Telugu Global
Cinema & Entertainment

డైలాగ్‌ల హోరు " శంకరాభరణం బోరు

రేటింగ్‌: 2.00 విడుదల తేదీ : 04 డిసెంబర్‌ 2015 దర్శకత్వం :  ఉదయ్‌ నందనవనం బ్యానర్‌: ఎం.వి.వి సినిమా కథ: కోన వెంకట్‌ ప్రొడ్యూసర్‌: ఎం.వి.వి. సత్యనారాయణ సంగీతం : ప్రవీణ్‌ లక్కరాజు నటీనటులు : నికిల్‌, నందితా రాజ్‌ పాత సినిమాల పేరుతో వచ్చిన కొత్త సినిమాల్ని తిప్పికొట్టడంలో జనం సిద్ధహస్తులు. ఈ కొత్త సినిమాల వల్ల పాతసినిమాలపైన మనకు మరింత గౌరవం పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో పాత హిట్‌ సినిమాల పేరుతో వచ్చి ఆదరణ పొందిన సినిమా […]

డైలాగ్‌ల హోరు  శంకరాభరణం బోరు
X

రేటింగ్‌: 2.00
విడుదల తేదీ : 04 డిసెంబర్‌ 2015
దర్శకత్వం : ఉదయ్‌ నందనవనం
బ్యానర్‌: ఎం.వి.వి సినిమా
కథ: కోన వెంకట్‌
ప్రొడ్యూసర్‌: ఎం.వి.వి. సత్యనారాయణ

సంగీతం : ప్రవీణ్‌ లక్కరాజు
నటీనటులు : నికిల్‌, నందితా రాజ్‌

పాత సినిమాల పేరుతో వచ్చిన కొత్త సినిమాల్ని తిప్పికొట్టడంలో జనం సిద్ధహస్తులు. ఈ కొత్త సినిమాల వల్ల పాతసినిమాలపైన మనకు మరింత గౌరవం పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో పాత హిట్‌ సినిమాల పేరుతో వచ్చి ఆదరణ పొందిన సినిమా గీతాంజలి. మళ్ళీ అదే రిపీట్‌ అవుతుందనుకున్న ప్రముఖరచయిత కోన వెంకట్‌ శంకరాభరణం తీసారు. కానీ చరిత్ర రిపీట్‌ కాలేదు.

“ఈ సినిమా బీహార్‌లో నడిచినప్పటికీ పాత్రలు తెలుగులోనే మాట్లాడుతాయి. లాజిక్‌ వెతక్కుండా మ్యాజిక్‌ని ఎంజాయ్‌ చేయండి” అని సినిమా ప్రారంభంలో వేస్తారు. కాని ఈ సినిమాలో లేనిదే మ్యాజిక్‌.

మ్యాజిక్‌ షో చూపిస్తామని చెప్పి అనేక సాముగారిడీలు చేసి చతికిల పడ్డాడు కోనవెంకట్‌. దీనికి కారణం చేతిలో మంత్రదండం ఉందని భ్రమపడడమే. మంత్రమైనా తంత్రమైనా పదేపదే పారదు. హిందీ సినిమానుంచి యధాతధంగా తీసుకున్న కథకి తెలుగు మసాలాలు కలిపారు. కారణం తెలియదు గానీ మూలంలో ఉన్న మూడ్‌ని మిస్సయ్యారు.

కథలోకి వస్తే గౌతం (నికిల్‌) అమెరికాలో ఉంటాడు. తండ్రి సుమన్‌ కోటీశ్వరుడు. అయితే స్నేహితులు మోసం చేయడం వల్ల అప్పులపాలై ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. హీరో అడ్డుపడి వారిస్తాడు. ఇండియాలో తల్లిపేరుతో ఉన్న శంకరాభరణం అనే ప్యాలెస్‌ని అమ్మి అప్పులు తీర్చాలని వస్తాడు. తీరా చూస్తే ఆ ప్యాలెస్‌లో తల్లితరపున అనేకమంది బంధువులుంటారు. వాళ్ళ అభిమానాన్ని చూసి ఆ ప్యాలెస్‌ని అమ్మలేకపోతాడు. ఈలోగా కిడ్నాప్‌ గ్యాంగ్‌లు హీరో వెంటపడతాయి. తొలుత ఒక గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేస్తుంది. తరువాత హీరో వద్ద డబ్బులేదని తెలిసి ఇంకోగ్యాంగ్‌కి అమ్మేస్తుంది. ఇదంతా హీరో ఐడియానే. ఇలా గ్యాంగులు చేతులు మారిన కథ ఏమవుతుందన్నదే క్లైమాక్స్‌. ఈ మథ్యలో హీరోయిన్‌తో ప్రేమకథ.

కథ వినడానికి బావున్నప్పటికీ స్క్రీన్‌ ప్రెజెంటేషన్‌ బోర్‌గా ఉంది. కృష్ణవంశీ సినిమాలోలా పెద్దకుటుంబం, రకరకాల వయసుల్లో వ్యక్తులు ఆ ప్యాలెస్‌లో కనిపిస్తారు. వాళ్లు ఎవరు ఎవరన్నది మనకు అర్ధం కాదు. అంతేకాకుండా సినిమాలో అనేకమంది విలన్‌లు. ఈ గందరగోళంలో ఏ క్యారెక్టర్‌ కూడా రిజిస్టర్‌ కాదు.

ఇది కాకుండా డైలాగులో హోరు. ఆగడు సినిమాలో శీనువైట్ల చేసిన తప్పే ఇక్కడకూడా జరిగింది. ప్రాసలు, పంచ్‌లైన్‌లు ఎక్కువై కథ పలుచనైంది. కథ వేగంగా నడుస్తున్నపుడు డైలాగులు అదనపు బలంగా మారుతాయే తప్ప డైలాగులవల్లే ఎక్కడా సినిమాలు ఆడవు. పైగా తెరమీద కనిపించే ప్రతిపాత్ర ఏదో ఒక ప్రాస, పంచ్‌ మాట్లాడ్డానికి ప్రయత్నిస్తే ప్రేక్షకులకు చిరాకు పుడుతుంది.

ఒక పాత్ర స్వభావం, మేనరిజమ్స్‌ ఏమీ రిజిస్టర్‌కాకుండా అలా వచ్చి వెళ్ళిపోవడం అన్ని సినిమాల్లో జరిగినపట్టే ఇక్కడా జరిగింది. నికిల్‌ కొన్ని సన్నివేశాల్లో బాగా నటించాడు. హీరోని ఇంట్రడ్యూస్‌ చేసే సాంగ్‌ని ఎవరు కనిపెట్టారో తెలియదుగానీ ప్రతి సినిమాలో అదో తలనొప్పి. హీరో తన క్యారెక్టర్‌ని వివరిస్తూ ఆ పాట పాడుతాడు. కాని చాలా సినిమాల్లో హీరో ఏం పాడుతాడో ఆ వాయిద్యాల హోరులో అక్షరం కూడా అర్ధం కాదు. ఈ సినిమాలో కూడా అలాంటి పాట ఒకటుంది.

హీరోయిన్‌ నందితకి నటించడానికి ఏమీలేదు. మున్నీగా అంజలి లేడీ డాన్‌గా నటించింది. కేవలం 10 నిముషాల పాత్రే కావడం వల్ల ఆమె నటన గుర్తుండదు.

రెండు గంటల ముప్పయి నిముషాల నిడివి చాలా ఎక్కువ అనిపిస్తుంది. సప్తగిరి మొదలుకుని జబర్దస్త్‌ టీం వరకూ అందరూ వున్నా థియేటర్‌లో పగలబడి నవ్వినవాళ్ళు లేకుండా పోయారు. తాను రాసిన సీన్లన్నీ శీనువైట్ల తీయకపోవడంవల్లే బ్రూస్‌లీ ఆడలేదని కోనవెంకట్‌ అన్నాడు. మరి ఇది సొంత సినిమా, అన్నీ తాను రాసుకున్నవే అయినా ఇట్లా ఎందుకుందో ఆయనే చెప్పాలి. సినిమాని తిట్టడం సులువు, తీయడం కష్టం అని ఇదే సినిమాలో ఒక డైలాగుంది. తీయడం కష్టమే కావచ్చు. బాగా తీయడం ఇంకా కష్టం. వేళ్ళు బలంగా ఉంటే చెట్టుబలంగా ఉంటుందని ఈ సినిమాలో ఒక కొటేషన్‌. డైలాగులు ఎక్కువుంటే సినిమా బలంగా వుండదని శంకరాభరణం చెబుతుంది.

ఈ సినిమాని జనం చూడాలనుకోడానికి కోన వెంకటే కారణం… బయటికొచ్చి తిట్టుకోడానికి ఆయనే కారణం.

-జిఆర్‌. మహర్షి

Click to Read: When KCR’s best friend meets KCR’s worst enemy!

First Published:  4 Dec 2015 3:43 AM GMT
Next Story