిస్తుందని అనుకోలేం. విద్వేషం రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నది అనామకులైన సంఘ్ పరివారీయులు కాదు. ఎంపీలు, కేంద్ర మంత్రులే ఆ క్రతువులో నిమగ్నమై ఉన్నారు.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విద్వేషం పెరిగిపోతోంది జాగ్రత్త అని అనేక సార్లు హెచ్చరించారు. విద్వేషాగ్ని రగిలితే ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుందని రిజర్వూ బ్యాంకు గవర్నర్ రాజన్ హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉండలేను అని ప్రసిద్ధ రచయిత యు.ఆర్. అనంతమూర్తి ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే అన్నారు. వారిని ఎవరూ తప్పుబట్టలేదు. విద్వేషం సెగలు సర్వవ్యాప్తమవుతున్నందువల్ల “మనం ఎక్కడికైనా వెళ్లిపోదామా” అని తన సతీమణి చెప్పిందని ఆమీర్ ఖాన్ అంటే సంఘ్ పరివారీయులు ఒక్కుమ్మడిగా విరుచుకు పడ్డారు. పోతే పో! ఏ దాశానికి పోతావ్? అని సంఘ్ పరివార్ పంచలో చేరిన అనుపం ఖేర్ వంటి వారు ఆగ్రహించారు. షారుఖ్ ఖాన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. వారిని దేశద్రోహుల జాబితాలో చేర్చారు. మహారాష్ట్రలో ఓ పెద్ద మనిషి ఈ ఖాన్లు అందరూ పాముల్లాంటి వారని తేల్చారు. ఆమిర్ ఖాన్ ను చెంపదెబ్బ కొట్టిన వారికి లక్ష రూపాయలిస్తానని పంజాబ్ కు చెందిన శివసేన నాయకుడు ప్రకటించారు.ఇది అసహనం కాదట. పార్లమెంటు వేదిక మీద సర్కారు వారు అసత్యాలు వల్లిస్తుంటే వినలేక సభ నుంచి నిష్క్రమించిన వారిలోనే అసహనం గూడుకట్టుకుందట. ఎంత చాతుర్యం లేక పోతే ఇలా వితండ వాదం చేయగలరు గనక.

-ఆర్వీ రామారావ్

First Published:  2 Dec 2015 12:54 AM GMT
Next Story