వీళ్లు మనుషులు కాదు.. యూపీ పోలీసులు

ఖాకీ చొక్కా వేసుకుంటే మానవత్వం స్థానాన్ని రాక్షసత్వం ఆవరిస్తుందా?. పోలీసులు మనుషులు కారా?. అందరి పోలీసుల విషయంలో ఏమోగానీ ఉత్తరప్రదేశ్‌ ఖాకీలను చూస్తే మాత్రం అవుననే అనిపిస్తుంది. నేరం చేస్తే శిక్షించడానికి కోర్టులున్నాయి. ఆ విషయం అక్కడి పోలీసులకు తెలుసు. కానీ ఓ ముగ్గురు పోలీసులు మాత్రం రాక్షసుల్లా మారారు. దొంగతనం కేసులో ఒక యువకుడిని పట్టుకొచ్చి దారుణంగా కొట్టారు. యువకుడిని బల్లమీద పడుకోబెట్టి అతడి తలను ఒక కానిస్టేబుల్‌ తన రెండు కాళ్ల మధ్య బంధించాడు.

మరో కానిస్టేబుల్ యువకుడి రెండు కాళ్లు కదలకుండా పట్టుకున్నాడు. మూడో ఖాకీ ఇక రెచ్చిపోయాడు. ముందుభాగంలో ధృడమైన రబ్బర్‌ అమర్చిన బ్యాట్‌తో విచక్షణరహితంగా కొట్టాడు. దెబ్బలు తట్టుకోలేక యువకుడు వదిలేయండని వేడుకున్నా వారి మనసు కరగలేదు.  విడతల వారీగా కసి తీరేవరకు కొట్టారు. ఈ క్రూరదృశ్యాలను కొందరు రహస్యంగా బంధించారు. దీంతో సదరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ దారుణ ఘటన ఈత్వా పోలీస్ స్టేషన్‌లో జరిగింది. ఈ ప్రాంతం ములాయంసింగ్‌ యాదవ్‌కు కంచుకోటలాంటిది. ఇక్కడే ఈ ఘటన జరగడం బట్టి యూపీ పోలీసుల మైండ్ సెట్ ఎంత భయకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా దృశ్యాలు బయటకు వచ్చాయి కాబట్టి ఈ ఘటన గురించి తెలిసింది. దృశ్యాలకు అందని, బయటి ప్రపంచానికి వినిపించని దారుణాలు ఒక్కో పోలీస్‌ స్టేషన్‌లో ఎన్ని జరుగుతున్నాయో ?.