Telugu Global
Others

పెద్దకూర X పందికూర

నాకో మిత్రుడున్నారు. చాలా పెద్ద మనిషి, జ్ఞాని, మంచి వక్త, ఆలోచనాపరుడు. ఆయన శుద్ధ శ్రోత్రీయ వంశంలో జన్మించారు. కాల క్రమంలో కమ్యూనిస్టయ్యారు. ఆయన మాంసాహారంకూడా తినగలరు. తినడానికీ తినగలగడానికీ తేడా ఉంది. ఆయన మాంసాహారం తినే తీరు చూస్తే నాకు మాంసాహారం ముట్టకపోతే కమ్యూనిస్టును కాదనుకుంటారేమోనన్న భయంతో తింటున్నట్టుగా ఉంటుంది. సాంప్రదాయిక కుటుంబంలో పుట్టినందువల్ల వచ్చిన తంటా ఇది. ఆహారపు అలవాట్లు వ్యక్తిగతమైనవి. ఎవరికిష్టమైంది వారు తిననూ వచ్చు. ఇష్టం కాకపోతే మాననూ వచ్చు. ఏం […]

పెద్దకూర X పందికూర
X

RV Ramaraoనాకో మిత్రుడున్నారు. చాలా పెద్ద మనిషి, జ్ఞాని, మంచి వక్త, ఆలోచనాపరుడు. ఆయన శుద్ధ శ్రోత్రీయ వంశంలో జన్మించారు. కాల క్రమంలో కమ్యూనిస్టయ్యారు. ఆయన మాంసాహారంకూడా తినగలరు. తినడానికీ తినగలగడానికీ తేడా ఉంది. ఆయన మాంసాహారం తినే తీరు చూస్తే నాకు మాంసాహారం ముట్టకపోతే కమ్యూనిస్టును కాదనుకుంటారేమోనన్న భయంతో తింటున్నట్టుగా ఉంటుంది. సాంప్రదాయిక కుటుంబంలో పుట్టినందువల్ల వచ్చిన తంటా ఇది.

ఆహారపు అలవాట్లు వ్యక్తిగతమైనవి. ఎవరికిష్టమైంది వారు తిననూ వచ్చు. ఇష్టం కాకపోతే మాననూ వచ్చు. ఏం తినాలో ఏఎం తినకూడదు అనేది ఎంత వ్యక్తిగతమైంది అయినా అది సామాజిక అంశం కూడా. సమాజం అలవాట్లు వ్యక్తిని ప్రభావితం చేస్తాయి. ఆహార అలవాట్లు మారనూ వచ్చు. సంస్కృతీకరణ పెరిగే కొద్దీ ఆహర అలవాట్లలో మార్పులు వస్తాయి. నాజూకుతనం రాటుదేరడం కూడా దీనికి కారణం. మతాలవారీగా, కులాలవారిగా కూడా ఆహార అలవాట్లలో తేడాలు ఉంటాయి. శాఖాహారుల ఇళ్లల్లో ముక్క లేకపోతే బుక్కెత్తలేని వారు బయలుదేరవచ్చు. మాంసాహారుల ఇళ్లల్లో పుట్టిన వారు అనేకానేక కారణాల వల్ల శాకాహారులుగా మారొచ్చు. సమాజం ఆహార అలవాట్లను ప్రభావితం చేయడం కొంత వరకు నిజమే అయినా ఎవరి తిండి వాళ్లే తింటారు కనక అంతిమంగా ఆహారం వ్యక్తుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడిందే. గోరా నాస్తికోద్యమంలో భాగంగా ఏడాదికి ఒక సారి విందు ఏర్పాటు చేసి అందులో పెద్దకూర, పంది కూర కూడా వడ్డించే వారు. ఆయన ఉద్యమం అన్ని మతాలకు వ్యతిరేకమైంది.

కాని ఆ పరిస్థితి క్రమంగా మారుతోంది. ఎవరేం తినాలో తామే నిర్ణయిస్తామనేంతటి అహంకారం పెరిగిపోతోంది. దీనికి అధికారం తోడవుతోంది. ఒక వర్గం వారు పెద్దకూర తింటారు కనక మరో వర్గం వారు గోవును తినకూడదంటారు. ఒక వర్గం వారు పంది మాంసం తినరు కనక పంది మాంస ఉత్సవాలు నిర్వహిస్తారు. పెద్ద కూర ఉత్సవాలూ జరుగుతున్నాయి. కాదనం. కాని దానికి కారణం పెద్ద కూర తినేది, పంది కూర తిననిది ఒక వర్గం వారు కాబట్టి పంది కూర పండగలు జరపాలనుకునే వారిలో నియంతృత్వ పోకడలున్నాయి. పెద్ద కూర ఉత్సవాలను జరిపే వారిలో తమ ఆహార అలవాట్లను పరిరక్షించే సామూహిక చైతన్యం ఉంది. పెద్ద కూర తీనే వాళ్లను పరాయివాళ్లుగా జమ కడితే వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి కనక వంటగదికి పరిమితం కావాల్సిన తిండి వ్యవహారం రోడ్డెక్కుతోంది. తమ తిండి మీద ఆంక్షలు పెట్టడాన్ని సహించకుండా ఉండాలంటే, ఆ హక్కును పరిరక్షించాలంటే వీధులకెక్కక తప్పదు. పందికూర ఉత్సవాలలో గిల్లికజ్జాలు పెట్టుకునే తత్వం, ఒక వర్గం వారిని రెచ్చగొట్టే ప్రయత్నం బాహాటాంగానే కనిపిస్తున్నాయి.

beafపెద్ద కూర తినే వారు ముస్లింలు మాత్రమే అన్న అపోహే ఈ కయ్యానికి కాలుదువ్వే ధోరణికి కారణం. హిందువులలో అనేక సామాజిక వర్గాల వారూ పెద్దకూర తింటారు. దళితులు, లంబాడీలు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన కులాలలో కొన్ని కులాలకు చెందిన వారు పెద్ద కూర తింటారు. అయితే అది దళితుల ఆహారం కింద, ముస్లింల ఆహారం కింద పరిగణిస్తున్నారు. సంఖ్యాబలం ఉన్నందువల్ల దళితులూ హిందువులేనని దబాయిస్తారు కాని సవర్ణులు వారిని తమతో సమానంగా చూడరు. మామూలుగా పెద్ద కూర తినే సామాజిక వర్గానికి చెందని వారు కూడా ఫాషన్ కోసమో, ధిక్కార స్వభావంతోనో తినొచ్చు. మహమ్మద్ అలీ జిన్నా హాయిగా పంది మాంసం తినే వారు. రంజాన్ నెలలో ఆయన రోజా పాటించిన దాఖలాలు లేవు. అలాగని ఆయన నాస్తికుడేమీ కాదు. ముస్లిం కాకుండా పోలేదు. దేశాన్ని మత ప్రాతిపదిక మీద చీల్చిన ఘనుడాయన.

ముస్లింలలోనూ ఉన్నత వర్గాల వారు పెద్ద కూర తినరు. అది వారి హోదాకు భంగమని భావిస్తారు. దీన్నిబట్టి పెద్ద కూర తినడం వెనక ఆర్థిక కారణాలూ ఉన్నాయనే. అన్ని రకాల మాంసాహారాల్లోనూ అదే చౌక మరి. పేదలకు అదే గతి. హిందువులలో చాలా సామాజిక వర్గాల వారికి పంది మాంసం తినడం అంటే అహం దెబ్బతిన్నంత పని. అందుకే ముట్టరు. తెలంగాణతో పోలిస్తే కోస్తా ఆంధ్రలోనే పంది మాంసం తినే హిందువులు ఎక్కువ.

చరిత్రకు అందినంత మేరకు తెలుగు నేలను ఎక్కువ కాలం ఏలింది ముస్లింలే. 14వ శతాబ్దం నుంచి మొదలుకుని బహమనీ సుల్తాన్లు,కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు తెలుగునేలను ఏలారు. వారంతా ముస్లింలే. వారు పంది మాంసం తినరు. కాని వారు పంది మాంసాన్ని నిషేధించలేదు. ఇప్పుడు పెద్ద కూర తినడంపై నానా యాగీ చేస్తున్నారు. 1960లో గోవధ నిషేధం పేరుతో ఉవ్వెత్తున లేచిన ఉద్యమం ఇప్పుడు అధికారం అండతో మరో సారి విజృంభిస్తోంది. ఈ నిరంకుశత్వాన్ని ఎదుర్కోవడానికే పెద్ద కూర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

2012లో ఉస్మానియా విశ్వ విద్యాలయ విద్యార్థులు మొదటి సారి ఈ ఉత్సవం నిర్వహించారు. అప్పుడు కేంద్రంలో మోదీ అధికారంలో లేరు. బీజేపీ ఇంత బలంగా లేదు. కాని పెద్దకూర మీద వ్యతిరేతకత అప్పుడూ ఉంది. అందుకే పెద్ద కూర ఉత్సవంగా మారాల్సి వచ్చింది. ఇప్పుడు అధికారం అండ ఉంది కనక విద్వేషాన్ని రెచ్చగొట్టాలనుకునే వారు పెద్దకూర ఉత్సవానికి విరుగుడు కనిపెట్టారు. అదే పంది కూర పండగ.

డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం. ఆహార హక్కు కూడా మానవ హక్కుల దినోత్సవంలో భాగం కనక డిసెంబర్ 10న పెద్ద కూర ఉత్సవం నిర్వహిస్తున్నారు. కాని ఆ ఉత్సవానికి అనుమతి లేదు. అయినా తమ సంకల్పం విరమించేది లేదని నిర్వాహకులు అంటున్నారు. తినే పదార్థానికి కూడా ఉత్సవాలు నిర్వహించాల్సి రావడం అంటే విద్వేష వాతావరణం ఎంత చిక్కగా అలుముకుందో గ్రహించవచ్చు.

-ఆర్వీ రామారావ్

First Published:  9 Dec 2015 9:51 AM GMT
Next Story