మోదీ తినరు… తిననివ్వరు అదే వారి బాధ!

విజయవాడలో జరిగిన కనకదుర్గ ఫైఓవర్‌ శంకుస్తాపనకు హాజరైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మరోసారి మాటల తుటాలు పేల్చారు. తాను ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నిక కాకపోయినా తెలుగువారంటే అభిమానంతో ఎన్నో చేస్తున్నానని చెప్పారు.అయినా కొందరు వ్యక్తులు తన దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారని విమర్శించారు. వెంకయ్యనాయుడును విమర్శిస్తే పత్రికల్లో టీవీల్లో కనిపిస్తామన్న ఉద్దేశంతోనే కొందరు అలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తనను రాష్ట్ర్రంలోకి రాకుండా అడ్డుకుంటే నష్టపోయేది ప్రజలేనని అన్నారు.

కొందరు పదేపదే భూసేకరణపై విమర్శలు చేస్తున్నారని… అలాంటి వారు భూమి లేకుండా అభివృద్ధి చేసే ఐడియా చెప్పాలని కోరారు. భూమి లేకుండా రోడ్లు, రాజధాని కట్టడం, గాలిలో విమానాశ్రయం నిర్మించడం వంటి ఐడియాలు ఉంటే విపక్షాలు చెప్పాలని సెటైర్ వేశారు. కాంగ్రెస్‌ 50 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని కేవలం ఐదేళ్లలో చేసి చూపిస్తామన్నారు. మోదీ తినరు… ఎవరినీ తిననివ్వరని(అవినీతికి సంబంధించి) అదే విపక్షాలకు నచ్చడం లేదని వెంకయ్య విమర్శించారు. తనకు ఏమాత్రం అవకాశం ఉన్నా తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నానని వెంకయ్యనాయుడు చెప్పారు. అందులో భాగంగానే ఏపీకి లక్షా 98వేల ఇళ్ళు మంజూరు చేశామన్నారు.